ఇక ఈ సచిత్ర కథనం నా నిజ జీవితానుభవమే అదీకాక హరికథ/బుర్రకథలననుకరిస్తూ పిట్టకథలూ వస్తాయి. కాస్త ఓపిగ్గా చదివితే కొత్తావకాయ ఘాటు / పాతావకాయ వూరిన ఊట తగుల్తాయి లేండి. మా నానమ్మ పెంపకం ప్రభావం ఎక్కువ నామీద. "పెద్ద కుండకి ఎసరు పెట్టి, పొత్తల్లే వండి, అన్నం వార్చటం, విస్తరాకంత దోశ పెనానికి అంటకుండా వేసి తీయటం" కాబోయే కోడలికి క్షాత్రపరీక్షలని ఆవిడ ఉవాచ. మరేమో శ్రీరమణ గారి "బంగారు మురుగు" లో బామ్మ గారు "అరటిదూట కూర చేయటం, పెద్ద పెద్ద ముగ్గులు వేయటం - పనితనానికి, ఓర్పు, ఓపికలకి మచ్చుక" లని నుడివారు. పదిహేనేళ్ళ క్రితం ఇవన్నీను, మరిప్పుడో..
అస్సలు దంతసిరి లేని పిల్లని నేను [మా మామ్మ దృష్టిలో], "కల్లో గంజో" అన్న లెవల్లో "పాలో మజ్జిగో" తాగి పెరిగేసానా..కాస్త ఎదిగాక ఆవకాయ, మాగాయ మొదలుకుని పులిహోర, ముద్దపప్పు..దారి పట్టాను. ఇదిగో ఈ పళ్ళెరం వంక కొన్ని వేలసార్లు వేవేల నిమిషాలు కళ్ళప్పగించి చూస్తూ కూర్చునేదాన్ని అందులోని ఇడ్లీలు, ఉప్మా ల వంక. అందుకే ఇదిగో నా భోషాణం పెట్టెలో దాచిన పళ్ళేంతో పాటుగా ఊర మిరపకాయలు వంటి ఊసులు.
ఇక్కడో మెలిక ఉంది. మా వదిన మాటలివి "నీకు నీసు పడదు, నువ్వు వచ్చినపుడు మా వంటింటి నాచు వాసన నాకు పడదు." :) ఆకుకూరలకి తన పర్యాయపదం - నాచు. పాపం అర్థమొగుణ్ణి కనుక రోజుకో ఆకుకూర ఇంగువ పోపు వేసి వండటం మానదు. అసలీ సమస్య ఏనాటిది.
అమ్మమ్మ గారు: "ఈ పిల్లదిలా తయారయిందేవిటీ, గుడ్డు కూడా ముట్టకపోతే ఎలా?" [నేనంటే కాసింత కోపం, బోలెడంత ప్రేమ]
మామ్మ/నానమ్మ: "పోనీలేద్దూ వదిన, అసలే పోతపాల పిల్ల" [ఈవిడే ఎన్నో సార్లు నాన్నగారి కూరుడు తిళ్ళ నుంచి నన్ను కాపాడిన దేవత]
అ: "అసలు దీనికి పెళ్ళెలా అవుతుంది?"
మా: "దానికి తగ్గవాడు పుట్టే ఉంటాడులే వదినా"
ఇక నా రంగ ప్రవేశం..
నే: "నేను పెళ్ళి చేసుకోను."
అ: "అన్నీ నీ ఇష్టమేనా, పల్లయ్య గారి మనవడికి కట్టబెడ్తా" [అతగాడు బకాసురుని మరుజన్మ]
నే: "ఊహు, నేను పూజారి గారబ్బాయిని చేసుకుంటా" [హతోస్మి, తర్వాతి అతి కొద్దికాలంలో ఈ కథ అమ్మమ్మ గారి ఊర్నించి నా నోటే మా ఊరు చేరి సత్యనారాయణ స్వామి గుడి లో తేలింది. కట్ చేస్తే, నా మొహం "స్వర్ణకమలం" లో సాక్షి రంగారావు, పూజారి గారబ్బాయి "శ్రీలక్ష్మి" ను :( ]
అ: "అప్పుడు గానీ మడి ..."
