చిదుగులు రాలుతుంటాయి, ఏదో ఒక దిక్కు నుంచి గాలి వీస్తుంటుంది
మాగిన పూరేకులు, పలకమాగిన పళ్ళు కంటి చూపు మేరా-
రంగులు మారిన ఆకుల వెనుగ్గా ముసురు తాకిళ్ళ ఆకాశం
చిగురు తొడుగుతున్న తీగకిక సమయం లేదు
విచ్చీ విచ్చని మొగ్గలూ ముగిసిపోతాయిక...
వడిలిపోతున్న ఆకులు, వెచ్చని ఉభయ సంధ్యలు సెలవు తీసుకోనున్నాయి
గుబులుగా ఉడుతలటూ యిటూ తిరుగాడుతూ పికాన్ నట్స్ పోగేసుకుంటూ
కుదురుగా పిట్టలూ అదే పనిగా మట్టి గుట్టల్లో, చెట్టు తొర్రల్లో తవ్వితోడిపోస్తూ
ఉన్ని దుస్తులు, తోలు పాదరక్షలు వెలికి తీసి ఉసూరంటూ అందరమూ
వచ్చి పోయే శీతువు ని ఎప్పుడూ కొత్త ఋతువుగానే ఊహిస్తూ...
నిరుడు, ఆ మునుపటేడూ ఇవే మాటలు చెప్పుంటాను, ఊసులు రాసి పోగుపడుతుందిలా మరి!
No comments:
Post a Comment