స్తంభించ/లే/ని ఘటనలు

వాకిలి వద్ద వేచిన నీకు ఎవరూ కనపడరు
అభ్యాగతుల స్వరాలు వినవస్తుంటాయి
విస్తరిలో ముడిచిన జీవితం గుర్తుకొస్తుంది
ఆస్వాదించని రుచుల జాడలే ఆ సవ్వడులు

సమూహాలు చురుగ్గా కదులుతూ ఉంటాయి
నిదురించే నీలోకి ఎవరో పయనిస్తారు
వాడిపోయిన చిత్రాలకు వర్ణాలు అద్దుతారు
నిషేధించిన కలల్ని నీవెప్పటికీ అడ్డుకోలేవు

ఆలోచనల కుబుసాలు విడుస్తావు
నాగరిక పొరలూ విప్పుకుంటావు 
లజ్జాభారపు మూటలు విసిరేస్తావు
ఆశల కొలనులో నగ్నంగా విహరిస్తావు

మెత్తగా ఆవరించే మెలుకువనీ ఆపలేవు 
ఇప్పుడు మరింతగా ముడుచుకుంటావు
లోగిలి ద్వారాలన్నీ మూసివేస్తావు
వాస్తవాధీన రేఖ వద్ద చొరబాటుకీ ప్రయత్నిస్తావు

నిదురలో, కలలో, జాగృతిలో, వేదనలో
నీ ప్రపంచం నీకెపుడూ ఒక రంగశాల
నీవెరుగని నిన్ను నువ్వు ఆవిష్కరిస్తావు
లేదా, అవతరించే మరో నిన్ను చూస్తుంటావు

* అభ్యాగతుడు : భోజనమప్పుడు వచ్చిన అతిథి

01/02/2014

3 comments: