మరణాలు, సంవత్సరీకాలు

నుదుటి మీద కాల్చిన మచ్చలా,
ఎదలోని కారుచిచ్చుని
బతుకంతా మోస్తూ

మారణహోమపు భస్మం ధరిస్తూ, 
మంటగలిసిన మానవతకి
అమర్యాద చేస్తూ

మనిషిని మనిషి కాటేసిన ఉదంతాలు,
ద్వేషపు జ్వాలలు రగిలిన సంగతులు
నిత్యం జపిస్తూ

మదాంధుల పదఘట్టనలు,
పైశాచిక కామక్రీడలు
అమరచరిత్ర గా వర్ణిస్తూ 

జ్ఞప్తుల విలువ-కడుపు కదిలిన, గుండె తరుక్కుపోయిన- 
కొందరు చూస్తామంటారు
ఆ నాణెపు రెండో వైపు-కంపించని, తొణకని మదితో- 
పలువురు చూస్తూనే ఉంటారు

మరకువ మరొకసారి విర్రవీగుతుంది
అంతే! అంతే! అంతే! ముమ్మాటికీ అదంతే!

కాటిలో, కాలంలో కలిసిపోయినవారు
కథలోనో, కవితలోనో వెలికివస్తారు

ఉదయపు కాఫీ సెగల్లో 
మరొకసారి కాలి,
వెగటు నిట్టూర్పుల్లో కరిగిపోతారు..
లేదూ, ఓ సాయంత్రపు అలసటలో
తిప్పేసిన పేజీ మడతలో
ప్రకటనల పక్కన పడి ఉంటారు

మరి, పట్టిన గ్రహణం విడిచేదెన్నడు
తలారా- దిగులు తీరేలా- స్నానాలు చేసేదెప్పుడు 
వెలుగులో చీకటి కనపడ్డట్టే,
చీకటినుంచి వెలుగుకి బాట పడవచ్చు

ఒక అస్తమయపు చిరుచీకటిలో
ఓ పసితనపు చిరుదీపం
జాతిలో కాంతి నింపవచ్చు
జగతిలో శాంతి గా వెలగవచ్చు

గతపు గాధలు దాటుకుని
కొత్త పుంతలు తొక్కే
నవతరం రావొచ్చు

లోహపు లోగిళ్ళలో
మోటబావి పగుళ్ళలో రావి మొలకల్లా
వసంతం రావొచ్చు 

ఇంతే, ఇంతకన్నా ఆశావహమైన సంగతుందా!? 

మనిషితో మనిషిని కలిపే,
మంచిని జ్ఞాపకంగా మార్చని 
మనిషితనం కానవచ్చేలోకానికి 
త్రోవ దొరకవచ్చు
హృదయపు అగాధాల అంచులు అందవచ్చు!

అందుకని, ఈ ఒక్కసారికీ-
వేదనని అవతనం చేద్దామా?
శాంతి బావుటా ఎగురవేద్దామా

ఇంకొక్కసారి సాధన చేద్దామా దేహాల ఆలింగనం,
మనిషితనపు ఆనవాళ్ల అనుసంధానమై,
మమకారులమై, విప్లవకారులమై
నిశ్శబ్దం గా దగ్దమౌతూ, ధూపం లా పరిమళిస్తూ
అవిస్మరణీయమైన మరణాన్ని మౌనంగా నినదిస్తూ?

1 comment:

 1. ఒక అస్తమయపు చిరుచీకటిలో
  ఓ పసితనపు చిరుదీపం
  జాతిలో కాంతి నింపవచ్చు
  జగతిలో శాంతి గా వెలగవచ్చు"ఒక అస్తమయపు చిరుచీకటిలో
  ఓ పసితనపు చిరుదీపం
  జాతిలో కాంతి నింపవచ్చు
  జగతిలో శాంతి గా వెలగవచ్చు" కవిత ఎమేజింగ్. తెగ నచ్చేసి రెండుసార్లు చదివాను. ఇంకా చదువుతూనే ఉన్నా. పదాల ఫ్లో, కవితకి మంచి ఉత్సాహానిచ్చింది.

  ReplyDelete