అనుకరణ/అనుసరణ: సుందరరామునికొక నూలిపోగు

ముందుమాట: ఇంతవరకు చదవనివారు తప్పక తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి తిరిగి పొడవని పొద్దు మాత్రం చదివే ఇక్కడి నుంచి పొడిగించండి. ఇక్కడ ఆ ప్రస్తావనకి మన్నిమ్చినందుకు వారికి కృతజ్ఞతలు.

మీ రచనలకి ముడిసరుకు ఎక్కడిది? అన్న ప్రశ్నించబడినపుడు "స్యయంభువునో, బుట్టల మీద కాగితపు పేస్ట్ రాసి చేసే పోత బుట్ట మాదిరి నేనూ తెలియకనే చదివినవన్నీ పోత పోసుకుని పుట్టిన కవినో... ఇక నా రచనలు అన్నీ సాధారణ స్థాయివే. నేను సగటు కవిని కూడా కాను." ఇది నా మనస్సాక్షి ఇచ్చిన బదులు.

ఇక వ్యాసంలో నన్ను నిలవరించిన పంక్తులివి.

"..ఆయన్ని అనుకరిస్తున్నవారు చాలామంది ఉన్నారు. నాకు పాటలు రాయడం రాదు. కానీ రాయాల్సివస్తే అలాంటివారిలో ఒకడుగా మారడానికి నాకభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన్ని మించడం సంగతలా ఉంచి, అనుకరించడం కూడా కష్టసాధ్యమే. సాధారణంగా అనుభూతులు మాటలకు కారణమవుతాయి. కానీ ఇందుకు విపర్యాసంగా వేటూరి ప్రయోగించిన మాటలే శ్రోతల్లో అనుభూతుల్ని సృష్టిస్తాయి..."

ఎంత అక్షరసత్యం? అక్కడినుంచి పుట్టినదే ఈ ఆలోచన.

అలాగే ఫణీంద్ర, మౌనమై పాడనీ బాధగా అంటూ ఒక కవితగా ఆయనకి నివాళి ఇచ్చారు.

ఇక తనికెళ్ళ భరణీ గారి సన్మానపత్రం, ఒరేయ్ సుందర్రాముడూ...! కంటినీటి కుండల్ని బద్దలు చేసేసింది.

మిగిలిన మిత్రులూ రాసి ఉంటారు కానీ సమయాభావం వలన నేను అన్నీ చూడలేదు, అన్యధా భావించవద్దు.

ఆ అక్షరశిల్పికి నా వంతుగా ఒక్కటైనా పాట/గేయం వంటి చిరు రచనతో ఆయనకి అంజలి ఘటించాలని. నేను భాషాపరంగా, భావన పరంగా ఆయన ముందు ఒక గడ్డిపోచనే. నాది పేలవమైన రచనే. కానీ ఒక ప్రేరణ నుంచి వచ్చిన రెండు రచనలు ఇక్కడ పెడుతున్నాను. తప్పక కొన్ని కాదు అన్ని పదాలు విన్నవే అని కూడా అనిపిస్తాయి. ఇది అనుకరణ/అనుసరణ ఏది అన్నది నాకు తెలియదు.


**************************************************
ఇక ఇది ఒక కవిగా నాకు నేను వెళ్ళిన మనస్థితి/అనుభూతి అలాగ వచ్చిన గాయాలో/గేయాలో.


ప్రేరణ :- కలిసిన క్షణాల సంబరం, విడిపోవటం, ద్వేషించబడుతున్నానేమోనన్న సంశయం, పోనీ ఆ దూరం వద్దు, మళ్ళీ మొదలుపెడదాం అన్న ఆశ కలగలిపి, ముందుగా ఒక వచనమైతే..

విధికి/కాలానికి/తనకి గోడు వెళ్ళబోస్తూ..

నువ్వు రావన్న తలపు నాలో వేళ్ళూనిన వటవృక్షమల్లే పాకిపోతే ఆ వేళ్ళు మదిగోడలను బీట వారుస్తాయి. ఎప్పటికో ఆ బీట పెద్దదై గుండె పగిలి పోవొచ్చు, కాదనను. కాని, నీ ఉదాసీనత విషమై మైకంలా నన్ను కమ్మేసినప్పుడు మొత్తం గా నేను కుప్పకూలి పోకముందే చిగురులు వేసే తలపులు వాడి.... తలపనేదే మొదలు కంటా మాడీపోనూ వచ్చు, ఆ మదిని పూర్తి గా ఆ శిధిలాల కిందకి తోసేసి ఏమి జరగనట్లు ఒకప్పుడూ నాకు మనసు ఉండేది అనే ఆనవాలే లేనట్లు బతికెయ్యొచ్చు.

