జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ



ఆత్మబంధువు, చిత్రకారులు శ్రీ విజయమోహన్ గారికి కృతజ్ఞతలతో.. ఈ చిత్రం ఆయన అనుమతితో తన బ్లాగు నుంచి ఈ లింక్ ద్వారాగా సంగ్రహించటమైనది.

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ ఈ మూడునాళ్ళే ఈ జీవయాత్రలో

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

[ఈ పాటని గూర్చి ఒకమాట చెప్పాలి - “సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?” అని ప్రశ్నించే వారికి సమాధానంగా "ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!" అంటూన్న ఫణీంద్ర గారి బ్లాగు, "తెర చాటు చందమామ" లో వివరణ చూడండి


వేటూరి వారికి అశ్రునివాళి ఘటించటానికి నాకున్న అర్హత ఆయన మాటల్లోనే “పాట నాకు ప్రాణం.. పాట లేనిదే నేను లేను”. వేటూరి అస్తమయం - నిన్న రాత్రి జెమిని టీవీ లో రాత్రి పదిన్నరకి ఈ వార్త వచ్చే సమయానికి నేను ఆ గదిలోకి రావటం ఒకసారే జరిగాయి, ఒక్క క్షణం నిస్త్రాణ. మరు నిమిషం ధ్యానించుకున్నాను.

సుళ్ళు తిరుగుతున్నట్లు బాధ. ఇది చాలదు ఇంకా ఏదో చేయాలి, తెలియని ధ్వని చెవులకి వినపడకుండా గుండెని బద్దలుచేస్తూ. ఇలాగే ఉండివుంటాడనిపించిన సన్నిహితునికి ఈ-లేఖ రాసాను. నిమిషాల్లో అటునుంచి వినపడిన ప్రతి ధ్వని మళ్ళీ నా గుండెల్లో మారుమ్రోగుతూ .."నిశ్శబ్దం గా వుంది అంతా. కన్నీరొచ్చేంత, గుక్క పట్టి ఏడ్చేంత బాధ అయినా బాగుండేది కదా అనిపిస్తుంది... మృత్యువు తేలుస్తుంది మన దైనందిన జీవితంలో ఏ ప్రాధాన్యతల విలువ ఎంతో. అంతకన్నా గొప్ప గీటురాయి లేదు." ఇలా ఎన్ని గుండెల్లో ఈ వేదన మారు మ్రోగుతుందో..


అంతా
అందరు చెప్పే ఉంటారు. ఆ టీవీ వార్త తప్పా ఇంకేమీ చూడకపోయినా కొంత వరకు ఊహించగలను. అందుకే నా మనసులో ఉన్నవరకు మీ ఎదుట పరుస్తూ..
ఈ మధ్య మూడు సార్లు వేటూరి గారు కళ్ళెదుటకో/తలపుల్లోకి వచ్చారు..

ఒక
మిత్రుని ఈ-లేఖ ద్వారాగా

ఓసారి
ఎవరో ఆయన్ని మీరు రెండర్థాల పాటలెందుకు రాస్తారు అంటే, ఆయన సమాధానం -
"చందమామలో మచ్చని మెచ్చని సచ్చినోళ్ళదా సరసత? వేపపువ్వులో తీపిని వెదికే తేనెటీగదే రసికత."

అనుకోకుండా ఒక రోజు - చేతిలో ఉన్న పుస్తకం మీద నుంచి టీవీలో వస్తున్న ప్రోగ్రాం మీదకి దృష్టి/చెవి నిలిపించిన దృశ్యం - వేటూరి గారి చిరు ప్రసంగం. ఆయనకి ఏదో అవార్డ్ ఇచ్చినట్లున్నారు. ప్రక్కన దాసరి గారు. "అయ్యో! ఈ మనిషేమిటి ఇంతలా పాడయిపోయారు. తెలియని దీనత్వం, నిర్లిప్తత [నాకలా అనిపించింది]
కళ్ళలో కొట్టొచ్చినట్లు కనపడుతూ.." అనుకున్నాను.