నే: "అయితే నేను నక్సలైట్ అయిపోతా"
అంతే దెబ్బకి అమ్మమ్మగారి నోరు మా నీళ్ళ గంగాళమంత తెరుచుకుపోయింది. [క్షమించండి అమ్మమ్మ, నిజాలు వెలుగు చూడాలిగా!] లేకపోతే పదమూడేళ్ల పిల్లని గదిలో పెట్టి పిల్లిని కొట్టినట్టు నిలదీస్తే ఈ రకం వాగుడేగా వచ్చేది.
ఇక రెండోసారి గట్టెక్కిన గండం:
"ఒకసారి ఇదేమిటీ ఈ పిల్లనిలా తయారుచేసావు, మన ఇళ్ళలో మాంసం తిననంటే కుదురుతుందా" అని ఎవరో ఆయన్ని అడిగారు. అంతే రొయ్యలు తెప్పించి ఇవాళ ఎలాగైనా తినిపిస్తాను అని కూర్చున్నారు. నేను కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అందరికీ తండ్రి అయిన ఆ దేముడు దగ్గర కూర్చుని "మా నాన్నని ఎక్కడికైనా తీసుకుపో, నన్నీ కష్టం నుండి బయటపడవేయ్" ప్రార్థించాను. అంతే ఆయనకి బాస్ నుండి కబురు, అర్జంట్ గా వెళ్ళాల్సిన కాంప్. దేముడున్నాడనీ నమ్మకం పెట్టేసుకున్నాను. ;)
మాంసాహారులు! శాపనార్థాలు పెట్టకండి. ఈ డప్పు హోరు నా కడగళ్ళు టముకు వేయటం మాత్రమే. నా శాఖాహార వ్రతం కొనసాగటానికి నాకెదురైన పరీక్షలు కడుపువిప్పి చెప్పటం. లైట్ తీస్కోండి.
చివరాఖరు కథకి ఇంకా సానా వెళ్ళాలి కానీ..పుట్టాక నేను వండిన మొదటి వంట ఇది.
ఒకసారి అంటే ఇంకా గరిటె తిప్పటం కూడా తెలియని, అవాలు అంటే ఏమిటి, పాలు పొంగించటం అంటే గిన్నె ఖాళీ అయ్యేదాకా మంట మీద వదలకూడదు, చింత పండు పులుసులో ఉప్పు కూడా వేయాలి అని తెలియని రోజుల్లో ఒకానొక వేసవి మధ్యాహ్నం, కొబ్బరి పాలు రుబ్బి తీయించి పాకం పట్టి ఓ వెఱ్ఱి తీపి ఘనపదార్దం చేసాను. రుచి చూట్టానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి, నా కళ్ళలో నీళ్ళు మాత్రం మున్ముందే ఉరికాయి. అపుడు నాన్న గారు, అన్నయ్య మాకివ్వరా ఉషడు అని తిన్నారు. పాపం ప్రేమ కారణంగా ఎంత భాదించబడ్డారో. నిజానికి నేను కూడా దాన్ని నోటపెట్టలేదు. సరాసరి కుడితి తొట్టిలోకి వెళ్ళిపోయిందది.
కుక్కర్లో అన్నం వండటం, మిక్సీలో దోశకి రుబ్బటం, అరటి పూవు, దూట వండితే తినేయటం, ముగ్గులు వేయటం - వచ్చేసాయి. నా ఇల్లు, వంట కూడాను - అలా బావిలో కప్పలా బతుకుతుండగా ఆస్ట్రేలియాకి లాక్కెళ్ళింది, ఇంకెవరూ జాతకం..ఎవరైనా కాస్త ప్లాన్ చేసుకు వెళ్తారు.. మాదంతా ఊదర, అనుకోవటం అక్కడకి వెళ్ళిపడటం అంతా ఆర్నెల్ల లోపే..ఏవెక్కడ దొరుకుతాయో తెలియదు. ఓ నాలుగు చిన్న సీసాల్లో తీసుకెళ్ళిన ఊరగాయలు, అ పది గిన్నెలు తప్ప వంట ఇంటి సామగ్రి, సరుకులు ఏమీ లేకుండా మళ్ళీ రెండోసారి పాలు పొంగించటం జరిగిపోయింది. చేతికింద పనికి సుబ్బాలు లేదు. ఇక చూడండి లెక్కకు అందనన్ని తిప్పలు.
