తల ఒకటి, తలా ఒకటి!

తల ఒకటా, ఆ తలకి పట్టిన తిప్పలే నూటొకటి.
తలతిక్క అన్నవాడిని తన్నానని తలకి బొప్పి.
తలనెప్పి తెస్తున్నానని తిరిగి తలవాచేట్టు చీవాట్లు.
తలబిరుసు ఎక్కువని తలా ఒక మాట.

తలవంచు అని ఒకరు, తలదించు అని మరొకరు,
తలలోని యోచన తర్కమంటే తగదండి తమకు!
కనుక నా తల వెతలు తలవటమే ఓ తప్పు.
తలెత్తుకు తిరిగినందుకు మాత్రం నాకన్నీ ఒప్పు.

2 comments:

  1. మీరు చెప్పాలనుకున్న భావం, తలలోని ఆలోచనల గురించి.. వాటికి ఎదురయ్యే సవాళ్ళ గురించే కదా ?
    కవితలో పాదాలు సరిపోవడం లేదు ఆ భావాన్ని పూర్తిగా అందచేయటానికి.
    పద్యాల మీదేమైనా పడ్డారా?
    మొదటి పేరా మొత్తం యతి ప్రాస ఉంది. నేను చంధస్సు చూడలేదనుకోండీ.

    ReplyDelete
  2. మొదటి ప్రశ్నకి సమాధానం - అవును. ఎంత వ్రాసినా ఆ ఒక్క మాటే ("తలెత్తుకు తిరిగినందుకు మాత్రం నాకన్నీ ఒప్పు") కదా చెప్పాలనుకున్నది అని క్లుప్తంగా ముగించాను.

    "పద్యాల మీదేమైనా పడ్డారా?" అంటారా, పడదామని అడుగులు వేస్తున్నాను. అది నిలకడగా ఎపుడు మారేనో మరి? ఇక యతి ప్రాస, చంధస్సు చూడలేదండి. అలా వర్క్ నుంచి వస్తూ అలవోకగా మెదిలిన పదాలు ఇక్కడ పెట్టి చూద్దాం, "ఇదేమి తల పొగరు, ఇది కవితగా వ్రాయను" అని ఎవరైనా అనక పోతారా అని ఓ రాయి వేసా. ;) నా తలకి ఈ ఆలోచన వచ్చినందుకు ఓ సవాల్ అన్నా రావాలి మరి [నా స్వానుభవాన్ననుసరించి].

    ధన్యవాదాలు, ప్రదీప్. చక్కని ప్రశ్నలు వేసారు.

    ReplyDelete