ఆకలికి ఇంకా ఆకలి తీరలేదు

ఆకలి కూడా ఆవురావురంటోంది.
అందినవన్నీ ఆబగా కతుకుతుంది.
ఆరనిమంటగా వెలుగుతూనేవుంది.
పేదయువత భవితని మింగుతూవుంది.

ఆకలని వ్రాయను డు ము వు ల విభక్తులక్కరలేదు.
ఆకలి ఆక్రందనకి శృతిలయలవసరంలేదు.
గాలికి మల్లే కంటికి ఆనదు, జఠరాగ్నికి మాత్రం తానే ఆజ్యం.
వయోబేధమెరుగదు, రుచీ శుచి చూడనీయదు.

పూరిగుడెశలోనే విడిది చేస్తుంది.
రత్నాలు కొనగల వాడింట నిలవనంటుంది.
గంజి అరుదైన వాడిని వదలక వెన్నంటివుంటుంది.
కాలే కడుపుల కన్నీటి జలకాలాడుతుంది.


ఆకలి ఎరుగని ఆసామి కళ్ళకి మరో ఆకలి,
అది తీర్చను ఆకలిగొన్న మరో బక్కప్రాణి కాదా బలి?
అక్షరజ్యోతి వెలిగించని జాతి అధోగతా ఇది?
ఆకలిని అమరురాల్ని చేసిన జనతదా ఈ దుస్థితి?

కూడి మనం చేయలేమా ఏదో ఒక నిస్వార్థ కార్యం?
కల్పించలేమా ఒక్కరినీ ఆకలి బారిన పడనీయని సౌకర్యం?
ముందంజవేసిన మనకొందరిదైనా కాదా ఈ కర్తవ్యం?
ఇవి నెరవేరేవరకు ప్రగతికి దూరం కాదా ఈ ఆకలి రాజ్యం?

14 comments:

  1. .టైమ్స్ అఫ్ ఇండియా వాడు ముంబై లో ఎడ్యుకేషన్ campaign స్టార్ట్ చేసారు ..ఒక మాదిరిగా స్ఫూర్తి ఇచ్చింది ఇక్కడ చిన్నారులకు ..ఒక మంచి అభిలాష నిజం అయ్యే రోజు రావాలని కోరుకుంటున్నా.. మీలోని భావనలను బాగా చెప్పారు.. ఈపోస్ట్ సంపూర్ణంగా కడుపు నిండినట్టు గా వర్ణించారు

    ReplyDelete
  2. చాలా ఆలోచనల్ని కలబోసిమట్లుందే! కానీ చదవడానికి బాగుంది. అక్కడక్కడా ఆగి చదవాల్సొచ్చింది...అర్థం చేసుకోవడానికే సుమా!

    ReplyDelete
  3. ఇంత మంచి ఆలోచనలు ఎలా వస్తాయి ..వచ్చినా ఇంత బాగా ఎలా ప్రెజెంట్ చేస్తారు.. చెప్పరా ప్లీజ్ ..

    ReplyDelete
  4. ఆకలని వ్రాయను డు ము వు ల విభక్తులక్కరలేదు
    స్పందించే మనసుంటే చాలు ...
    కూడి మనం చేయలేమా ఏదో ఒక నిస్వార్థ కార్యం?
    చినుకు చినుకు కలిసి ఉప్పెనగా మారదా ...
    చక్కటి సామాజిక స్పృహ ఉన్నా కవిత !

    ReplyDelete
  5. హరే కృష్ణ, కవితలోని స్ఫూర్తి, ఆకాంక్ష మీరు సృజించినందుకు కృతజ్ఞతలు. ఒక వ్యక్తి మానసికంగా ఎదగడానికి దోహదపడేది - కుటుంబ వాతావరణాం, పెరిగిన పరిసరాలు, ఆ వ్యక్తిలోని స్వభావం. అనుకోకుండా ఆ మూడు నాకు దోహదపడ్డాయి కాబోలు. ఇక ఈ భావజాలం, వ్యక్తీకరణ ఇవన్నీ సహజసిద్దంగా వచ్చయా, నేను పెంచి పోషించుకుంటున్నానా తెలియదు. కానీ వీటన్నిటి వెనుక నాకు కర్మ సిద్ధంతంలో ప్రగాఢ నమ్మకం. ఇంకా నా వరకు జీవితంలో పరిపూర్ణత లేదని అనిపిస్తుంటుంది. ఇప్పటికి ఉద్యోగినిగా, గృహిణిగా, ముఖ్యంగా అమ్మగా నా విధులు నెరవేరుస్తూ, ఆ పరిధి ననుసరించి ఏదో సేవకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంటాను. ఆ మూడో విషయంలో ఇంకొంచం లీనమవ్వాలి, నా మౌలిక బాధ్యతలు తీరగానే ఆ వైపు మళ్ళాలని ఆకాంక్ష.