*********************************************
80:20/60:40 గోలాయింపులు: సిడ్నీకి వెళ్ళిన పదిరోజులకి ఒకరు భోజనానికి పిలిచారు. ఆవిడ చేసిన పూరీలు నిజంగా నా నోము ఫలం. ఒక్కోటి ఒక్కో షేప్ - ఒకటి ఆస్ట్రేలియా మాప్, ఒకటి కొబ్బరి బోండాం ఎడపెడా చెక్కితే రాలిపడే ముక్కలా..ఇలా ఎంతొ వైవిధ్యం..పాపం ఆవిడే తర్వాత మరెన్నో విషయాలకి నాకు గుర్వాణి. అలా మొదటి పచారీ కొట్టుకి దారి తెలిసింది. కనీసం పూరీలు చేయొచ్చని ఫీజీ ఇండియన్ గ్రోసరీ షాప్ కి పరుగు. మొదటిసారి గోధుమ పిండిలో ఇలా మైదా/ప్లెయిన్ ఫ్లోర్ కలిపి ఆ పాళ్ళని బట్టి 80:20/60:40 అంటారని తెలిసింది. ఇంతలో ఓ రోజు మరొకరు వంట సాయం రమ్మన్నారు. పూరీలు గోలా/ళాయించమన్నారు. గుండెల్లో రాయి - ఉండలు గుండ్రం గా చేయాలా? పూరీలు గుండ్రంగా చేయాలా? అడిగితే ఏమనుకుంటారు? చివరికి తేలింది - ఏదో ఒక షేప్ లో చేసినవాటిని నూనెలో వేపటమే గోలాయించటం.
కళ్ళుప్పు/కళ్ళు ఉప్పు: పుట్టి బుద్దెరిగిన నాటి నుంచీ జాడిల్లో ఉప్పు వాడకం మా ఇంట, అదీ కళ్ళు ఉప్పు. కళ్ళు ఆల్చిప్పల్లా విప్పి వెదికినా దొరకలేదెక్కడాను. అసలే బెంగ. అమ్మకి ఫోన్ చేస్తే పూడిన గొంతు విప్పి ఏమీ అడగలేకపోయేదాన్ని ఉప్పు మాటతో సహా. కానీ చల్లారిన పాల రుచి ఉప్పగా తగిలినప్పుడల్లా ఎన్నో సార్లు అమ్మమ్మ గారి జాడీ కళ్ళ ముందు కదలాడేది. ఎలాగైతేనేం, కొన్నాళ్ళకి "సీ సాల్ట్" అన్నది పట్టాను.
డ్రం స్టిక్స్: ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రోజులు, ఓ రోజు ఒక కొట్టు మీద "డ్రం స్టిక్స్" అన్న బోర్డ్ చూసి "భోజనం తయార్" అన్న బోర్డ్ కరకరలాడే ఆకలి మీదున్న వాడికి కంటపడ్డట్టు తెగ సంబరం. రెండో ఆలోచన లేకుండా దూరాను. అది లెబనీస్ వారిది. ఎన్ని కావాలి అని అడిగాడు ఆ ఆసామి. "పప్పుచారుకి నాలుగు, రామములగ-ములక్కాయ పాలకూరకి ఐదు, బెల్లం పులుసుకి ఆరు" ఇలా లెక్కలేసి పదైదు అని చెప్పానా, అప్పుడు ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. "ఇదేవిటీ బోన్స్ తూకం వేస్తున్నాడు?" నాకు మరొక నిమిషంలో తెలిసింది. "డ్రం స్టిక్స్, లవ్లీ లెగ్స్" ఇవన్నీ కూడా అవేనని. :) ఇక పరుగో పరుగు.
