స్నేహాన్ని తలుచుకోవాలా?


Every friendship starts when a heart extends a hand: Happy Friendship Day! ఒక రోజున, ఒక మాటగా, ఒక తీరుగా వెలికి తేలేని క్షణాన అసంబంధంగా తోస్తూనే అవ్యక్తానందం మిగిల్చేది ఏది? చెలిమి కాదా?! తాటాకు బొమ్మ, ఈతాకు బూర, కొబ్బరిపుల్లల విల్లంబులు, రేగివడియాల పంపకాలు, తాయిలాల తన్నులాటలు, ఏడు పెంకుల కుమ్ములాటలు, చింత గింజల చిరు కయ్యాలు, కోనేటి గట్టున కలబోతలు, పుస్తకాల మడతల్లో ముసిముసి నవ్వులు, గుప్పిట్లో రహస్యాలు, దోసిట్లో జాజులు, సందిట్లో సంబరాలు, ఇంకు మరకల ఉత్తరాలు, చేతిలో చెయ్యేసి ఊసులు, ఫోను ముచ్చటలు, ఈ-మెయిలు కొసమెరుపులు, బ్లాగు బంధాలు, ముఖపుస్తకపు అనుబంధాలు, వాట్సాప్ వాలకాలు... ఎక్కడో ఒక చోట స్నేహపు ఆనవాలు నాకు గురుతే. "చెలిమికి ఇన్ని చిరునామాలా!?" అని అబ్బురపడుతూ ఒక్కో పేరు చేరువగా చేర్చుకోవటమూ షరా మామూలే.
తెలిసినదానినుంచి, తెలియనిదానినుంచి, వాస్తవంనుంచీ, ఊహనుంచీ అనుభూతిని తవ్వి తీయగలాది మైత్రి కాక మరేవిటీ? కలిమిలో బలిమిలో లేమిలో ఓటమిలో కలలో, కలకలం లో తోడై, కొన్ని సార్లు వెనుక నీడై, మరిన్ని సార్లు ముందరి దారై, మరి మిగిలిన మార్లు అడుగు కలిసి చేయి కలిపి నడిచిన నేస్తపు పేరు, రూపు చెప్పనా? వద్దులే, ఇదిగో ఈ చాపిన చేతికి అద్దుకున్న జాజర చాలదూ, స్నేహ పరిమళం నిన్నూ కమ్ముకుపోను...

No comments:

Post a Comment