ఈ శీర్షిక చూడగానే నోట్ బుక్స్ గుర్తువచ్చాయా అని అడగను. మీరంతా ఎంతో పదిలంగా దాచుకున్న ఈకలు నా మీద వీవెనల ఉప్పెనలై విరుచుకుపడతాయి. అయినా ఈకలు పుస్తకం పుటల్లో బతకడవేవిటి? వాటికి లేత తాటాకు బూజు భోజనమేవిటి? అవి పిల్లలు పెడతమేవిటీ? దొరికిన ఈకని దాచిపెట్టిన మర్నాటి నుంచీ ఈక పిల్లలు పెట్టిందా లేదా అని ఆరాలు తీయటమేవిటీ.. కదా?
అదే బాల్యం మహిమ. అప్పటికి మనసుకి తెలిసేది మమతలొకటే. ఆ మమతలు పోషించే మానవత్వం ఆ పనులన్నీ చేయిస్తుందేమో. ఇప్పటికీ నెమలి ఈక కనపడగానే దాయాలనే మనసు పీకుతుంది.
నాకు మరొక రకం నెమలి ఈకలు గురించి తెలిసింది. వాటి గురించే ఈ టపా.
నా బ్లాగు చదివే వారికి తెలిసే ఉంటుంది నేను ఆస్ట్రేలియా లో కొంత కాలం నివసించాక అమెరికా కి వచ్చానని. మేము అక్కడకి వెళ్ళిన నెల లోపే ఉద్యోగం గురించిన ఇంటర్వ్యూ కి వెళ్ళటం తటస్థిమ్చింది. అప్పటికి ఇంకా అక్కడి వారి యాస నాకు అబ్బలేదు. కాస్త ఇబ్బంది కనుక అవసరపడినంత వరకే మాట్లాడటం ఉండేది.
రైల్లో ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తి కనపడ్డాడు. అంత దాకా ఏవో దిగులు, గుబులు కమ్మిన మనసు ఒక్కసారిగా సంభ్రమం లో మునిగిపోయింది. అతను దాదాపుగా మన కోయదొరల్లా ఉన్నాడు. ఈత ఆకు తలలో పెట్టుకుని, మెడలో రంగు రంగుల పూసలు, చేతిలో నెమలి ఈక. ఇంకా ఏవేవో ఉన్నా నాకివే గుర్తు ఉన్నాయి.
అంతే టకా టకా నా చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న నెమలి ఈక ఇండియాలోనే మర్చిపోయి ఆస్ట్రేలియాకి వచ్చేసానన్న బాధ ముంచుకు వచ్చేసింది. కానీ అతన్ని అడగాలంటే మొహమాటం. బెరుకు. వాళ్ళు అక్కడి అబారిజినీ తెగలు అని తర్వాత తెలిసింది. అందరూ కాకపోయినా అక్కడక్కడా అలా తయరయి కనపడతారు.
అలా అప్పుడప్పుడు నెమలిని తలుచుకుంటేనో, ఎక్కడైనా చూడటమో సంభవిస్తే నా ఈక ఎక్కడ పోయిందో, పెట్టిన చోటనే ఉందో అని ఆలోచన కలిగేది. కానీ ఈ రోజు ఈ కొత్త నెమలి ఈకలు దొరికాయి. మీకూ దొరుకుతాయి నా మాట వింటే మరి!
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
ఓ వేసవి సాయంత్రం. అలా కారులో షికారుకెళ్తుంటే సుమారు ఏడేళ్ళ వయసు పిల్లాడు రోడ్డు వారగా నిలబడి చెయ్యి ఎత్తి ఆపమన్నట్లుగా సైగ చేసాడు. కాస్త సందిగ్ధగా ఆపగానే పక్కకి చూపించాడు. ముద్దుగారే మూడు పిల్లల్ని వెనకేసుకుని ఓ చిన్న బాతు రోడ్డు దాటటానికి వచ్చింది.
ఈ బుడ్డాడు దానికి అంగరక్షకుని మాదిరి అన్నమాట. అది దాటే వరకు నన్ను నిలవరించి "యు ఆర్ నైస్, యు కెన్ గో నౌ" అని దారి వదిలాడు. ఆ దారికాచిన చిన్న పిల్లాడు చూపిన మానవత్వం ఆ పక్షి కూనల రెక్కల సవ్వడిలో ఇప్పటికీ గుర్తు కొస్తుంటుంది. వాడు తప్పక మరిన్ని ప్రాణుల సంరక్షణ చేస్తాడు. వాడి నీలి కళ్ళలో మమత ఒక నదిలా వెల్లువవటం నేను ముదమారా చూసాను.
