ముందే తెలిసిన ముగింపు!

అవును నువ్వు నా కోసమే వచ్చేస్తావు.
వాస్తవంగా నా ఎదుటికొచ్చి నిలబడతావు.
వూహల్నించి వూసుల్లోకి దూకేస్తాను.
ఏకాంతాన్ని సెలవుతీసుకోమని సాగనంపుతాను.

వెన్నెల్లో వేచానని వేయిమార్లు చెప్పేస్తాను.
వేకువల్లో వగచానని వెక్కిళ్ళతో తెలిపేస్తాను.
వెక్కిరింతగా నువ్వు నవ్వేస్తావని ముందే గిల్లేస్తాను.
వెనకెనకనక్కి నా కళ్ళు మూస్తావని వున్నచోటే నిలబడిపోతాను.

మనం విడిచి వచ్చిన బాల్యం, ఓమారు వెనక్కి తెచ్చుకుంటాము.
మనల్ని వీడి వెళ్ళిన యవ్వనం, పలుమార్లు గుర్తు చేసుకుంటాము.
చేతిలో చేయి వేసుకుని కలిసేవుందామని, నిదురలో కలకంటాము.
అవునూ, పాతకథే తిరిగి ఎన్ని వైనాలుగా కవితలల్లుకుంటాము?

మనవి: దీనితో పాటుగా ముందు రెండు కవితలు కలుపుకుని, ఈ మూడు నా స్వానుభవం నుండి వ్రాసుకున్నవి. విడదీసికాక కలిపి చదివితే, ఏ కనులకైనా ప్రేమ, ఎడబాటు, కలయికల్లోని అలౌకికానుభూతి గోచరిస్తుందని నా అభిప్రాయం.

8 comments:

  1. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటి చెబ్తారు " Marriage shall never depend on lust ". ఈ కవిత ఆఖరి పేరా చదివితే అది గుర్తుకు వచ్చింది.
    ఇక మొదటి పేరా చదివేప్పుడు నేను రాసిన ఒక విషాద కవిత గుర్తుకు వచ్చింది.
    " ఆమె కళ్ళు అతని రాకకై ఎదురు చూస్తున్నాయి....
    అతని రాకను చూసి ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి
    ఆమె ఇన్నాళ్ళు గడిపిన యుగాలకు నేటితో యుగాంతం

    అతను వచ్చాడు ఆమె దగ్గరగా, ఆమెను చూడలేదు
    చిరునవ్వుతో కూడా పలకరించలేదు
    అతని కళ్ళలో ఆమె కోసమై ఎదురుచూపులు లేవు

    ఆమె ఎదురు చూసిన యుగాంతం వచ్చింది, కానీ తను ఎదురు చూసినట్టు కాదు
    ఆమె గుండె లోతుల్లో బడబాగ్నులు రగులుతుండగా నిష్క్రమించింది మౌనంగా
    ఆమె ఎదురు చూసిన యుగాంతం ప్రళయానికి నాంది అయ్యింది
    ఆమె హృదయం ఇప్పుడు ఒంటరితనానికి బందీ "
    (విషాద కవిత అని ఎందుకన్నానంటే ఇది విషాదంలోంచి పుట్టింది కనుక)
    ---
    ఇక చివరగా...
    ఏమిటబ్బా సరళమైన పదాలతో కవితలల్లడం మొదలుపెట్టారు.ఇలా సరళమైన పదాలతో కవిత రాస్తే విమర్శించడానికేమీ మిగలదు నాకు. (సరదాకే లెండి... :) )

    ReplyDelete
  2. ఉషగారు మీ కవితలు చదువుతుంటే...
    ఆకాశమా(కవితలు) నీవెక్కడ!
    అవనిపై(నా పిచ్చి రాతలు)నున్నా నిక్కడ!
    అనిపిస్తుంది...

    ReplyDelete
  3. ప్రదీప్, మీ నాన్నగారు చెప్పింది ప్రేమకి కూడా వర్తిస్తుంది. ప్రేమ,పెళ్ళిలో శారీరకానుభవం ఒక చిన్న భాగం అంతే. It's a small part in that whole equation and perhaps the ultimate state in a relation.

    ఎన్నోసార్లు నిద్రలో తృళ్ళీపడి లేచే నా కల మీ విషాద కవితలో వర్ణించినదే. యుగాల తరబడి జగమంతా గాలించిన నా మనిషి జాడ తెలియక దిక్కుతోచక పిచ్చిదాన్నైనట్లుగా ఆరాటపడతాను.

    మనసు తేటగావున్నపుడు అలా సరళంగా ఒలుకుతాయి భావాలు ;) మీరు విమర్శించటానికి ఇంకా వేల తరుణాలున్నాయిలే మిత్రమా!

    ReplyDelete
  4. పద్మార్పిత, మీకవితల అందం ఇక్కడ కూడా మీ వ్యఖ్యలో ఒలికించారు. మీ నమ్రతని అంతే సవినయంగా స్వీకరిస్తున్నాను. మరొకరు చదివారన్న తృప్తికూడా ఒక్కోసారి అవసరం, మరీ ఇటువంటి ఒంటరి ఘడియల్లో.

    ReplyDelete
  5. మనం విడిచి వచ్చిన బాల్యం,
    మనల్ని వీడి వెళ్ళిన యవ్వనం...
    తిరిగిరాని వీటిని కలలుగా తెచ్చుకుందాం !
    ఎంత బాగా రాశారు ఉషాగారు ! మీరు ...మీరే !

    ReplyDelete
  6. పరిమళం, మీ అభిమానానికి ముగ్ధురాలనైయ్యాను. నాది చాలా చిరు కవిత, కానీ మీరు దాన్ని అందుకున్న వైనందే ఆ గొప్పదనం.

    ReplyDelete
  7. ఈ పాతకథే తిరిగి ఎన్ని వైనాలుగా కవితలల్లుకుంటాము?
    manasu maatalani baaga chepparu..!

    ReplyDelete
  8. మాటలు నేర్చింది, నేర్పిందీ, అపుడపుడూ మరిచేది, మౌనంతో చంపేదీ ఆ మనసే. అసలామనసే లేకుంటే ఎంత బాగా వ్రాసినా మీకు అర్థం కాదు కదా, కనుక మీ మనసుకి జోహార్లు. నెనర్లు, సుజ్జీ.

    ReplyDelete