దీపపు స్తంభం

పగలు ఆ స్తంభం తాలూకు కదలికలుండవు
నిలువెత్తు శిలలా నిలుచున్న నీడలా నిశ్శబ్దం గా,
పొగమంచు లో పరుగుపెట్టే ప్రపంచం లో ఒంటరిగా. 
విసుగెత్తని గాలులు అక్కడక్కడే దొర్లుతాయి


చీకటి కమ్ముకొచ్చే సమయాల్లో
పరిసరాల్లో నిదానం మొలుచుకొచ్చి
దీపపు వెలుగులోకి దూసుకువస్తుంది.


స్తంభం లో చలనం వస్తుంది-
రెక్కలు రాల్చుకు ఒరిగే ఉసుర్లు ఉండవు కానీ,
మంచు తునకలు సెగకి కరిగి చుక్కలుగా
సవ్వడిని చిలరిస్తూంటాయి

వాహనాల వీపు మీద నీడలుగా
అటూ ఇటూ స్తంభపు ఉనికి తాపీగా తిరుగాడుతుంది
తప్పని నడకల పాదాలు నిలకడ తప్పి తూలుతాయి

అర్థరాత్రి వేళకి వలయాకారపు ప్రపంచం-
వింత వన్నెలో స్తంభానికొకటిగా చలిస్తుంది
నిదుర తాకని తనువులు ఎన్నోకొన్ని
కిటికీలు, కనులు తెరిచి పెట్టుకుని ఊరట వెదుక్కుంటాయి.

No comments:

Post a Comment