కొందరున్నారు కదు ఇలా!?

నిన్నటి రాత్రే శుభ్రపరిచిన గిన్నెవైపుకి కనులుగా
అడుగులు స్థిరంగా కదులుతూ
మొన్నో మునుపో మిగిలిన కలదో కథదో
అక్షరాలు అస్థిరంగా మెదులుతూ
ఉదయాన్ని తేనీటితో తడమటానికి సిద్దపడతాను
మరిగే నీరు, పొంగే పాలు, విరిగిపడే పొడి, కరిగిపోయే చక్కెర
ఒక్కొక్క దశగా శ్రద్ధగా చూసుకుని కప్పులోకి వంచుకున్నాక-

కొనసాగింపులు వేగం పుంజుకుంటాయి,
కప్పుని కావలించుకున్నంత దగ్గరగా తీసుకున్నాక
ఊపిరిలోకి సాగే ఆవిరితో...

కప్పుని అడ్డంపెట్టుకుని కన్నీరు దాచిన ఊసు
ఇంకొకసారి పొలమారుతుంది
తదేకంగా టీ లోకి విసుగ్గా చూస్తూ
వదిలించుకున్న వ్యక్తి నీడ కప్పులో తేలుతుంది
మరొకసారి నవ్వుకి తెర తొలుగుతుంది

చురుక్కుమనే వేడితోనో, ఊదుకుంటూ తాగే రుచితోనో
ఇంకొక పది నిమిషాల సాగిపోతాయి
రోజులోకి సాగే ఊహలతో...

రోజూ ఎదురుచూపు విధిగా ఈ తంతుకి:
కొత్త ఆఘ్రాణింఫు కప్పు నుండి కావచ్చు,
ఖాళీ అవుతున్న కప్పు నింపుతున్న ఉత్సాహానిది కావచ్చు
రెండూ మారకపోవచ్చు, అయినా ఫర్వాలేదు...

తేనీటి సమయాలు, ఉదయాలు విసిగించవు
తప్పనిసరైతే తప్పా పంచుకోవాలనీ అనిపించదు

No comments:

Post a Comment