విశ్వామిత్ర 0 - ప్రేమాన్వేషి : మిత్రవింద

విశ్వ,

రేపు మనం కలుస్తున్నాము. నీకు చెప్పే మాట ముందుగా నాకు చెప్పుకుంటే తెలియని ఉద్వేగం. క్షణాలు లెక్కిస్తూ, రేపుకై వేచివున్నాను. ఎందుకో ఈ రాత్రి గుబులుగావుంది. నీ తలపులే నింపిన గుండెలోకి తొంగిచూసుకుంటుంటే, ఆణిముత్యం వంటి నీ నవ్వు నా పెదాలకి అద్దిన నీ ముద్దుతో నా కళ్ళలో విరిసినట్లుగావుంది. ఇక ఏమి చెప్పాలో కూడా తెలియనన్ని వూసులు చెప్పేసాను. ఇప్పటికే నీ మోముపై చిరుదరహాసం పరుచుకుపోయుంటుంది. ఆ వెలుగులు తెచ్చి నా వాకిట పరిచిన వెన్నెలమ్మకి కాసినన్ని మల్లెలిచ్చి పంపుతాను నీ ముంగిట పరిచి రమ్మని. వేకువ ప్రొద్దుల్లో నా లేఖలై నీ మనసు రంజింపచేస్తాయేమో...

అవును, ఇది నీకు సగంసగం మాత్రం అర్థమయ్యే భాషే. రెండేళ్ల క్రితం నేను నీకు వ్రాసిన లేఖజతపరుస్తున్నాను. ఇలా ఎన్నో నా డైరీ దాచేసుకుంది. నీతో సంభాషించటం నాకు నిత్యకృత్యం.

- నీ మిత్ర.

*******************************
చుక్కాని లేనిది నా బ్రతుకు నావ,

చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నిన్ననుసరించి నా గమనం.
నను నడిపించగ నీ చలనం.
నడిసంద్రాన మన పయనం,
నావకి ఎరుకలేని గమ్యం.
ఆటుపోటుల అరిషడ్వర్గాలు.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
కలవలేమని సందేహపడకున్నాం.
కలిసితీరాలని ప్రమాణాలు చేస్తున్నాం.
ప్రేమనన్వేషించే సిద్దసాధకులై
తిరిగి తిరిగి ఈ లోకానే ఉద్భవిస్తున్నాం.

10 comments:

 1. "తిరిగి తిరిగి ఈ లోకానే ఉద్భవిస్తున్నాం."
  ఈమాట నేనొప్పుకోను. ఇంతచక్కటి చెలికాడిని, అతని ప్రేమనీ పొందిన తరువాత కూడా ఇంకా మరో జన్మ ఉంటుందంటే నేనొప్పుకోను.
  ప్రేమను (అమృతాన్ని) సేవించాకా, దాని రుచిని చవిచూచాకా జరా మరణాలు ఎలాఉంటాయి.
  ఎప్పుడో మీరు అమరులు ( దేవతలు ) ఐపోయారు. :)
  కవిత చాలా బాగుంది. :)

  ReplyDelete
 2. ప్రేమ అమృతం కంటే గొప్పది. దాని కోసం మరల మరల జన్మించడం.., కవిత చాల బాగుంది.

  ReplyDelete
 3. Its different.....chaala baagaraasaaru!

  ReplyDelete
 4. కధ మొదలైందని అనుకోవచ్చా ? ఇది కధా ప్రారంభమే కదూ ?
  కవిత చాల బాగుంది.

  ReplyDelete
 5. కమనీయమైన కధాకవిత.....కొనసాగించండి!!

  ReplyDelete
 6. విజయ్ శర్మ గారు, ఆ కవిత మిత్ర 2సం. క్రితం వ్రాసుకున్నది. ఇప్పుడు అడిగితే మరో మాట రావచ్చు ఆమె నోటినుండి. నిజమే ప్రేమని చవిచూసినవారంతా అమరులే.నెనర్లు.
  పునర్వసు, చిరకాల దర్శనం, కుశలమేనా? ప్రేమామృతం సేవించాకనే అమరత్వసిద్ది పొందినంతటి అనుభూతి కలిగింది. అదే ఈ రచనకి దారితీసింది. నాకు అక్షరాల్లో ఇమడ్చగల శక్తివుందో లేదో తెలియదింకా. ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @ సృజన, చిరకాలానికి మీ వ్యాఖ్య. నచ్చినందుకు ధన్యవాదాలు.
  @ పరిమళం, ఒకవిధంగా అంతే. కవితావేశం తన్నుకు వచ్చి చివరికలా ముగించాను. నెనర్లు.
  @ పద్మార్పితా, నన్ను కొనసాగనిచ్చేది మీవంటివారి అభిమానమే. కృతజ్ఞతలు.

  ReplyDelete
 8. ప్రేమ కథా కావ్యం ప్రారంభమయింది....

  ReplyDelete
 9. వర్మ, మీ వ్యాఖ్య కొరకు చూస్తున్న తొలిభాగం సిద్దం. ప్రేమ కథా కావ్యం చేస్తానంటారో లేదో అది చదివాక చెప్పండి. నెనర్లు.

  ReplyDelete
 10. ఉష గారూ,
  ప్రారంభం అందంగా మొదలైంది. మాలాంటి చదువరులందరికీ ముందు ముందు మీ 'విశ్వామిత్రం' మరింత ఆనందాన్ని కలిగిస్తుందని తలుస్తాను.
  కవితా పుష్పాలే కాకుండా మరువపు తోటలో వికసిస్తున్న క్రొంగొత్త నవలికా పుష్పానికి అభినందనలు :)

  ReplyDelete