పదిలంగా మనసు పుటల్లో దాచుకున్న ఈక ఇది. మరెన్నో ఈకల్ని చిత్రించను వాడుకునే తూలికాను. నా పిల్లలిద్దరికీ చాలా సార్లు చెప్తాను ఆ సంఘటన గురించి.
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
ఇక ఈ ఈక మన నేల మీద పడితే నా మనసులోకి ఎగిరి వచ్చేలా చేసింది దాని తాలూకు మానవత్వపు స్పర్శ. నా సమీప కుటుంబీకులు ఓ నాటి రాత్రి ప్రయాణంలో వారి కారు లారీకి గుద్దుకుని స్పృహ కోల్పోయినప్పటి ఘటన ఇది.
ఒక వేడుకకి వెళ్తున్న కారణం గా వారి వెంట చాలా సొమ్ములు, రొక్కం కూడా ఉన్నాయి. ప్రమాదం జరగగానే ఉన్న ఇద్దరూ దెబ్బలతో తీవ్రమైన నెప్పులతో ఉన్నారు. డ్రైవర్ ది అదే స్థితి. దాదాపుగా ముగ్గురికీ స్పృహ లేని మాటే. ఆ సమయాన ప్రక్కనే ఉన్న చిన్న టీ కొట్టు ఆసామి వారికి కావాల్సిన ప్రధమ చికిత్స చేసి, సమయానికి ఫోన్లవీ చేసి ఇతరత్రా సహాయం అందేలా చేసాడు.
అది కాదు ఇక్కడ గొప్పతనం. వారి సూట్ కేస్ దాచి భద్రంగా వార్త తెలిసి వెళ్ళిన కుటుంబ పెద్దకి చేరవేసాడు. కనీసం పోలీసులకి కూడా తెలియనీయలేదా విషయం. ఒక్క రూపాయ గానీ, ఒక్క నగ గానీ తీసుకోలేదు. ఈ రోజుల్లో అలా రెండు అంకెల పైన లకారాల విలువైన నగా నట్రా ఆశించకుండా సహాయం తో పాటు, సంరక్షించి ఇవ్వటం కూడా అపురూపమైన విషయమే.
ఇంటివారే మోసగిస్తున్న వార్తలు విన్నాక ఆ మనిషి పట్ల నాకు అపారమైన గౌరవాభిమానాలు కలిగాయి. అమ్మ ఈ మాట చెప్పారు. స్వతహాగా మితభాషి అయిన తను ఎంతో ఇదైతే తప్ప బయటకి చెప్పరు. అందుకని ఇది బంగారు నెమలి ఈక.
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
ఇక ఇది నా స్వానుభవం. తాజా వార్తలు వినటం అదీ పనికి వచ్చే వాతావరణ సూచనలవీ వినటం నాకు రాదు. అలవాటు అవలేదు ఇన్నేళ్ళైనా. అందువలనే మంచి భారీగా స్నో పడే రోజున ఉన్ని దుస్తులు, కార్లో కావాల్సిన సామగ్రి పెట్టుకోవటం మర్చిపోయి రయ్యిన వెళ్ళి ఎక్కడో ఇబ్బందుల్లో పడటం జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఖాళీ లంచ్ డబ్బా మూతలతో మంచు గీకాల్సి వస్తుంది. మనతో పని అంతే [అని సన్నిహితుల భావన! :)]
లేదా మంచు కప్పేసిన కారుని వదిలి పైన వెన్నెలని చూస్తూ మైమరిచిపోయో, సన్నగా కదిలే గుర్రాల వెంట కళ్ళు పరిగెట్టిస్తూనో, "ఎటో వెళ్ళిపోయింది మనసు" అని పాడేసుకుంటూ, చివరికి బాహ్య స్పృహ కలిగాక కలీగ్ నో, స్నేహితులనో పిల్చి సాయం అడిగి ఇబ్బంది పెడ్తాను. :( ఆ మాత్రం చెయ్యకపోతే వాళ్ళెందుకటా..
అలాగే వెచ్చగా కంఫర్టర్ లో తొంగున్న పిల్లదాన్ని ఇవాళ సెలవు అన్నా కాళ్ళు పట్టి ఈడ్చి లేపి, స్కూలు దాకా లాక్కెళ్ళి మూసిన తలుపులు చూసాక అది బెంగాలీ కాళీ లా "కాలండర్ చూడవు.." అని మీద పడి రక్కేదాకా తెచ్చుకుంటాను. ఇవి నా గురించి తెలియని వారికి కాస్త తొలి పలుకులు.