అలాగే ఈ మధ్యన దాదాపు రోజూ చూస్తున్న ఒకరి బ్లాగులో ఉటంకించిన వేటూరి గారి పాట లోని పదాలు పరిచితం గా ఉన్నా వెంటనే జ్ఞప్తికి రాలేదు. కనుక గుర్తుకు వచ్చిన ప్రతిసారీ ఇది కావచ్చునేమో అనుకున్న పాట పాడుకోవటం..కాదని తల వూపేసుకుని మరో పాట తట్టేవరకు వాయిదా వేయటం.


రకంగా రోజూ కాకపోయినా తరుచుగా తలుచున్నాను.

*******************************************

సిడ్నీలో ఉండగా యన్. టి. రామారావు
గారు చనిపోయినపుడు మర్నాటి ఉదయం జరిగే సంతాపసభకి నన్ను రమ్మనమని నాలుగు మాటలు చెప్పమని ఆ నిర్వాహకులు అడిగారు. అందరి పెద్దల సమక్షం లో ఆయన్ని గూర్చి నేను ఏమి చెప్పగలను అని సందేహం వ్యక్తపరిస్తే, నన్ను పిలిచిన వ్యక్తి ఒకమాట చెప్పారు "ఉష, ఇది ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా కాదు. ఒక కళాకారునిగా తెలుగు సినీ రంగానికి చూడామణిగా అంజలి ఘటిస్తున్న సభ. అందుకే కళల పట్ల అభిమానం కలిగి, తెలుగులో ఉచ్చారణ దోషం లేకుండా మాట్లాడగల నిన్ను అడుగుతున్నాము." అన్నారు.

ఆ రాత్రి కూర్చుని రాసుకున్న ఆ నాలుగు మాటల కి ముందు మాట ఈ శ్లోకమే. తిరిగి వేటూరి గారు కూడా అక్కడికే తరలిపోయారు అనుకోగానే తోచింది. జననానికి, మరణానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇది అందరికీను. కానీ కళాకారులకి స్థలకాల పరిధులు లేవు, జరామరణాలు ఉండవు. దేహాంతమే కానీ వారి జ్ఞాపకాలు చిరంజీవులు. "ఏ పాట నే పాడను, బతుకే పాటైన.." అన్న ఆయన పదాల్నే అరువడిగి నాకు తెలిసిన ఆయన పాటలన్నీ మాలగాచేసి ఆయనకి సమర్పించటం తప్పా
.

ఎందుకో
ఎప్పుడూ ఆ ప్రక్కగా వెళ్ళినా లోనికి వెళ్ళలేదు. ఇవాళ ఈ శ్మశానంలో కాసేపు గడిపి వచ్చాను. ఎందరివో సమాధులు, అయినవారి వేదనలు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నారేమో వారంతా. ఈ సమాధి చూడగానే ఫొటో తీయాలనిపించింది. ఆ పూల వనంలో ఎన్ని ఆత్మలో...


వేటూరి అంతే ... పాటల పూల పరిమళాల్లో తేలి వస్తూనే ఉంటారు. సమాధి కాని పదాలు ఆయనని సజీవులుగా ఉంచుతూనే ఉంటాయి. నారుమళ్ళలో పైరగాలి తాకిడిలా ఆయన పాటలకి అద్దిన స్వర రచనలు మరెన్నో గొంతుల్లో సానపెట్టబడుతూనే ఉంటాయి, మరిన్ని చెవుల్లో రింగుమని మ్రోగుతూనే ఉంటాయి.

వేటూరి వారు మరే సీమలనో తన పాటలతో తరింపచేయటానికి వెళ్ళుంటారు. చివరి కోరికా చెప్పి తీర్పించుకుంటూ ఉండి ఉంటారు కానీ నాకు మాత్రం ఆయన్ని పరిచయం చేసిన పాటలతో నాతోనే ఉంటారు. నా నోట పలికే తన పాటల్లో వసిస్తుంటారు నా శ్వాస తుదవరకు.


