మనోహరం మనోవరం..

"మూసిన తలుపులు తెరిచి... మూగిన తలపుల తుమ్మెదలను ఎదేచ్చగా వదిలేసా..... పువ్వంటి మనసు లోని మకరందాన్ని తాగి, నిర్దయగా కాళ్ళ తో తన రెక్కలను కోటి కోటి శతకోటి ముక్కలు చేసాయి."

ప్చ్.. అవును ఇలా చెప్తే నీకసలు అర్థం కాదు.

"వనమాలి, నువ్వు తొక్కివెళ్ళిన వనం వైపు చూడు. చిల్లు పడి కారుతున్న కుండ నీటి కోసం అంగలార్చి చూస్తుంది. నీ గుండెకి బాగా తాపడం వేసుకో, వనం శిధిలమయ్యే వరకు మళ్ళీ చుక్క రాలనీకు."

ఇలాగ చెప్తే అసలు వినవు. ఇంకెలా ఈ ముడి విప్పను.

"నీ మౌనం శతకోటి అర్థాలు వివరిస్తే నా పదాలు గాలిలో కలిసిపోతున్నాయేం...కాదు గాలిపటాల్లా ఎగిరి, చిరిగి పడుతున్నాయి. గతం వైపు చూడనీయని అనుభవమేది.. నీ గురుతులన్నీ అక్కడే నిక్షిప్తం..ఆ నిధిని మించిన అనుభూతి ఏది. " స్వగతంలోని ఈ మాట బయటకి చెప్పనేలేదు..నీకూ నాకూ నడుమ శతయోజనాల దూరం. ఎప్పటికి తరిగేను?

ఎన్నెన్నో జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం

ఆగాగు, మరోసారి అనుమతిస్తావా... మన ఇద్దరి భాషకి నిఘంటువు ఉందేమో తెలుసుకుని వస్తాను. పోనీ మౌనంగా ధ్యానిస్తాను, నీకు మాటల వరమీయమని నేను తపస్సు చేస్తాను.

నీ కోసం నిరీక్షణలో అన్ని పేజీలూ ఖాళీగానే గతం లోకి తిప్పేసాను. కాదు కాదు, నిజం చెప్పనా, నేనే నా కలలతో నింపేసాను.. భయాలతో చెరిపేసాను... అందుకే అవి కలగాపులగంగా చదవటానికి నాకే కష్టంగా ఉంది.... ఏకాంతం జాలిపడి నీ వూసులతో గడపమని అనుమతిచ్చింది. ఈ జీవితం ఇచ్చిన విలువైన బహుమతి అదొక్కటే ఇంత వరకు.

పెదవి విరవాలే, తల తిప్పేసుకోవాలే.. అలవాటు లేని పనులు చెయ్యకు.

నిన్న రాత్రి కలత నిదుర. కల తప్పని కలవరింత. కలలో గతం గోదావరి నదిలా పరవళ్ళు తొక్కింది. ఈ ఒడ్డున నేను, నా మనసు వరించిన "వేదన". అలా పిలిచి విసిగి దానికో పేరు పెట్టాను - "మనోవరం" బావుందా? ఆ..ఆ..వెదకబోకు, ఇది అచ్చంగా నేను అల్లిన పదమే. అదీ నీకే అంకితం.

ఆవలి ఒడ్డున ఎవరో నీడలా కదులుతూ దూరంగా సాగిపోతూ... నువ్వేననుకున్నాను? నువ్వే అయితే బాగుండుననుకున్నాను.. నిన్ను కాక మరెవరినీ నేను గుర్తించలేను కూడా..

తలపుల నావలో సుడి దాటటం చిటికెలో పని. సంబరం, అక్కడ ఉన్నది నువ్వే...అదే నువ్వు, అదే నేను... మళ్ళీ అదే మాట. "ఇంకా ఏం కావాలి?" నేను నా మాటే పలికాను "అంటే చెప్పిందంతా మర్చిపోయావా..నా మనసు నగ్నత్వాన్ని కప్పిన నీ అనురాగవలువ కావాలి. మ్చ్.. అదీ కాదు, నాకు మరణం కావాలి.. మరణంలో సాంత్వన ఉందో లేదో నేను తేల్చుకోవాలి. మరణించే ముందు మరోసారి నీ చేత భంగపడాలి..ఆ గాయం గుర్తుతో నీకు వీడుకోలు చెప్పి కదలాలి." ఛా ఒక్క ఆశా తీరదేం? కల కూడా నన్ను మభ్యపెట్టదు. నిజాన్ని ఇంకా చిక్కగా నా ఎదమీద పోత పోస్తుంది.