సరే అలాంటి దివ్యమైన మరో రోజు అంటే నిన్న గాక మొన్న మంచి భారీ వాన.
ఉదయం లేవగానే రయ్యి రయ్యిన వీస్తున్న గాలులు, జడివాన అలాగే కారు తీసేసి "గరజ్ బరస్ సావన్ గిరి ఆయో.." వింటూ నేనూ కూనిరాగాలు తీసేస్తూ గ్రోసరీ షాప్ కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఇరవై నాలుగు గంటలూ తెరిచే ఉంటుందది. అలా తెల్లారుఝామునే వెళ్లటం నాకూ అలవాటే.
కాస్త దూరంగా ఆపి కావాలనే వానలో తడుద్దామని దిగాక, మరీ జోరు వాన కాస్త గొడుగు తెచ్చుకోవాల్సింది అనుకుంటూ, బూట్ లో వెదకటం అనవసరమే తెచ్చి ఉండను అని కూడా అనుకుంటూ నాలుగు అడుగులు వడి వడిగా వేసానో లేదొ వెనక నుంచి దబ దబా పరిగెడుతున్న ధ్వని.
అసలు మనసు ఎందుకలా పొరబడిందో కానీ ఎవరో నాకేదో హాని చెయ్యటానికేనేమో అన్న వెర్రి భయం వెన్నులో జర జరా పాక్కుంటూ వచ్చేసింది. ఆ కనుచీకటి వచ్చీరాని వెలుగు, వెనక అగంతుకుడు, కాస్త వేగంగా పెరిగెట్టాను, మా ఇద్దరి మధ్యన దూరం తరగటం తెలుస్తూనే ఉంది. మొత్తానికి దొరికిపోయాను. వగురుస్తూ తన చేతిలోని గొడుగు నాకూ పట్టి [అతని ఆంగ్ల సంభాషణ నేను తెలుగులో చెప్తున్నాను] "ఈ చలిగాలిలో అలా తడుస్తుంటే ఎందుకో సాయపడాలనిపించింది. ఓ పక్కన నీకు అది అపార్థం గా తోస్తుందేమో అనుకున్నాను. కానీ నీకు గొడుగు పంచాలనే పరిగెట్టి వచ్చాను." అన్నారు.
ఆ తర్వాత మేము కలిసి వేసిన ఆ పది అడుగులూ నాకు నా అపరాధభావనకి, అతని మానవత్వానికి కంటినీరు వస్తూనే ఉంది. పరిచితులా అపరిచితులా అని కాదు మనకి తోడుగా రావటమన్నది మానవత్వం కదిపిన అడుగే కదా. ఇది మూడో ఈక.
సత్యనారాయణ స్వామి వ్రత కథల్లా ఇంకెన్ని ఈకలు, కొబ్బరి కాయలు అంటారా.. ఇక చివరిదేలే...
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
నాకు తొలి కాన్పుకి ఇక పది పదిహేను రోజుల గడువు. అంతకు పూర్వం నెల క్రితం నన్ను వెంటబెట్టుకు పుట్టింటికి తీసుకువెళ్ళటానికి వచ్చిన అమ్మ అనుకోని పరిస్థితిలో హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించాల్సిన స్థితికి వెళ్ళారు. సర్జరీ రేపనగా అమ్మమ్మ గారు మరణించారు.
అప్పటికి ఆపరేషన్ మానినా జరిగేవి జరగక మానవిక అని, వైద్య నిపుణులు దొరకరనీ, అమ్మని ఇంకా ఆ బోన్ మూలాన నెప్పి భరించనీయకూడదని, ఇలా ఓ పక్కన మా చేతలకి సమాధానం వెదుక్కుంటూ, నచ్చజెప్పుకుంటూ, అక్క, నేను ఇలా ఎవరం కనపడకపోయినా అమ్మకి అనుమానం వస్తుందని కాస్త బాధ ఓర్చుకుని అందరం అక్కడే ఉండి, ఏమీ కానట్లు నటిస్తూ, ఓ ప్రక్కన తను ఒక్కరే కూతురు కదా, ఇలా దాచి తప్పు చేస్తున్నామాని బాధ పడ్తూ, మర్నాడు ఆపరేషన్ చేయించాము.
