That road I travel daily


ఇప్పుడు యీ త్రోవ లోనే వస్తూ పోతూ ఉంటాను
తరుచుగా...
తొలిసారి అగమ్యగోచరంగా చీకాకుగా అనిపించింది
త్వరపడి
చేరాల్సిన స్థలి దిశగా, దృష్టి మారకుండా
దాటిపోయాను
ఏదో పోటీ పందెపు ఉద్విగ్నత
నాతో ప్రయాణిస్తూ ఉంది ఆనాడు


ఇంకొన్నాళ్ళు గడిచాక
ఏదో దేవాలయం ఉందని
వెదుకుతూ నిదానంగా సాగాను
బాట వెంబడి గురుతులు
పదిలంగా పోగేసుకుంటూ
వెళ్లిన పని ముగించేసరికి
ఏదో శాంతి నిండిన నిలకడ
నన్ను వెన్నంటి ఉంది ఆనాడు


కాలగమనాన ఇపుడు రోజూ ప్రయాణిస్తుంటాను
ఈ త్రోవలోకే పోవాలని చూస్తాను
కొన్ని దృశ్యాలు కుతూహలం గా గమనిస్తాను
కొందరి పయనం లోకి చూపు సారిస్తాను
కొన్ని వేగాలకి నివ్వెరపోతాను
ఎన్నో తెరలు తీసుకుని నాలోకి జారిపోతాను


త్రోవ మెలికలు తిరుగుతూ ఆటో ఇటో గమ్యాలకి
దారి తీయిస్తూ ఉంటుంది
నేనూ సుడులు తిరిగే యోచన వెంటా
పరుగులు తీస్తూ ఉంటాను
చీకాకు, నెప్పి, నవ్వు, బెంగ, పేరు తెలియని భావన
నా నుంచి విడివడి, తోడుగా ఉంటాయి


ఇప్పుడు క్రొత్త బాట ఎదురైనా తెలిసినట్లే ఉంటుంది
తెలియని దారులు పాత పరిచయాలుగానే అగపడతాయి

1 comment:

  1. చాల బాగుంది ఉష గారు.

    https://telugupadam.net/ ఇది నా బ్లాగు. వీలు దొరికినప్పుడు చదివి మీ విలువైన అభిప్రాయము తెలుపగలరని మనవి.

    ReplyDelete