మరో ప్రయత్నం!

రాధామాధవీయం మన ప్రణయం
అని అనుకున్నామనా, నను సత్య ఆవహించింది?
సత్యాపతి! నను మీరకని పలికించింది?

ఒకరికొకరం వరాలమనుకున్నామనా,
అసలు ఎవరికెవరం అని మీమాంస కలిగింది?
విధికి నన్ను వదిలి నీ విధులకు నీవు తరలిపోయింది?

ధీరోదాత్తనై నిను వరిస్తా అన్నావనా,
అభిసారికనై నీకై నిరీక్షిస్తానన్న నేను,
ఖండితనై నా ప్రాంగణం నుండి నిను వెలివేసింది?

ఆనందం అతిధి, మనకు బాధ సహచరి తలంచామనా,
అతిథివోలే నిష్క్రమించి ఆనందానికి నను పరాయిని చేసావు?
బాధ మాత్రం నా చితిలోనూ సహగమనం చేసిందందుకేనా?

అసలీ ఉపమానాలు, ఉత్కర్షలు, తలంపులు లేని లోకం వెదుక్కుందామా?
నన్ను నీకు, నిన్ను నాకు పెనవేసి వుంచే బంధం వేసుకుందామా?
మనకు, మనలోకానికి, ఆ బంధానికీ ఒకటే పేరు పెడదామా "ప్రేమ" అని?

13 comments:

  1. కొంచెం ఏదో మిస్ అయ్యింది .. bavundi mee varnana

    ReplyDelete
  2. మీ వర్ణన చాలా బాగుంది nice post andi

    ReplyDelete
  3. హరే కృష్ణ, ఆ వెలితి ఎదో మీరు చెప్పక వ్యాఖ్యలో కూడా ఏదో మిస్స్ అయింది కాదూ? కాస్త వివరించరూ? నిజానికి కవిత మరెందరికో మాదిరే ఒక ధారగా చాలా తక్కువ సమయంలో వెలికి వస్తుంది మనసు నుండి. ఆ భావావేశం నెమ్మదించగానే నాకే అయోమయంగా వుంటుంది ఇంకేమి కలపాలి అన్న విషయమై. ఇక ఏ పదమూ తీసివేయటమన్నది ఎపుడూ లేదు, ఆ పదాలు జాలువారిన చోటనే నిలిచిపోతాయి. ఈ మధ్యనే ఒకరి సద్విమర్శని స్వీకరించి, ఆ ప్రయత్నం చేసాను.

    వతనుగా వ్యాఖ్య పెడుతున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. శ్రీ, నా మరువపు వనాన మీది తొలి వ్యాఖ్య, మీ చిరుజల్లువంటి ప్రశంసకి ధన్యవాదాలు. నా బ్లాగుకి రావటం కూడా మొదటిసారి అయితే సాదర స్వాగతం. మళ్ళీ రండి, అమ్మ పోకడలు కూడా మరువం చిమ్మే సువాసనల్లో ఒకటి! అవి మీ అమ్మ కథలంత కమ్మగా వుంటాయి. హ హ హ్హా, తెలిసిపోయిందా, మరి నా కవితలు నా మానస పుత్రికలు కదా, అలాగే చెప్తాను, వాటి [గొప్పదనం ;) 0గురించి. ఎంతైనా "అమ్మని" కదా!

    ReplyDelete
  5. ధన్యవాదాలు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంట్టున్నాను ఉష గారు.ఎప్పటికీ అమ్మతోనే కధా బిడ్డ వుండేది మీ అనబడే మన బ్లాగును చూస్తేనే ఎంతో సంతోషం ఆకు పచ్చగా నిజంగా మరువం..really u r great అమ్మా...

    ReplyDelete
  6. ఇది వ్యాఖ్య కాదు, మీ కవితకు వేరే అర్ధాన్ని చూపే యత్నం

    రాధామాధవీయం మన ప్రణయం
    అని అనుకుంటేనేమి, నిను ఆవహించిన సత్య
    నను రక్షించింది, నా తనువును కాపాడి నను సత్యాపతి చేసింది

    ఒకరికొకరం వరాలమే, ఎవరు ముందంటే ఏమి చెప్పను
    వృత్తమార్గంలో ఏది ముందన్న నీ మీమాంసను ఎలా తీర్చను

    ధీరోదాత్తనై నిను వరిస్తా అన్నాను,
    అభిసారికవై కనిపించే నీ కోసం.
    ఖడ్గానికి పొదిగిన వజ్రానివి నీవు

    ఆనందం అతిధి, మనకు బాధ సహచరి,
    అందుకే అతిథిగా నిష్క్రమిస్తున్న ఆనందాన్ని మన లోగిలిలో
    నిలిపేందుకే విరహపు బాధను మోస్తూ ఆనందాన్ని వెతుకుతూ వెళ్ళాను,
    నీవు నాలోనే ఉన్నందుకేమో ఆ బాధ నిను చేరింది

    అసలీ ఉపమానాలు, ఉత్కర్షలు, తలంపులు లేని లోకం వెదుక్కుందామా?
    నన్ను నీకు, నిన్ను నాకు పెనవేసి వుంచే బంధం వేసుకుందామా?
    మనకు, మనలోకానికి, ఆ బంధానికీ ఒకటే పేరు పెడదామా "ప్రేమ" అని?