ఏమిటో మళ్ళీ ఇదెవరి గొంతు? మనస్సాక్షిదా "
అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం కాదా? ఈ బ్రతుకు బండి లాగడానికి తప్పదుగా. ఇంకా ఎన్నో చేస్తాం, పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి, పైవాడికో పక్కవాడికో అంటగట్టాలనే వృధా ప్రయాస. నిష్టూరాలకి దొరక్కుండా పారిపోవాలన్న విఫల ప్రయత్నం.

చాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో, ఇంక వెనక్కి రామని వదిలి వెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది." అయినా
కొన్నిసార్లైనా మనస్సాక్షిని ఎదిరించి నిలవగలుగుతాం.

వస్తూనే ఉంటుంది మరణం అనుకోని సమయాన..పునరావృతం చేస్తూనే ఈ సంవేదనని..కానీ కొందరు మాత్రం మరణాన జీవిస్తుంటారు, అయినవారి, అభిమానించేవారి గుండె లయలో.

12 comments:

  1. అవును ఉష...మరణం తనువుకే పాటకూ కాదు ఆ పాట తో వూపిరి పోసుకునే భావానికి కాదు. ఆయన అమరజీవి.

    ReplyDelete
  2. అసలు నమ్మసక్యంగా లేని వార్త ఇది.. ఆయన పాటలలో ఎప్పుడు బ్రతికే ఉంటారు..

    ReplyDelete
  3. ఎన్ టి ఆర్ మరియు వేటూరిగారు ఇద్దరూ మా ఊరి దగ్గర వారని చెప్పుకుని గర్వించేవారిలో నేను ముందుంటాను,ఆయన లేని లోటు తీర్చలేనిది.

    ReplyDelete
  4. "కానీ నాకు మాత్రం ఆయన్ని పరిచయం చేసిన పాటలతో నాతోనే ఉంటారు" చాలా బాగా చెప్పారు. వార్త విన్న వెంటనే చెప్పలేనంత ఆవేదన, దిగులు ముసురుకున్నాయ్ ఏ పనీ చేయబుద్దికాలేదు, కానీ మరో రెండు గంటల్లో అందుకోవలసిన బస్సు కర్తవ్యాన్ని బోధపరిస్తే కదలక తప్పలేదు, ఆపై అంతా మామూలే... ఏమిటో ఎండకీ వానకీ వెరవని శిలలా మారుతున్నాను రోజు రోజుకీ అనిపిస్తుంది.

    ReplyDelete
  5. స్పందించిన మిత్రులకి కృతజ్ఞతలు. లౌకికపరంగా "అక్షర చక్రవర్తినైనా వీడదు సమవర్తి పాశం" మానసికంగా "లౌకిక భావనలకి/కొలతలకి అందనిదే అనిర్వచనీయమైన అనుబంధం." వేటూరి అది చాలామందితో తన పాట ద్వారాగా ఏర్పరుచుకున్నారు.

    ReplyDelete
  6. వార్త విన్నప్పటినుంచి"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" పాట అనుక్షణం గుర్తుకువస్తూ కన్నీళ్ళాగడంలేదు.

    ReplyDelete
  7. ఈ వ్యాఖ్య యెంచేతనో ఇక్కడకి రాలేదు - "
    Posted by చిలమకూరు విజయమోహన్ to మరువం at May 24, 2010 11:31 AM"

    వార్త విన్నప్పటినుంచి"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" పాట అనుక్షణం గుర్తుకువస్తూ కన్నీళ్ళాగడంలేదు.