    ReplyDelete
  6. మహేష్ గారు, మీరన్నది నిజం. ఎపుడూ ఇవి back burner job మాదిరిగా సాగే ఆలోచనలు. పైన జవాబులో తెలిపినట్లు ఏదో చేయాలన్న ఆకాంక్ష ఇలా అపుడపుడూ భావంగా గట్టిపడి, కవితగా వెలికి వస్తుంది. మీ వ్యాఖ్యాప్రశంసకి ధన్యవాదాలు.

    ReplyDelete
  7. పరిమళం, అవునండి నాలో ఈ సామాజిక స్పృహకి కారణం ఎదిగే వయసులో కలిగిన భాగ్యం. ఇక ఏ ప్రయత్నమైనా అంకురంగా ఆవిర్భవించి మహావృక్షంగా ఎదగాల్సిందే. చినుకు చినుకు కలిసినట్లే మనుషులంతా చేయి చేయి కలుపుకుని మహా శక్తిగా అవతరించాల్సిందే - అపుడే వసుధైక కుటుంబం ఈ జగత్తనే ప్రశంత కుటీరానా నివసించగలదు. మానవజాతి మహోన్నతంగా వెలగగలదు. ప్రతి మనిషి దేముడంత దివ్యమూర్తి కాగలడు. స్పందించినదుకు నెనర్లు.

    ReplyDelete
  8. "అమ్మాలాంటి చల్లనిది లోకామొకటి వుందిలే
    ఆకలి ఆ లోకంలో లేనే లేదులే, లేనే లేదులే"

    ఈ మధ్య చూసిన సినిమాలోని పాట ఇది. ఆకలితో అలమటిస్తున్న చిన్న తమ్ముడికి మరో చిన్నారి అక్క పాడే పాట ఇది -


    అది మనసులో ఇప్పటికీ మారుమ్రోగుతుంది. ఆ భావం, సుశీల గారి గళంలో వొలికిన ఆవేదన ఎంతవారినైనా కుదిపేస్తుంది. కేవలం ఆ పాటే కాకపోయినా చిన్నప్పటి నుండి ఆకలి ఆక్రందనల పట్ల చలించే మనసు నాది. మిగిలినవి పైన వ్రాసాను. ఈ కవిత, ఈ వ్యాఖ్యలు/అభిప్రాయాలు మరికొందరికి స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తాయని ఆశ. కానీ కేవలం చూసిన దృశ్యమో, చదివిన వార్తో మనిషిని మార్చేయదనీ తెలుసు. ఆ రెండిట నడుమ అనూహ్యంగా సంభవించేదే మనసు గారఢి. మనుషులంతా మానసికంగా ఎదిగే దశలో ఎప్పుడూ శిశువులే, కాదంటారా?

    ReplyDelete
  9. బాగుంది, పైన పరిమళం చెప్పినమాటలే నావీను.
    చివరలో ముందంజవేసిన అన్నారు. ముందంజ వేయడం అనో అనాలేమో. ముందంజ ఇంకా వెయ్యలేదనే కదా మీ వేదన :)

    ReplyDelete
  10. మాలతి గారు, క్లుప్తత కారణంగా కొంత స్పష్టతని కోల్పోయిందేమో నా కవిత. అక్షరాస్యతలో, ఆర్థికంగా, సామాజిక స్పృహపరంగా ముందంజ వేసిన మన ఈ కొద్ది శాతం మందిమీ కలిసికట్టుగా ఆ ఆకలి మహమ్మారిని అంతం చేయలేమా అని నా వేదన, ఈ కవితా నివేదన.

    ReplyDelete
  11. ఒకటిన్నర సంవత్సరం క్రితం హైదరాబాదులో హైటెక్ సిటీ ముందు ఒక దృశ్యం చూసా, అది ఎప్పటికీ మరవను. ఈ కవిత చదివాక ఆ దృశ్యం మళ్ళీ గుర్తుకొచ్చింది. అదేమిటంటే

    బైకు మీద ట్రాఫిక్ జామ్ వల్ల ఆగిన నా చేతికి చల్లగా ఒక చేయి తగిలింది, తల తిప్పి చూస్తే కృష్ణుడి వేషంలో ఒక బాలుడు బిచ్చమెత్తుతున్నాడు. మరో వైపు చూస్తే విదేశాల నుంచి వచ్చిన కష్టమరుతో కారులో కబుర్లు చెబుతున్నాడు.
    ఆనాడు ఆ స్పర్శలో బేలతనం కనిపించింది, ఆ పిల్లాడి చూపులో ఆకలి కనిపించింది. అటు పక్క ఆ మేనేజరు కళ్ళలో ప్రాజెక్టు వస్తుందన్న ఆశ కనిపించింది. నా కళ్ళలో అయోమయం వచ్చింది.

