తరు తన్మయం

వెలుగు రేఖలు విప్పుతూ వస్తున్న ఉదయభానుని పలకరించాలని ఉంటుంది-

కొమ్మని పట్టుకుని వేలాడే నిన్నటి జాజులు, మొన్నటి కరవీరలు
పరుచుకున్న పారిజాతాలు, రేకులు తెరుచుకుని తామరలు
వికసిస్తున్న మందారాలు, వేళకాని వేళకే సిద్ధంగా ఉన్న నిత్యమల్లెలు
గిన్నెమల్లి, పొన్న పూలు, కాశీరత్నాలు ...పూచేటి పూలు పిలుస్తుంటాయి

మెలకువ, మరకువ వంతులేసుకుని నా నుంచి నన్ను విడదీస్తాయి

మల్లెలు మధ్యాహ్నానికే వనాలు వీడిపోతాయి 
రాధామనోహరాలు రాత్రీపగలు ఎరుగవు 
కనకాంబరాలు, వాడాంబరాలు, నీలాంబరాలు నిలువరిస్తాయి 
సందె పొద్దు వరకు గాలుల వెంటా, చూపుల నిండా పరిమళాలు, రంగులే రంగులు

రజనీకాంతుని రాకకి సన్నాహాలు మొదలౌతాయి

కలువకి కంగారు మరీ ఎక్కువ కొలను నిండా ఒరుసుకుని...
సంపెంగ గంధాలు చిలుకరిస్తూ గాలులు
మైమరపు మలాము అద్దుతూ ఎన్నెన్నో జాజరలు, నిదురలోకి జారిపోతూ నేను 
వెలుగు ముడుచుకోదని నా రెప్పలే మూసుకున్నానని తలపోస్తాను, చీకటి గుండెలో చిత్రాలు కంటాను

నేనొక తరువునై నర్తిస్తాను- రెమ్మకొక రంగుగా, వన్నెకొక పూవుగా, నాలోకి నేను వికసిస్తాను- ఆనందోదయాన పునః ప్రభవిస్తాను..నేలని వాటేసుకుని పులకిస్తాను.

2 comments:

  1. wow..came here after a long time.. nice one..

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా ఆనందమేసింది- ఆ సంబరాల్లోనే ఈ జాప్యం. 2010 నుంచీ బ్లాగుల దశ మారిపోయింది (నేనూ దేశదిమ్మరిలా రెండు మూడు వాసాల్లో వాసాలు పటుకు వేళ్ళాడి చివరికి నా వనానికే వచ్చి పడ్డాను, ఇక్కడ స్వంత భావన గృహానికి చేరిన భరోసా వచ్చాయి) అలానే ఇలా పాత సాహితీప్రియులు మిత్రులు తారసపడి పలుకరిస్తే చాలా బాగుంటుంది. నిజానికి 2014 లో నేనో అందరి బ్లాగులూ చూసి వచ్చాను (నిరాశతో వెనక్కి మళ్ళి )

      Delete