ఎనిమిది గంటల మేజర్ సర్జరీ అలా నిలబడి ఉన్నాం. అనుకున్నదాని కన్నా రక్తం ఎక్కించాల్సిన అవసరం కలిగిందని, ఆ వారా మేము డొనర్స్ తెచ్చి రీప్లేస్ చేయించాలని అప్పటికప్పుడు చెప్పారు. నాకు నీరసం, నిస్సత్తువ, మిగిలిన వారికి అమ్మ కన్నా నా గురించి ఆదుర్దా. తెలుస్తున్నా ఇంటికి వెళ్ళి ఒక్కదాన్నీ ఉండలేనని అక్కడే ఉంటానని వేళ్ళాడుతున్నాను.
ఈ స్థితిలో హాస్పటల్ వాళ్ళు వత్తిడి. రక్తం బాటిల్స్ కి డబ్బు కడతామంటే అలా కాదు అన్నారు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు కనుక నియమాలు మారి ఉండొచ్చు. ఎలాగా అని తర్జన భర్జనలో ఉండగా మా స్నేహితులొకరిని దింపటానికి వచ్చిన ఆయన విషయం కనుక్కుని మరో ఆలోచన లేకుండా నేను ఇస్తాను అని చక చకా ఆ కార్యక్రమం పూర్తి చేసారు.
ఆయన వెళ్ళేముందు కృతజ్ఞత తెలుపుదామని వెళ్ళాను కానీ నా శారీరక అలసటకి, ఆ క్షణం ఉన్న ఎమోషనల్ మూడ్ కి మాటకి ముందే గొంతు పూడుకుపోయి, జోడించిన చేతులు, కంటి నీరు తప్పా నాకు మాట రాలేదు. "ఛా అదేంటమ్మా, ఊరుకో, నిండు నెలల మీద ఉన్నావు, బాధ పడకూడదు. నేను చేసినదేముంది." అంటూ వారించి వెళ్ళిపోయారు. కనీసం పేరైనా అడగలేకపోయాను. కానీ ఈ రోజుకీ ఎవరైనా వైద్య సహాయం అనగానే నాకు తోచినది అందించటానికి స్ఫూర్తి ఆయన కావచ్చు. ఇది బరువైన ఈక.
*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
ఇలా పుటలు తిరగబడుతుంటే మమతల, మానవత్వపు రెప రెపల ఈకలు జారిపడుతున్నాయి. నిజానికి ఒక్కో ఈక మరో వేయి ఈకల్ని పెట్టినట్లే అనిపిస్తుంది. ఎమోషనల్ ప్లేన్ లో మెసిలే నా బోటి మనిషికి అతి సాధారణ విషయాలు ప్రత్యేకంగా కనపడతాయేమో అంటారా. కానే కాదు, సరైన రూపునే కనపడతాయి. ఇలాంటివి తలుచుకుంటే ఏదో భరోసా. మన చుట్టూ ఉన్న నలుగురిలోనే తన ఉనికి చూపే మమతానురాగాలు పల్లవిస్తూనే ఉంటాయని.
కొసమెరుపు, చిన్నప్పుడు 'చీలిది' అని ఎవరైనా అంటే [నాది అన్న ఏదైనా వదిలే రకాన్ని కాదు, మాట వరసకి ఇది నీదని అన్నారో దాన్ని చావో రేవో నా సొతం చేసుకునేదాక వదిలేదాన్ని కాదు, అందుకు ఆ పేరు], ఉడుక్కుంటుంటే మా నానమ్మ గారు "వాళ్ళంటే మట్టుకు నువ్వు అయిపోతావారా ఉషమ్మడు" అని ఊరడించేవారు. ఇప్పుడు ఎవరైనా మీరు మంచివారు, మమతలెరిగిన వారు అంటే నా మనసు "వాళ్ళంటే మట్టుకు నువ్వు అయిపోతావారా ఉషమ్మడు" అని ఉడికిస్తుంటుంది.
నిజానికి "చీలిరాకాసి" నా మనసే కానీ ఇలా అప్పుడప్పుడు రక రకాల నెమలి ఈకలు తీసి, విసన కర్రలు కట్టి ఇస్తుంటుంది. ఆ వీవెనలతో గాలి వీచుకుంటూ, ఇదిగో ఇలా నేను మిమ్మల్ని మీ ఈకలు ఏవని వివరం ఆడుగుతూ.. ఇవే కాక వివిధ రకాల మనస్థితికి ఆయా ఈకలు సమయానికి తమ పుటల్నుంచి జారిపడతాయి.