ఇలా జరిగే అవకాశం కూడా వుంది కాని ..............................

నీ ద్వేషం నన్ను చావనీదు బతకనీదు... ఏదో నీదగ్గర నుంచి వస్తోంది..... అది ద్వేషం తో నిండిన వడగాలో, ఆ వడగాలిలో నువ్వు నన్ను అలా ఐన తలచుకుంటూన్నావన్న చిన్ని శీతల పవనమో..!! ఏది చంపుతోందో, ఏది బతికిస్తుందో తెలియని అయోమయం లో నిర్వేదం గా ఆ ద్వేష కీలాగ్ని లో దగ్ధమవుతూనే, ఆ అగ్నికీలల నుంచి పునీతమైన నన్నేలే రారాజువు నువ్వని ఆశ తో మనస్సు కాలుతున్నా జీవించటం, కన్నీళ్ళతో మంటలార్పటం ఎంత కష్టం ఎంత కష్టం మనసు ఎగిసిపడుతుంది ఎండూటాకులా .....

అందుకే ఇష్టపడిన వాళ్ల దగ్గర్నించీ ద్వేషం ప్రతిగా తీసుకోవటం కన్నా, అసలేమీ లేకపోవటం, మళ్ళీ అపరిచితులుగా మారిపోవటం... ఇదే నయమనిపిస్తుంది. మళ్ళీ నిన్ను పరిచయం చేసుకునే వీలుందా..పోనీ వీలు కల్పిస్తావా, నీవు వలదన్నా వీలుచేయమన్న నా వినతి ఆలకిస్తావా.. అసలింకా మనసు ఖాళీగా ఉందా, ఇరుకు గోడల్లో బందీవైపోయావా.

ఇది మామూలుగా నేను నైరాశ్యం కలేసిన కవితగా రాసుకుంటే, ఇలాగ వచ్చేది..

***************

కరిగే మంచు..
గుండె బరువు.

తేలిపోయే మబ్బు
కంటి చెమ్మ.

సుడి తిరిగే గాలి
ఎడతెగని యోచన

విరిసే పువ్వు
ముడిచిన నవ్వు

మనసున పరవశం
మతిచెడి అలౌకికం

అదే నేను, ఇదే ప్రకృతి
ఓనాడు ఒకవైపు నిలబడలేదా?

ఏది సత్యం? ఏది నిత్యం?
శబ్దం ఎందుకు మౌనాన్ని కల్తీచేయను..
మరణాన్ని ఆపటమెందుకు
జననంలోనే శోకం వూపిరి పోసుకోలేదా?

నాలుగు గోడల విశ్వం,
రెక్కలేని అంగం,
దిగుడుబావిలో బింబం,
గుండెలవిసే కురూపి

************************

అలాకాక, ఆ బాధని కాసేపైనా కల/ఊహ/ఆశ కలేసిన పాటలో దాచేస్తే ఇలా...

*************

ఏటిగట్టున మాట
మూగనోము పట్టింది
ఏమెరుగని మనసు
గాలి పాట పాడింది ॥ప॥


వెన్నెల్లో, వేకువల్లో
ఎదలో పూచే గోవర్ధనాలు,
నీ కోసమే, ఒక్క నీ కోసమే
పరిమళించిన ప్రేమసుమాలు.
సందెవేళకి రాలిపడిన మందారాలు,
పొద్దుపొడుపున జారిపడిన పారిజాతాలూ
వెక్కిరించినా, ఎత్తిపొడిచినా
ఎదలోపల పదిలం అనురాగం... ॥చ॥


కన్నుల్లో, కలల్లో,
ఎవరో వేసిన రంగవల్లులు,
నీ కోసమే, ఒక్క నీ కోసమే
ప్రభవించిన సచిత్రకథనాలు.
ఒడ్డువీడి విరుచుకుపడే కల్లోలసాగరాలు,
కావిరంగులో నిస్తేజమైన చిత్రలేఖనాలూ,
నిలదీసినా, విసిగించినా,
ఎదవీడని కవనం అపురూపం.. ॥చ॥

*************

అదే మరోలా ఇంకాస్త భరోసా కలుపుకుని ఆలపిస్తే ...


