అప్పుడప్పుడు తన కోసం..

కలలో నేనులికిపడితే
కంటికెదురుగ తృళ్ళిపడ్డావు.
పొదివిపట్టిన ప్రేమతో
వేయిపులకలు రేపావు.
అండదండ నీవని ఆదమరిచాను..

వెన్నెల నవ్వటమంటే
పున్నమి మోమున పూచినట్లన్నావు.
గంధం మెరవటమంటే
మాటలు గుండె గోడని తట్టటమన్నావు.
అంతకన్నా అర్థాలు వద్దనుకున్నాను..

ఇంతవరకే చెప్పి మాయమయ్యావు
ఏ ఆలయాన నిను వెదకను?
అమ్మలు అక్కడేగా ఉంటారట..
వేదన ఘోషలు ఏ అరచేతి ఒడ్డుకి విసరను?
అపుడపుడు అలిగే మనసుని ఎవరికి అప్పచెప్పను?

ఆకు ఒడిలో పూమొగ్గ వెక్కిరించింది
అమ్మరెక్క చాటున పిల్ల కూత వెంటాడింది
నువ్వు లేని నాకు మల్లే నా పదాలూ అనాధలే,
కమ్ముకునే కవిత లేక ఉసూరంటున్నాయి.
అమ్మతనాన్ని వెదకటానికి తోడు కావాలనుంది.
**********************************
ఏ అమ్మని చూసినా తనే గుర్తుకొచ్చేది. ఇవాళ చంకలో పసిబిడ్డ, ఓ చేతిలో చెయ్యి వేసి నడిచే చిన్నారి, కాళ్ళకడ్దం పడుతూ మరో బుడతడు - ముగ్గురి నడుమా మూర్తీభవించిన ఓ అమ్మ హృదయాన్ని కు(క)దిపిన భావన. అమ్మని/అమ్మతనాన్ని ఎలా మరవను?

12 comments:

  1. అద్భుతంగా ఉంది కవిత. కదిలించారు.

    నువ్వు లేని నాకు మల్లే నా పదాలూ అనాధలే,
    కమ్ముకునే కవిత లేక ఉసూరంటున్నాయి.
    అమ్మతనాన్ని వెదకటానికి తోడు కావాలనుంది.

    అమ్మను గరించి చెప్పటమంటే మాటలు కాదు. మనకున్న పాండిత్యం,ప్రతిభ,ప్రఙ్ఞ ఓ మాటకు కూడా సరిరావు.
    అలాంటిది మనసుని కదిలించే కవిత రాశారు. అభినందనలు :)

    ReplyDelete
  2. "అపుడపుడు అలిగే మనసుని ఎవరికి అప్పచెప్పను?"
    xlnt

    ReplyDelete
  3. గంధం మెరవటమంటే
    మాటలు గుండె గోడని తట్టటమన్నావు.

    Except the above, I felt it is very nice and touching. BTW what the above two sentences mean??

    ReplyDelete
  4. ento baagaa chepparu ammatanam gurinchi.mikive naa dhanyavaadaalu

    ReplyDelete
  5. Anonymous గారు, మా గోదావరి ప్రాంతాల్లో వేసవిరోజుల్లో గంధం తీసి వంటికి లేపనంగా పూస్తారు, ఆ తాపాన్ని తగ్గించి చలువ చేస్తుందని. అలా తడారనీయకుండా పైపూతగా రాస్తుంటారు. ఇది పిల్లలకి ఎక్కువగా చేస్తారు. ఆ గంధం అలా పరిమళం తో పాటుగా మెరుస్తూ ఉంటుంది. ఆ పోలికగానే ఆ పంక్తులు, కొందరి మాటలు తపించే గుండెకి గంధపు పూతలు/మెరుపులూను. అవి జ్ఞాపకాలో/అలాపనలో కానీ తడారనీయవు. పదే పదే వేదనని పలుచన చేసి, సముదాయిస్తూ..

    వ్యాఖ్యానించిన అందరికీ నెనర్లు.

    ReplyDelete
  6. ఊషా, ఇది కవిత గొప్పతనమా లేక మాతృమూర్తి ఆశీర్వాదమా?

    ReplyDelete
  7. ఇక్కడొక ఆకు చాటు చివురు ను చూసి, అక్కోడక కొమ్మ చాటు పువ్వును కాంచి, జలాంభుంది చాటున దాగి మునకలేసి నవ్వే చేప పిల్ల ను చూసి అమ్మ రూపం, అమ్మ ప్రేమ, అవధులు లేని అమ్మ అనంతత్వం తోచినట్లు..... అక్కడా ఇక్కడా ఎక్కడ వెతికి అమ్మ కోసం అలసిన నా నేస్తమా నీలోకి నువ్వే చూసుకో అమ్మ లోని పరిపూర్ణత్వం అక్కడే ఉంచుకుని ఎక్కడో వెతుకుతావే.

    ReplyDelete
  8. అమ్మ, అమ్మతనం, అమ్మలాంటి చల్లనివారు నా సొంతానికి మిగిల్చినది ఈ భావనలు, మరే మెళకువలు ఎరుగని మనసుకి తెలిసినదీ వేదన మాత్రమే. అందరికీ నెనర్లు.

    ReplyDelete
  9. అభినందనలు వుషాజి,
    మీ కవిత చాల బాగుంది

    అమ్మగించిన భావన,
    చెమ్మగించిన
    డెందమందున,
    ఎగసిపడుతూ వేదన.
    నేటి బాల్యం
    రేపటి అమ్మతనం
    భావన వీక్షణలో
    వాస్తవం యిమిడివుంది

    ReplyDelete
  10. ఉష గారూ,
    కళ్ళనిండా నీళ్ళు నిండి, అక్షరాలు అల్లుక్కుపోయి.... ఏమి రాయాలో తెలియట్లేదు. మీ కవిత చదువుతున్నంతసేపూ, ప్రతి కన్నీటిచుక్కా ఓ కుంభాకార కటకమై, అంతటా అమ్మని ఆవిష్కరింప చేసాయి.

    ReplyDelete
  11. గిరీష్ గారు, మీ మనస్థితి తెలిసే మరింత భావోద్వేగానికి గురి చేస్తానేమోనన్న సంశయం పీడిస్తున్నా ఈ లింక్ ఇచ్చిన కారణం కాస్త దుఃఖాతిశయం కలిగినా తెలియని సాంత్వన అమ్మ సమక్షంలో దొరుకుతుందనే ఆశతోనే పంపాను. అమ్మ అన్నది భౌతికం కావచ్చు కానీ అమ్మతనం అమరం. అది వేర్వేరు రూపాల్లో పరామర్శిస్తూనే ఉంటుంది. అమ్మ పరిచయం చేసిన ఆ "తనం" వెదకాలే గానీ మనని వెచ్చగా తాకే ఉదయకిరణాన, చల్లగ తాకే పూరేకునా ఇలా అన్నిటా అగపడుతూనే ఉంటుంది. ప్రయత్నించి చూడండి. నిజానికి అమ్మతనం, నాన్నతనం లింగబేధం లేనివి. ఇంతకన్నా ఈ మాధ్యమంలో ఎక్కువగా చెప్పి దీనిమీద అది మోయలేని భారం మోపలేను. మనమూ ఆ "తనాన్ని" మన పిల్లలకి పంచుతున్నవారమేగా! కనుక ప్రకృతి ఆవిష్కరిమ్చే ప్రతి అమ్మతనాన్నీ కమ్మగా ఆస్వాదించండి. అమ్మని ఎల్లవేళాలా దర్శించి పులకరించండి.

    ReplyDelete