ఆరని దీపం

తవ్వి తోడి పారేద్దామన్న
నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను

పూడిక తీయని ఆ లోతుబావిలో
వూపిరి సలపక సొమ్మసిల్లిపోయాను

పాతాళజలలో శీతలమై

నీ మమత నను కలిసింది

అలముకున్న ఆ నీటి నీడల్లో

నీ నవ్వు నను కదిపింది

ఆ నిశీధి నీరవంలో

నీ మాట తోడై రాగం పలికింది

ఎదుట నిన్ను చూసి

ఎప్పటిమాదిరి తెప్పరిల్లాను

చెమ్మగిల్లిన కనుల

నీ అరచేతుల్లొ సేదదీరాను

మౌనంగా నను లాలించు

నీ ఆత్మీయతలో తనువుమరిచాను

నేనుగా ముగిసి

నీ ప్రతిమగా మారిపోయాను

నీలోసగం నాలోసగం ఉనికితో

ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది

27 comments:

 1. ఆ దీపం ఆరదు, ధృవతారలా వెలుగుతూనే ఉంటుంది

  ReplyDelete
 2. "తవ్వి తోడి పారేద్దామన్న
  నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను"
  జీవితాన్ని సున్నితంగా చూసుకునేవాళ్ళకు తప్పవేమోనండి ...చాల బాగుంది.

  ReplyDelete
 3. ఈ 'మమైకం ' చాలా బాగుంది. ఎప్పటికైనా కావల్సింది విడదీయరాని అనుబంధమే కదండి.

  ReplyDelete
 4. Usha gaaru, I donno how to react.

  కవితా దీపం దేదీప్యమానంగా విరాజిల్లాలని ఆశించడం తప్ప.

  ReplyDelete
 5. "నేనుగా ముగిసి
  నీ ప్రతిమగా మారిపోయాను " బహు చక్కని వ్యక్తీకరణ..

  ReplyDelete
 6. ప్రేమికులే ప్రేమకి ప్రాణాన్ని పోసి ఉనికిని ఇస్తారు.
  అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 7. "ఎదుట నిను చూసి..." నుండి చివరి వరకు ఒక ఐదారు సార్లు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను ఉష గారు. ఆ లైన్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి :-)

  ReplyDelete
 8. నేనుగా ముగిసి
  నీ ప్రతిమగా మారిపోయాను
  నీలోసగం నాలోసగం ఉనికితో
  ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది
  ముగిసి పోయాక ఇంకా వునికి ఎక్కడ్డన్డి?లాస్ట్ లైన్ తీసేస్తే పరిపూర్ణత వస్తుందని నా భావన .

  ReplyDelete
 9. సిరి సిరి మువ్వ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తన మాటలే సగం స్ఫూర్తి. మిగిలినది నాలోని ఆర్తి. వెరసి ఈ కవిత.

  ముందుమాట ఎప్పటి మాదిరే అందరికీ ధన్యవాదాలు + నెనర్లు. చివరి మాట వరకు చదివితే మరో విషయం వుండి. :)

  @ ప్రదీప్, మీరు నా మనసు లో తారాడు రెండిటినీ ఉద్దేశ్యించి అన్నారని నా భావన.ఇది ప్రయత్న పూర్వకంగా వెలిగించిన దీపం. ఆరనీయను.

  @ నేను, మీరు నవ్వితే, నేను కన్ను గీటి మరీ నవ్వుతున్నాను ;)

  @ చిన్ని, నిజంగా మీవి మంచూంత చల్లటి పలుకులు

  @ జయ, అవునండి ఏ అనుబంధంలోనైనా అలా పెనవేసుకుపోతేనే అది నిలుస్తుంది.

  @ భా. రా. రె కూడా నా ఉద్దేశ్యాన్ని పట్టేసారు :)

  @ మురళి, అలా ప్రయత్నించారా ఎపుడైనా?

  @ శ్రీనిక, ప్రేమకి మరి చిరునామ ఎక్కడిది ప్రత్యేకించి చెప్పండి

  @ వేణు గారు, భావుకత మీ సహజ లక్షణం అని అబ్రకదబ్ర చెప్పటంలో ఎంత నిజం దాగుండో? అండుకే నా పంక్తుల్లోని జీవాన్ని చూడగలిగారు. మీకు స్పెషల్ థాంక్స్.