    (సగం నీళ్ళున్న గ్లాసు, సగం ఖాళీ కాదు సగం నిండి ఉందని చూపే యత్నం. ఏమీ లేదు మీ కవితల్లో ఎక్కువ విషాధాలు, ప్రకృతి వర్ణనలు లేదా భక్తి రసాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉగాది పచ్చడిలా మిగిలిన భావాల కవితలు కూడా మీ నుండి చూడాలని ఆశిస్తున్నా)

    ReplyDelete
  7. ప్రదీప్, మీ మరో ప్రయతనం ఆలోచింపచేసేదిగావుంది. నాదీ అదే ప్రయత్నం. చీకటి, ఓటమి, బాధల్లో మిగిలిపోవాలనో, ముగిసిపోవాలనో ఎవరం అనుకోము కదా, నాది సగం నిండినదాన్ని చూసి ఆగిపోయే మనస్తత్వం కాకున్నా అది అసంతృప్తికి మూలంగా చెయ్యను. ఇంకొంచం సాధించాలి, దానికి ఈ నిండిన సగం స్ఫూర్తి అనుకుంటాను. ఇక విషాదం నాకు స్పందనకి త్వరగా అందే భావన. ప్రకృతి నన్ను కదిలించే శక్తి, ఆధ్యత్మికత నా రెండో పార్శ్వం. అవన్ని కలగలుపే నేను. మిగిలిన నవ రసాలు త్వరలో పరావర్తిస్తాయిక్కడ. ఆ సమయం ఎపుడన్నది కవితదేవికి, మరువానికే తెలుసు మరి ;)

    ReplyDelete
  8. ఆ సమయమెప్పుడో కొంచెం ఉప్పందించరాదూ...

    ReplyDelete
  9. సరే తప్పక, ఏ రసం కావాలో అదీ తమరే సెలవీయండి కవితా నవరస పోషక హృదయ మిత్రమా, అపుడు ఇటునుండి ఉప్పు వస్తుంది, అటు ప్రక్క మీరు కూడా మీ విమర్శల కారాలు, మిరియాలు నూరి వుంచవచ్చు... అమ్మో ఎంత run on sentence అయిందో ;)

    ReplyDelete
  10. తూచ్.... మీ భావావేశం దేన్ని వెలికితీస్తే దాన్నే కవితగా చూపండి

    ReplyDelete
  11. బాగుందండి, మొత్తానికి మీరలా వెనక్కిమళ్ళి, నన్నొక గిల్లికజ్జాల చీలి రాకాసిలా చిత్రీకరించారు :) కాదేదీ కవితకనర్హమని టిష్యు డబ్బా మీదో, కుర్చీ మీదో వ్రాద్దామంటే పదాలు దుర్భమౌతున్నాయి మరి... jokes apart, I will take your comment as constructive criticism and work on it, Pradiip. Thanks again!

    ReplyDelete
  12. >> నన్నొక గిల్లికజ్జాల చీలి రాకాసిలా చిత్రీకరించారు
    నా దృష్టిలో కాలం కూడా రాకాసే మరి. jokes apart, thanks for your positive reply.
    By the way, you discovered a new spelling for my name. (Till now I know "Pradeep" or "Pradip")

    ReplyDelete
  13. మీ పేరుకి క్రొత్త స్పెల్లింగు కనిపెట్టటానికి కారణం ఈ బ్లాగింగే . లేఖిని వంటి భాషోపకరణాల్లో రోమనైజ్డ్ తెలుగు వ్రాసి వ్రాసి అలవాటులో పొరపాటుగా అలా జరిగిపోయింది. మన్నించండి. నిజ జీవితానుభవం గుర్తుకొస్తుంది. మా స్నేహితుల పాప ఎక్కువగా తెంగ్లీషు లో మాట్లాడేది, అంటే తెలుగు వచ్చీ రాని రకం. మావాడు స్కూలుకెందుకు రాలేదు అని అడిగినపుడు యధాలాపంగా "ఆ వూరికే ఎగ్గొట్టాడు" అన్నాను. అపుడపుడూ తెలుగు సినిమాల్లో కాలేజీల్లో గుడ్లు, టమాటాలు విసిరే సన్నివేశాలు గుర్తుకొచ్చాయేమో మరి, ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని అడిగిందట 'వాడు స్కూల్లో గుడ్లు ఎందుకు పగలగొట్టాడు" అని. అంటే "ఎగ్ + కొట్టి == ఎగ్గొట్టి" అని తనకి అర్థం అయిందన్నమాట. పోగా పోగా నాకు కూడా ఆ అయోమయం స్థాయి వచ్చేస్తుందేమో, ఇలా ఇంగ్లీషు, తెలుగు, తెంగ్లీషు వాడి వాడి ఎపుడు ఏమి మాట్లాడుతున్నానో, వ్రాస్తున్నానో మరిచిపోతానేమో. ;)

    ReplyDelete