నన్ను నేను మరవగల పనిని నువ్వు కొట్టేసావు. తాయిలం ఇచ్చి తిరిగి లాక్కునే పిల్లాడి మాదిరి ప్రవర్తించావు. అంతకు మించి నీకు ఏమీ తెలియదని నాకు తెలవకనా... కానీ నేను సేవించిన మధువు పేరు నీ అనురాగం. ఆ గాఢత ఎన్నడూ తగ్గదు. ఈ జన్మంతా ఆ గడిపేస్తాను. పదాలు కట్టి పాడుకుంటాను. నా గానం లో నేనే మైమరుస్తాను. నేను నిరీక్షణ దాటేసాను. నాకు నువ్వు వద్దు, నీవు వదిలివెళ్ళిన జాడలు చాలు. నువ్వు మారనట్లే అవీ మారవు. ఆ జాడలు నా గుండె వేసిన ఊడలు. అక్కడ స్థంభాలాటలాడే ప్రతి క్షణం నాకు మనోహరం... అదే నాకు ఈ "మనోవరం" మిగిల్చిన అపురూప జీవనం.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

వేదన అలవాటయ్యాక ఇంకేదీ రుచించదు. ప్రేమించటం మొదలుపెట్టాక మరేమీ కావాలనిపించదు. విశ్వం అంతా అందంగా తోచేది ప్రేమించగల మనసుకే. అందమే ఆనందం అన్న అనుభూతి అనురాగం కరుణించిన హృదయానికే సొంతం. ఈ మధ్య మనసుని కాస్త ఆపితే నా మీద తిరగబడి ఇలా విరిగిపడింది. మూతలేని భరిణె లో దాచుకునేదేముంది, వంపినకొద్దీ వాగులై ఉరికే ఊసులు తప్పా..

9 comments:

 1. మొదటిలైన్ ఎందుకో చాలా నచ్చేసిందండీ..

  ReplyDelete
 2. వేదన అలవాటు అయ్యాక ఇంకేది రుచించదు ...నిజమే కదా !
  బాగుందండీ .

  ReplyDelete
 3. పదాలు మూగైన ప్రణవం లో రేగిన తలపుల సుడినే తీరం చేర్చని. వెన్నెల లో మల్లెల కన్నీరు కరిగి వరద లై పోస్తే మునిగి తేలటం కూడా సుఖమే కదా నేస్తం.

  ReplyDelete
 4. మెహెర్, వేణు, చిన్ని, భావన, పచ్చబొట్టు మాదిరి కొన్ని మనసుకి టాటూల్లా పడిపోతాయి చిన్నప్పటి మాటలు - అదే "ఆ నలుగురు" - ఒక మనసు లోని మాట మీ నలుగురి మనసుకీ తాకినందుకు నా మనసులో ఓ పచ్చ గ్లో అయినట్లుగా ఉంది. థాంక్యు సో వెరీమచ్.

  ReplyDelete
 5. నాది కూడా వేణు గారి కామెంటే!

  ReplyDelete
 6. మరణించే ముందు మరోసారి నీ చేత భంగపడాలి..ఆ గాయం గుర్తుతో నీకు వీడుకోలు చెప్పి కదలాలి.

  Hmm! :)

  ReplyDelete
 7. The second best post I read in ur blog after the ప్రేమ కావ్యం in your blog

  ReplyDelete
 8. థాంక్స్ గీతాచార్య. రచన చదివించగలగటం, నచ్చటం/లేదూ అన్నది చదువరి ఓపిక/అభిరుచిని బట్టి కూడా కదా. మీకు తెలియనిదేముంది.

  ReplyDelete
 9. fantastic .........manasu ikkade ee aksharala chutte tirugutundi

  ReplyDelete