రేగొడియాలు - ఇవి మా ఇంటి రుచులుమరీ మిగలముగ్గని దోరగా పండిన రేగిపళ్ళు (ఇవే భోగిపళ్లకి వాడేవి), -వడియాల కన్నా ముందే పెట్టేవాళ్ళు ఎండిపోకుండా- మరీ ముదురెండలు కాని కాలం లో కొని, కడిగి, నీడన ఆరబెట్టి, సుతారంగా ముచ్చిక తీసి, కొద్దిపాటి వత్తిడితో సగానికి చీల్చి, పుచ్చుపట్టలేదని నిర్థారించి, అప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, బెల్లం (ఎవరి పాళ్ళు వాళ్ళవి) వేసి రోలు లో (రుబ్బురోలు కాదు) రోకటి పోటు నిదానంగా వేస్తూ (గింజ ముక్కలై పగలకుండా) పచ్చడి చేసి, ఎండలో తుంగ/తాటాకు/ఈతాకు చాప మీద, నేతచీర పరిచి, చిన్ని ఉండలుగా తీసుకుని బొటనవేలితో వత్తి, వడియాలుగా పెడతాము. కనీసం ఒక వారం ఎండాలలా, డబ్బాకి ఎత్తటం, ఆరబెట్టటం, పిల్లల్నీ, పిల్లకాకుల్నీ కాచుకోవటం..కుంచాల లెక్కన కొలుచుకుని కూతుళ్ళకి పంపటం - అదన్నమాట! అసలు ప్రహసనం..తడి తగిలినా, బెల్లం పులిసిపోయినా, ఆఖరుకి పోటు బలం గా తగిలినా ఆగవు. ఇలా ఎన్నో జాగ్రత్తలు పడాలి. వతనుగా పళ్ళు తెచ్చే మనుషులు, ఒకే నేలలో పెరిగే చెట్ల కాయలూను- వానాకాలం, శీతాకాలం విటమిన్ సి ఇస్తాయివి. రుచికి ఏ పద్యం చాలదు వివరించటానికి. ఎంత శ్రధ్ధగా ఇంటిల్లిపాదిమీ కబుర్లు, పెద్దల మందలింపుల నడుమ పడతామో వీటిని- అమ్మమ్మ->అమ్మ-> ఇపుడు వదిన ల సారధ్యంలో..మా తర్వాతి తరం వారికీ "రేగొడియాలు తింటే రేపన్నది లేనట్లే తినాలి" అని నేర్పిస్తూ, మా హయాం లో ఆ గింజల రాపిడికి నోరు కొట్టుకుపోతే అన్నంకి ఎసరు పెట్టిన కాణ్ణుంచి కంగారు, యేయే నానా వంకలు చెప్పి కూరన్నం ఎగ్గొట్టి మీగడ తో చారన్నం,పెరుగన్నం మాత్రమే తినాలా అనే జిత్తులు ఎలా వేసేవారమో కూడా విప్పి చెప్పేస్తూ, కొత్తవారికి వీటి రుచి మలిపేస్తూ- (కొందరికైనా మీ బాల్యపు ఇష్టమైన తిళ్ళు తలపుకి తెప్పిద్దామని).

4 comments:

 1. తెలు గిక్కడ పదిలం. నశించి పోతుందని ఎవరూ భయ పడక్కర్లేదు. ధన్యవాదాలు ఉషగారు.

  ReplyDelete
  Replies
  1. కరిముల్లా గారు, తరుచూ కలిగే ఆ భయాన్ని "ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది." (http://www.telugusahityam.com/2010/08/blog-post.html) అంటూ వినవచ్చే భరోసాలతో కప్పిపుచ్చుకుంటుంటాను, అచ్చంగా మీలానే! నెనర్లు.

   Delete
 2. అంగుడు కొట్టుకు పోయిన సందర్భాలే ఎక్కువ కదండీ! బెల్లం తక్కువేసిందని అమ్మతో గొడవ పెట్టుకున్న సందర్భాలెన్నీ ?

  ReplyDelete
  Replies
  1. కష్టేఫలే గారు, మీరన్నది నిజవండి. "మా హయాం లో ఆ గింజల రాపిడికి నోరు కొట్టుకుపోతే అన్నంకి ఎసరు పెట్టిన కాణ్ణుంచి కంగారు, యేయే నానా వంకలు చెప్పి కూరన్నం ఎగ్గొట్టి మీగడ తో చారన్నం,పెరుగన్నం మాత్రమే తినాలా అనే జిత్తులు ఎలా వేసేవారమో" అన్నది అందుకే...ఇక, బెల్లం మా ఇళ్ళలో వాడకం ఎక్కువ, ఇవనే కాదు, బెల్లం తో పాకం పట్టిన బియ్యప్పిండి చారు-అట్లు, పాకం గారెలు+పుణుకులు (గులాబ్ జాములు సూరీడు ముందు దివిటీలే), బెల్లం కాసేప్పుడు ఆ పైన తెట్టుతో తెచ్చే పానకం, అసలు శ్రీరామ నవమి పానకం, బెల్లపచ్చు, మజూరపు ఉండలు, మరమరాల ఉండలు, బెల్లం చలివిడి, కొబ్బరప్పాలు, అరిశెలు...ఇంకెన్నో (బెల్లం ఆవకాయ/మాగాయ, అల్లం పచ్చడి, బెల్లం పులుసులు, జీళ్ళు లెక్కకి కూడా వెయ్యలా)- నన్నిలా బెల్లపు సంద్రం లోకి విసరటం మీకు భావ్యమా! :)నెనర్లు.

   Delete