    మీ కవితతో ఇప్పుడు ఆ దృశ్యం మళ్ళీ కదలాడింది.
    (ఇంత త్వరగా మరో రసం మీద కవిత రాస్తారనుకోలేదు)

    ReplyDelete
  12. ఉషగారు, కవిత చదవడం త్వరగానే అయింది కానీ తేరుకోవడానికి సమయమెంత పట్టనుందో ఇంకా తెలియదు. ఒక మాట... డబ్బుతో కడుపునింపుకొనే ధనికుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆకలి బాధ అనుభవించి ఉంటాడు . కానీ వీడికి నిత్యబాధితుడైన పేదవాడంటే అలుసు... చీదర...సోమరి...పనికిరాని వాడు...
    ఈ సందర్భంగా ఉండేల మాలకొండారెడ్డి గారు చెప్పిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. సరిగా వాక్యం గుర్తు లేదు కానీ భావం ఇది.
    "రాళ్ళు తిని ఆరగించుకో గలిగిన నాడు
    తినడానికి రాళ్ళు లేవు.
    పళ్ళెంనిండా రాళ్ళున్న నాడు
    తినడానికి పళ్ళు లేవు"

    ReplyDelete
  13. అద్భుతంగా రాస్తారండి...
    ఇన్ని ఆలోచనలు ఎలావస్తాయండి!!!

    ReplyDelete
  14. ప్రదీప్, భాస్కర రామి రెడ్డి, పద్మార్పిత, ముందుగా మీ స్పందనకి నెనర్లు. విడివిడిగా నా ప్రతిస్పందన ఇది.

    ప్రదీప్, ఈ కవిత మీ చురకతో వెలికివచ్చిన మొలక. మీరు చూసిన దృశ్యం వంటివి మరెన్నో నాకూ అనుభవమే. నిజానికి పేదవారిలో కూడా ఆకలి వలన నైతిక విలువలు వదిలి మన జాలిని వాడుకునేవారు వుంటారు. నేను ఆ రకంగా కూడా మోసగించబడ్డాను. చేపని ఇవ్వొద్దు, చేపని పట్టటం నేర్పమన్న ఆ నానుడే మనమూ పాటించాలి. వారిని మార్చాలి. వారి బ్రతుకులనీ మార్చాలి.

    భాస్కర రామి రెడ్డి, నిజమేనడి ఆకలి అన్నది అందరికీ అనుభవైకవేద్యమే. అలుసు, అసహనం వారి వారి మనస్తత్వాన్ని బట్టి ధనిక వర్గాలు చూపుతారు. మీరు చెప్పిన మాటలు కొంచం అటు ఇటుగా వారన్నట్లుగా రేలంగికి, అల్లు రామలింగయ్యకీ అన్వయించిచెప్తారు. మీరు తేరుకుని ఈ స్ఫూర్తితో మరో టపా వ్రాయండి. అలాగే ఈ జ్యోతి ప్రజ్వరించాలి.

    పద్మార్పిత, కొన్ని పదాల్లోనే ఆ ప్రభావం వుంటుందేమో, అవే మనలో ఉద్రేకాన్నో, విప్లవ దోరణినో పెంచుతాయేమో. పేదరికం, నిరక్ష్యరాస్యత, ఆకలి ఇలా ఒక వర్గాన్ని పట్టిపీడించి దేశభావికి ఆటంకమౌతున్నాయి. త్వరలో అవి తొలగిపోతే బాగుండును. అందుకు మార్గమేదో దాని ఆచరణ ఎంత సాధ్యమో నాకింకా అంతుబట్టలేదు. నా వంతు కృషి మాత్రం నేను ఆపలేదు. ఆ స్ఫూర్తి నుంచి పుట్టిందే ఈ కవిత. ప్రదీప్ మాటతో, నా నేస్తం ఒకసారి అటు దృష్టిపెట్టు అనటంతో ఆలోచన దానివెంబడి ఆవేశం ఇలా వొలికాయి.

    ReplyDelete