*************

నీడ వదిలి వెలుగులోకి రమ్మంటే
నా అస్తిత్వమే నీ నీడని నవ్వేవు,
నేనెక్కడ ఉన్నానని నిలదీస్తే,
నీ ఊపిరి నేనని ఉడికించావు ॥ప॥

పలుకులన్ని కలిసి పలకరించే చినుకై,
తనువునంతా తడిపి నా కంటి లో నిలిచింది.
తోడున్న నిన్ను చూసి నీ గుండెలోకి దూకింది.
నిన్నూ నన్నూ కలిపి కట్టిన సూత్రం తానని,
నింగిలోని మబ్బు నిబ్బరంగా నవ్వింది.
కడలి పొంగు తన కొంగులోకి మళ్ళీ నింపుకుంది. ॥చ॥

నవ్వులన్ని విరిసి పరవశించే చినుకై,
తనువునంతా తడిమి నీ కంటిలో నిలిచింది.
ఎదురుగ నన్ను చూసి ఎగిసెగిసి పడింది.
నన్నూ నిన్నూ వదలని బంధం తానని,
నదిలోని నీరు ఎత్తిపోతలై దూకింది.
కొండాకోనల్లో కూతపెట్టిన వాగుని కలేసుకుంది. ॥చ॥


*************

ఈ మూడు రచనలూ ఆ మహానుభావునుకి నా నుంచి నీరాజనంగా సమర్పిస్తున్నాను.

ఈ చిరు ప్రయత్నాన్ని కొందరైనా హర్షిస్తారని, తప్పులుంటే మన్నించి సరిదిద్దుతారని ఆశిస్తూ..

7 comments:

  1. Usha gaaru,

    Very beautiful poetry in your lyrics. I liked the first song very much. mii kavitallO kanipinchE chikkadanam mii paaTallOnuu chakkagaa palikindi.

    miiku interest unTE sinimaallO try cheyyandi. All the very best!

    ReplyDelete
  2. ఉషగారు...ఏమని వ్యాఖ్యానించను చెప్పండి!
    చదివి ఆనందించడం తప్ప...:)

    ReplyDelete
  3. భా.రా.రె. కొత్తగా తెలియనిదేముంది :)
    ఫణీంద్ర గారు, ఆ పని మనకి పొసగదండి. సినిమాలే సరీగ్గా==ఎక్కువగా చూడను, పాటలు వినటమే కానీ.
    పద్మార్పిత, అంతేనా? సరేమరి. పన్నిరుబుడ్డీ ఖాళీ అవలేదా? :)
    విజయమోహన్ గారు, నెనర్లు.

    ReplyDelete
  4. బాగుంది ఉష.
    కాలం గట్టున.. తెగిన ముత్యాల సరాలంటి జ్నాపకాలను ఎన్ని ఎత్తి కూర్చినా ఇంకా కంటి ఆల్చిప్పల వెనుక.. కన్నీళ్ళ సముద్రం లో అనంతం గా పుడుతూనే వున్నాయి.. ఏరి మాలలల్లి నీకే కానుక గా ఇవ్వనా ప్రభూ...నీ వారికి గర్వం గా చెప్పుకుందువు... నా కోసమే పుట్టిన మేలి ముత్యాల వెల ఒక జీవితమంత అని. నాకు మాత్రం ఎంత గర్వమనుకున్నావు ఇన్నిన్ని హారాలతో నిన్ను అలంకరింప గలుగుతున్నానని.
    ఇది నా మదిలో మెదిలిన భావం నీ కవిత చదివినప్పుడూ. ఏది మళ్ళీ ఇంకో కవితను తెప్పించూ ఈ మాటల నుంచి ఒక పాట గా. :-)

    ReplyDelete
  5. భావన, కొత్త కవితని ఇప్పటికిప్పుడు సృష్టిమ్చలేను గానీ "తెగిన ముత్యాల సరాలంటి జ్ఞాపకాల" వంటి నా మునుపటి కవితలు ఓ పది పెట్టాను మరి తాజా టపాగా! :) భయపడకు మరొక నలభై మాత్రం ఉన్నాయి, నీ జీవిత కాలంలో ఎపుడైనా ఇలా అడిగితే నా ఆత్మ రక్షణకి..

    ReplyDelete