ఎలా ఉన్నాయి నా నెమలి ఈకలు అనను, ఇలాంటివి అందరికీ ఉంటాయి. వేటి విలువ వాటిదే. అందరం భాగ్యశాలులమే.
Keka Madam..
ReplyDeletewonderful writing! abhinandanalu! suresh peddaraju
ReplyDeleteమీ నెమలి ఈకలు మా నెమలి ఈకలను గుర్తు తెస్తున్నాయి . బాగున్నాయి .
ReplyDeleteమొత్తానికి అందరి లో బాల్య స్మృతులను తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారన్నమాట .
baagunnaayi mee eekalu..really touching
ReplyDeleteఇలాంటివి అందరికీ ఉంటాయి. వేటి విలువ వాటిదే. అందరం భాగ్యశాలులమే. well said.
ReplyDeleteచిన్న చిన్న సంఘటనలే ఐనా చాలా మందిమి చాలా వరకు మర్చిపోతాం. ఒకవేళ గుర్తున్నా అప్పటి ఘాడత గుర్తుండదు ఓ సాధారణ సంఘటనగా మాత్రమే గుర్తుంటుంది. మీ నెమలీకల విసనకర్ర అందించిన చల్లగాలి బోలెడంత ఆహ్లాదాన్ని అందించి, మనుషుల మీద నమ్మకాన్ని పెంచి, నా బాధ్యతను కూడా గుర్తు చేసింది. నెనర్లు.
"ఇలాంటివి అందరికీ ఉంటాయి. వేటి విలువ వాటిదే. అందరం భాగ్యశాలులమే. "...true..!!
ReplyDeleteనెమలి ఈకల స్పర్శ అందించే అనుభూతిని కలిగించింది మీ టపా...
ReplyDeleteఇంకా ఏదో చెప్పాలని ఉంది...కానీ మాటలు రావటం లేదు...
usha,excellent post. you are very good at expressing in words. keep it up :)
ReplyDeleteభలే, సగం పాత మిత్రులు, సగం క్రొత్త చదువరుల స్పందన. వెరసి ఇది మరొక నెమలి ఈక. :)
ReplyDeleteనవీన్, సురేష్, మానస గార్లకు తొలి వ్యాఖ్యకి, రాణి గారి రెండో వ్యాఖ్యకి ధన్యవాదాలు.
Rani, Sure I would try to keep up.
మాలాకుమార్, వేణు, శేఖర్, తృష్ణ, మీ స్పందనలతో ఈ టపా రాయటం లోని ఉద్దేశ్యం నెరవేరింది [అనే నమ్మకం] నెనర్లు.
ఎన్ని నెమలీకలు తీసినా ఇంకో ఈక పుస్తకం మధ్యనుంచి జారనా వుండనా అని తొంగి చూస్తూ పలకరిస్తూనే వుంది... ఎన్నని వివరించగలం. చాలా బాగుంది ఉష.
ReplyDeletekaLLallO neeLLu tirigaayi
ReplyDeleteనెమలిఈకలు బరువుగా ఉన్నాయ్ !!
ReplyDeleteభావన, ఆత్మబంధువు గార్లు, ఇకనేం కన్నయ్య ని కలేసిన నెమలి ఈకలు కట్టి మీ బ్లాగులకి అందాలు సృష్టించండి మరి. అవేగా మిమ్మల్ని తద్వారా మమ్మల్ని అలరింపజేసేవి.
ReplyDeleteసుజ్జీ, ఈకలు మోయమన్నానా? తాకి చూడమనేగా చెప్తా?
Chala bavundi Usha garu..nenu eppati nundo mee blog chaduvuthunna ..kani ide naa first comment..oka rakam ga kallamata neellu ochayi..:)
ReplyDelete--Manga
మంగ గారు, మీ తొలి వ్యాఖ్యకి ధన్యవాదాలు. నా బ్లాగు మనుగడ, నియంత్రణ, ఇకపై ఏమిటి? అసలేముంది రాయటానికి? రాసినవాటికి ఆయువేమిటి? ఇలా అంతులేని ప్రశ్నలు తొలిచేసే సమయాల్లో ఎక్కడో నేనెరుగని ఒక మనసు నుంచి ఇలా సమాధానం అందుతుంది..ఎడారిలో ఒంటెలా మరొక ఆర్నెల్లు నేను, నాతో పయనంలో సాగటానికి..:) నెనర్లు.
ReplyDelete