విడివడ్డ క్షణంలో

ఆ వేకువఝామున
వెన్నెల ఇంకా మలిగిపోలేదు
సందె ముగ్గులు చెదిరిపోలేదు
పారిజాతాలు కొమ్మనే పట్టుకుని ఉన్నాయి
కొబరాకుల మీద కచ్చేరీలు మొదలవలేదు...
ఆ పక్క మీద నుంచి తనూ లేవలేదు
ఫోను తాలూకు ధ్వనులు ప్రాకిపోయాయి
వచ్చినవారు వస్తున్నవారికి చెప్పుకుపోతున్నారు
ఊరివారు వెనకముందుల సంగతులు వీపున వేసుకున్నారు
పనులు జరిగిపోయాయి.
ఇకప్పుడు జరగనివి, జరిగినవి ఒక్కసారిగా ఉప్పెనై
తనవారు, తను మిగిల్చినవి మాత్రమే మునకలు వేస్తూ.
మరణం మరునాటికి ఇంకొక చిరునామా వెదుక్కుంది
జరగరానిది, జరగనున్నవి సాగిపోతున్నాయి
రోజుకొక బతుకువెత బుద్భుద భరితంగా...

4 comments:

 1. చావు తథ్యమనియు తప్పదని తెలిసి
  కూడ ఆశ చావ కుండ మనును
  మనిషి మరువమల్లె మరణించియును తాను
  బ్రతికి యుండవచ్చు పరిమళమున

  ReplyDelete
  Replies
  1. Thanks for your intense comment Sir. Yes, "ఆత్మని పరమాత్మ పిలవడమే మరణం. ఆ పిలుపు తనువుకి వినపడదు ఆత్మకి వినిపిస్తుంది. దేహాన్ని వీడి పరమాత్మని చేరుకుంటుంది."

   Delete
 2. ఉషా రాణి గారు, మీ బ్లాగు ను చదువుతూంటాను. కవిత్వం రాయటం వ్యక్తిగత టాలెంట్ యే గాక, సున్నితత్వానికి , ఆధ్యాత్మిక పరిణతికి చిహ్ణం. సున్నితత్వం సమాజాన్ని, ప్రకృతిని తీవ్ర పరిశిలన వలన వస్తుంది. మీ రచనలలో అవి ఉన్నాయి. హార్ట్ అండ్ మైండ్ సమపాళ్లు కలసి జీవించే వారిని చావు దరిజేరదు. యశ: కాయం తో భవిషత్ తరాల వారి మదిలో జీవిస్తూనే ఉంటారు.

  ఆత్మ దేహం వీడినా ఆధ్యాత్మిక వాదులు దేహం ధరించి భూమీదకు మళ్లి గడపాలంటే తప్పక తిరిగి జన్మించవచ్చు. ప్రకృతి అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రకృతిని ప్రేమించే వారికి చావు అనేదే లేదు ఈ ప్రపంచంలో.


  ReplyDelete
  Replies
  1. ఎనానిమస్ గారు, మీరెవరో తెలుసుకోవాలన్న కుతూహలం లేదు; ఎలా సంబోధించాలి అన్న మీమాంస తప్పా. మీ ఆప్తవక్కులకు నెనర్లు. దాదాపుగా 25సం. గా పఠనం అదీ ఆథ్యాత్మిక తాత్త్విక అంశాలు, ప్రకృతి, సౌందర్యోపాసన కలగలిపినవే నన్ను నిలిపాయి.తెలిసిన ప్రకృతి ఇంత మధురమైతే ఆత్మ చేరే ఆ పరమాత్ముని విశ్వం చేరడమే అక్కడి ప్రకృతిలోకి లీనమవడమే కావాల్సింది. _/|\_

   Delete