ఒంటరి గూడు

ఊరు సద్దుమణుగుతుంది, ఎప్పటిలానే

అదే నువ్వు...

మందలించినా లొంగని మొండి పిల్లల్లా- 
వీధి దీపాలు ముసుగు కప్పని చీకటి పెళ్ళలు,
కొమ్మలు, రెమ్మలు ఆపలేని ఈదురుగాలులు- 
నీ రెప్ప సారింపుకి అడ్డుపడుతూ

గుమ్మానికి కావలి కాస్తూ,
క్షణ సమూహాలని విడుదలచేస్తూ,
"ఒక్కొక్కసారి నిశివేళకి ఎందుకీ వినోదం?"
నువ్వు వెయ్యిన్నొక్కసారి వేసుకున్న ప్రశ్న

పారేసుకున్న తాళం వెదుక్కున్నట్లు
జ్ఞాపకాల్లోకి తచ్చాడుతూ,
నిలవనని మొరాయించిన మేను వాలుస్తావా:
ఇక, ఆ పక్కంతా పెనుగులాట మడతలు,
గోడల మీద నిస్సహాయ నిట్టూర్పు నీడలు

పొడి కనుల గడపలోకి రాని నిద్ర,
తొలిపొద్దు రేఖలోకి అదృశ్యమవుతుందిక

ఊర్లో సవ్వడి మొదలౌతుంది, ఎప్పటిలానే

తలుపు తీయగానే అల్లరి పిల్లల్లా-
బీరువాలు, బల్లల కిందకి కాంతిరేఖలు
గోడలు, గుమ్మాల మీద పిట్టలు-
పరుగులు తీస్తూ, నిన్ను ఏమారుస్తూ

గుమ్మానికి కావలి కాస్తూ,
క్షణ సమూహాలని విడుదలచేస్తూ,
"ఒక్కొక్కసారి కాలానికి ఎందుకీ నిదాదం?"
నువ్వు మరొకసారి వేసుకునే ప్రశ్న

ఒలకబోసుకున్న విత్తులు పోగేసుకున్నట్లు
ఆశలు కలబోసుకుంటూ, 
నిలవనని మొరాయించిన మేను వాలుస్తావా:
ఇక, ఆ పక్కంతా పెనుగులాట మడతలు,
తలగడల మీద ఆరీఆరని కన్నీటి చారలు 

తడి కనుల వాకిలి లోకి తొంగి చూడని వెలుగు
మలిపొద్దు వంపు లోకి అదృశ్యమవుతుందిక

ఏమౌతుందిక? సద్దు పొద్దుల పద్దులు రాస్తూనే,
రా/లే/ని వారికోసమో, రానున్న వారికోసమో ఏకతమాడుతూ-

అదే నువ్వు...

2 comments:

  1. మీ కవిత బాగుందండి.

    ReplyDelete
  2. మనిషి మౌలికం గా ఒంటరి (మానసికం గానో, వ్యక్తిగత/సామాజిక జీవిత పార్స్వాల్లోనూ) అందుకే అందరికీ నచ్చే అంశం కావచ్చు ఈ కవిత; నెనర్లు ప్రేరణ గారు!

    ReplyDelete