  @ రవి గారు, ఇక్కడ నేను అన్నది "అహం" కి ప్రతీకగా వాడి, ఆ నేనుగా ముగిసిపోయి నీ ప్రతిమ అన్నది, ప్రేమ మూర్తి అయిన తనకి మారు రూపుగా అంటే "ప్రేమ" నింపుకున్నాను అన్నదానికి వాడాను. నిలదీసినందుకు సంతోషం.:)

  ఇక చివరి మాట - నా జీవితంలో ప్రత్యామ్నాయం లేనివి తను, మరువం. మరువం అంటే మీకెంత ఆపేక్ష అన్న సిరి సిరి మువ్వ గారి మాటలకి నిదానంగా ఒక సాలోచన, మరువాన్ని వదిలేయగలనా అని, అది ఆ మొదటి రెండు పంక్తులకీ దారి తీసింది. కాసేపటికి స్ఫురించిందేమిటంటే తననెంత అభిమానిస్తానో మరువాన్ని అంతే గాఢంగా ప్రేమిస్తున్నాను. ఒక అనుబంధం లో రెండు హృదయాలు వుంటాయి. మరువం నా వరకు సజీవ చైతన్యం. దానికి ప్రాణం మీరంతాను. మీ అభిమానం మృతసంజీవి. మీరు-నేను మన సాహిత్యానుబంధం. మరొక అర్థంలో తను-నేను మా అనురాగబంధం. ఈ రెండిటా ఉనికి సంతరించుకున్న ప్రేమ భావనల, స్పందనల ధృవతారే నా కవితాదీపం. అది ఆరని దీపం. నెనర్లు.

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 11. చాలా బాగుందండీ...

  ReplyDelete
 12. మరి తాళం చెవి మీకిచ్చేశాగా నేనేం అనగలను ;)

  "నేనుగా ముగిసి
  నీ ప్రతిమగా మారిపోయాను"
  చూసి "అలలెగసే యెదలయలో అతడేనా...ఇక నేనేలేనా" అన్న పంక్తి గుర్తొచ్చింది, ఓ పాటలోంచి :)

  ReplyDelete
 13. వుష ! అధ్భుతమ్ అభినందనలు.!అంతకన్న నాకు పదాల అల్లిక ఎలా అల్లాలో అర్ధం కావడం లేదు.
  తవ్వి తోడి పారేద్దామన్న
  నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను

  పూడిక తీయని ఆ లోతుబావిలో
  వూపిరి సలపక సొమ్మసిల్లిపోయాను.....
  ప్రగాఢంగా బంధింపబడిన ఆత్మీయతా బంధనాల గుర్తులు బంధాలు తెగినా అంత త్వరగా చెరిగి పోవు . యీ రెండు ద్విపదలూ దివ్య భావనలే
  అప్పుడప్పుడూ నాతో కూడా సంభాషిస్తూ వుండవమ్మా, నాకూ ఎంతోకొంత యింత గొప్ప సామర్ధ్యం నాకూ అంటుకొంతుందేమో. ఆశీస్సులతో......నూతక్కి

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. @తృష్ణ, సుజ్జీ, అప్రయత్నంగా ఒక బలమైన భావన కలిగితే ఇలా వెలికివస్తుందేమో. మరువం గురించి - నా అనుబంధం, నా తర్వాత ఎవరు ఇలా ధీర్ఘమైన ఆలోచన చివరికి ముందు పంక్తుల్లో కనపరిచిన "అహం" పట్ల బిడియం ఇవీ నా స్పందనలు. మరువం నాకు, మీకు మధ్య వారధి; నాకు తను జీవం. ఇక "తన"ని గురించి ఈ మరువం ఘోషించనిది ఏనాడు కదా? ?:)

  ReplyDelete
 16. @నేను, అందుకా బంగారుతల్లీ పలుకే బంగారమా అని పాడించావు నాతో? నిరభ్యరంతరంగా కవితలని గురించి ఒకింత నా గురించి వ్రాయండి. ఇది మనవి అనుకో ;) మీరిచ్చిన పంక్తి చూస్తే నేను వ్రాసుకున్న [నా కవితలన్నీ మరువం లో పెట్టలేదింకా]

  ఏటి కెరటమై ఎగిసాను
  వెన్నెల దీపమై మెరిసాను
  మల్లియగ విరిసాను
  చెలిమిగ నవ్వాను
  నిను చేరి నేనయ్యాను
  నానుంచి నేను విడిపోయాను
  ఆ పాత్రలో నిన్ను నింపి మురిసిపోయాను
  నిన్నే చూస్తూ నన్ను మళ్ళీ రూపు దిద్దుకున్నాను

  గుర్తుకు వచ్చింది...