    ReplyDelete
  8. నీహారిక, వారిరువురికీ మరో బంధం కూడా ఉంది. జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించిన వేటూరి ఎన్‌.టి.రామారావు గారి కోరిక మేరకు తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించారు. వేటూరి గారు కూడా తన ఊరు, కళ్ళేపల్లిని గూర్చి చెప్పటం ఆయనతో ఒక ఇంటర్వ్యూ ప్రచురిస్తే చదివాను.

    సిరికా కొలను చిన్నది – వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కిన శ్రీకాకుళం. ఈ నాటికని పొడిగించి సినిమాగా తీయాలనుకున్న ఎన్‌.టి.రామారావు గారి కోరిక తీరలేదు.

    వేటూరిగారు పలుమార్లు రామారావు గారు, విశ్వనాథ్, ఇళయరాజా గార్ల పట్ల తన కృతజ్ఞత వెలిబుచ్చారు.

    అలాగే ఇద్దరివీ ఒక్కో వేదనలో ముగిసిపోయాయి జీవితాలు. వేటూరి గారి చివరిదశ అంత ఘనమైనది కాదుగా. కానీ, నా వరకు ఆయన స్థానం పదిలం. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆయన పాట నా నోటి వెంట పలుకుతూనే వుంటుంది.

    తెలుగు పాటకి ఆయన చేసిన సేవ నాకు ఎప్పటికీ గర్వకారణమే.

    విజయమోహన్ గారు, ఇందరి అభిమానం చూరగొనటం కన్నా ఆయనకి భాగ్యమేముందండి. ఇన్ని హృదయాల్లో నెలవుండే పాటలకి తండ్రి ఆయన.

    ReplyDelete
  9. శ్రీకాకుళం మాఊరేనండీ,వేటూరి గారికి చాలా ఇష్టమైన ఊరు,అక్కడే కృష్ణాతీరాన ఒక పర్ణశాల కట్టుకుని ఉండాలని ఆయన ఎంతో ఆశపడేవారు.

    ReplyDelete
  10. Phanindra K.S.M విన్నవారు చాలామందే ఉండి ఉంటారు.

    ప్ర: “సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?”

    జ: ఇక్కడ పాటలో సంగీతం కంటే సాహిత్యానికే అగ్రతాంబూలం. అంటే tune, music తీసేసినా నిలబడగలిగే ఉత్తమ సాహిత్యమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!

    వేటూరి గారిని గూర్చి అలా చదువుతూ మరి పదిమందితో పంచుకోవాల్సిన బ్లాగుని ఇవాళ కనుక్కున్నాను.

    అందుకే వేటూరి పాట “ఆలోచనామృతం” అంటూ ఈ పాటకి ఇచ్చిన వివరణ [బ్లాగరి ఫణీంద్ర గారి అనుమతితో] ఈ నివాళిమాలలో కలుపుతున్నాను.

    సమయాభవం ఉన్నవారు ఇప్పటికి ఈ లింక్స్ చూడండి..

    దేహం తిరి వెలుగన్నది చెలిమే - http://manikya.wordpress.com/2009/08/08/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B9%E0%B0%82-%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF/

    దేవతలా నిను చూస్తున్నా - http://manikya.wordpress.com/2007/02/17/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE/

    Melting Winter: http://manikya.wordpress.com/2006/11/01/melting-winter/

    *****************************
    ఫణీంద్ర గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  11. at last God has released him form the commercial- cinema-bonds.. . hope he reborned some where with new poetry

    ReplyDelete
  12. సత్య గారు, వేటూరి గారు తెలుగు సినిమా సాహిత్యాన్ని ఎంతో పైకి తీసుకెళ్ళారు. నా తర్వాతి టపాలో ఉన్న రెండు లింక్స్ [తాడేపల్లి, తనికెళ్ళ భరణి గార్లవి] ఇంకాస్త వివరాలిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖండించే ప్రయత్నం కాదిది. నేను అనుకునేది చెప్తున్నాను.

    ReplyDelete