  ReplyDelete
 17. నూతక్కి వారికి, ముందుగా వినమ్రంగా ప్రణమిల్లుతూ... మీవంటి అనుభవజ్ఞుల ప్రశంస, ఆశీస్సులు మనోబలాన్నిస్తాయి. నిజానికి నాపట్లకలిగిన వాత్సల్యం వలన నా కవితకు మీరంతగా స్పందించారు, లేదూ మీ జీవితానుభవం దాన్ని అంగీకరింపచేసింది. ఆముందు రెండు ద్విపదలే ఆశువుగా వచ్చింది. ఒక రోజు గడువు తీసుకుని అదే స్థితిలోకి మనసుని నెట్టి మిగిలినది పూర్తి చేసాను. చాలా సంతోషండి. తప్పక మీతో వ్యాఖ్య ప్రతి వ్యాఖ్యల్లో కలుస్తాను. అంతకు మించి మీకు నేర్పగల దానినా. ఇక్కడి ఘనాపాటి సాటివారిముందు మనగలనా? మా కిట్టయ్య మాష్టారు వింటే అదిగో కొమ్ములు మొలుస్తున్నాయి అంటారేమో! వస్తూ వుండండి. రాకపోకల్లోనే అనుబంధాలు పెరుగుతాయి. కదా?

  ReplyDelete
 18. బంధాలనూ అనుబంధాలనూ అంత త్వరగా వదిలేసుకోగలగటం మానవ నైజం కాదు. మనిషి మనిషి మధ్య ఉండే/కలిగే అనుబంధం ఒక వ్యక్తి ఙ్ఞాపకం ఉన్నంతవరకూ ఉంటుంది. వదిలేద్దామన్నా వదిలేది కాదు. ఆరని దీపమది కాదు, ఆరనివ్వని శక్తి కూడా అది.

  ఇంకా చెప్పాలి చెప్తానేమో మరి.

  చెప్పినట్లున్నాను. నాదైన (మీ ఆలోచన అదే అవునో కాదో నాకు తెలియదు. నాకనవసరం ;-)) అవగాహన అందకుంటే నేను వ్యాఖ్యానించను.

  ReplyDelete
 19. రెండు అసంపూర్ణాలు కలసి సంపూర్ణమైనదా? (The above comment is the one to come second. Read in reverse order. This is done to correct a typo. మీరింత హృద్యంగా చెప్పిన చోట అలసత్వానికి తావుండకూడదు కదా. నా టైపో అయినా మీ కవిత అందాన్ని చెడగొట్టకూడదు).

  Understanding some thing in between the lines. Or am I mistaken? The first three lines are excellent

  ReplyDelete
 20. నీలోసగం నాలోసగం ఉనికితో
  ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది

  These lines are more than nice

  ReplyDelete
 21. నేనుగా ముగిసి
  నీ ప్రతిమ గా మారి పోయాను !
  బాగుంది .

  ReplyDelete
 22. నేనుగా ముగిసి
  నీ ప్రతిమగా మారిపోయను
  నాకూ ఈ కవితా పాదం నచ్చింది. ప్రేమను ఆవిష్కరించడంలో మీకు మీరే సాటి.

  ReplyDelete
 23. @గీతాచార్య, నా అంచనా తప్పనీయలేదు. అచ్చుతప్పుని చూడగానే అనుకున్నాను వెంటనే మీరే దిద్దుతారని :) ఇకపోతే అవునండీ ఇది అంతర్లీనంగా మరువానికి ఆరనివ్వని స్వయంప్రతిపత్తి వుంది నేన్నక్కడ నిమిత్తమాత్రురాలినని తెలియచేస్తూ, తనని సమస్థాయిలో బహిర్గతం చేసానంతే. పైన సరైన వివరణ ఇచ్చాను. మీ అవగాహనే నాదీను. జ్ఞాపకాల్లో బ్రతికి, అనుబంధాలతో జీవితాన్ని ముడివేసుకున్నదాన్ని.

  @సృజన, అవి నా జీవనవేదం. మళ్ళీ మళ్ళీ నాకు నేనే ఉపదేశించుకుంటుంటాను.

  ReplyDelete
 24. @ మాలా గారు, మీకు అది అనుభవైక వేద్యమేగాండి. సహవాసం, సహజీవనం. సగపాళ్ళు. వెరసి సంపూర్ణం ఈ అనుబంధం.

  @ కుమార్ గారు, ఎందుకు పేరు మార్పు? వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  ReplyDelete
 25. ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
  http://www.raki9-4u.blogspot.com
  http://www.rakigita9-4u.blogspot.com
  rakigita9@yahoo.com
  rakigita9@gmail.com
  mobile:9849693324

  ReplyDelete