ఇవండి ముచ్చటగా నా మూడు సిడ్నీ పచారి కొట్టు కథలు. పోగా పోగా శ్రీలంక తమిళుల వారి కొట్లు దొరికాయి. ఎంతగా అలవాటంటే శనివారం ఉదయాన్నే "ఫ్లెమింగ్టన్ మార్కెట్స్" కి వెళ్ళి తాజా కొబ్బరికోరు కోరించుకుని, లేదూ "మరూబ్రా" రకం మామిడి కాయలు తెచ్చుకుని మా ఊర్లో ఉన్న భోజనప్రియులకి వండి, వార్చి, వడ్డించి షడ్రుచులతో ఆతిధ్యం, తాంబూలం ఇచ్చేవారం. అదీ ఓ పిచ్చేనేమో!
మన వంటలు - బయటివారి గాధలు:
తెలిసినవారొకరు ఆఫీసుకి రవ్వలడ్డు పాకం పట్టి చేసుకెళ్ళారట. హడావుడిలో తను ఒక్కటీ తినలేదు. సరే టీ టైం కి నలుగురికీ పంచారట. ఏమిటి ఈ వంటకం అంటే, "సెమోలినా కోక్" అని చెప్పిన రెండు నిమిషాల్లో "ఈస్ దిస్ కేక్ ఆర్ రాక్?" అన్న ప్రశ్నకి జవాబిచ్చే ముందుగానే ముదురుపాకం తెచ్చిన తంటా అని తెలిసిందట.
ఇక నా కలీగ్ కారెన్ కి మన శెనగకారం చాలా ఇష్టం. కాకపోతే ఆ తినే విధానమే నాకు నిజంగా వికారం పుట్టించేది. మిగల ముగ్గిన అరటి పండు చక్రాల్లా కోసి, ఈ పొడి జల్లి తినేది. ఛీ యాక్ కదూ?
నా లంచ్ బాక్సుల్లో కాస్త పండు మిరప, టమాట ఊరగాయలు, అమ్మో బెల్లం ఆవకాయ, అల్లం పంచేంత ఉదారత నాకు ఈనాటికీ లేదు కనుక, రుచి చూసి హెల్ముట్ తెగ ఇదైపోయాడని కాస్త ఇచ్చాను. మర్నాడు ఆరడుగుల మనిషీ మూడడులకి వంగిపోయి వచ్చాడు. "ఏమా కథ?" అంటే బీర్ తాగుతూ, బీర్ నట్స్ [వేపిన వేరుశెనగ పప్పులు] తో పాటుగా ఓ ఐదారు పండుమిరప పచ్చడి స్పూన్లు లాగించాడట. మిగిలిన రాత్రి "బాతు" రూమ్లో "బల్లి" లా పాకి అలాగే ఆఫీసుకీ దేకివచ్చాడు....:) హ హ్హ హ్హా అర్థం చేసుకోరు.. నవ్వండి బాబులు/అమ్మలు. జాలిపడి కాస్త పెరుగన్నం తినిపించి, అసలు పాలు కాసి తోడు పెట్టటం కూడా నేర్పేసా. తను చేసిన పెరుగు మీద స్ట్రాబెర్రీలు పేర్చి గురు దక్షిణగా ఇవ్వటమే కాక, జర్మన్ వారి సాలాడ్స్, బ్రేక్ ఫాస్ట్ ఫూడ్స్ అవీ తెచ్చి ఇచ్చేవాడు. బార్టర్ సిస్టం మళ్ళీ అమల్లోకి తెచ్చామలా.
కాకపోతే "డు యు హావ్ అనీ అన్మారీడ్ సిస్టర్ విత్ యువర్ లుక్స్ అండ్ కుకింగ్ స్కిల్స్స్" అన్నాడని అంబశక్తిలా మీద పడి "హన్నన్నా నాకు బాబాయ్ వంటివాడివి.ఇలాంటి మాటలు తగునా?" అని కరిచానని, ఓ రోజు దూరదూరంగా తిరిగి మర్నాడు రాత్రి అంతా కూర్చుని నేను చేసిన కోడ్ డీబగ్ చేసి, ఓ చక్కని డి యల్ యల్ నాచేత రాయించిన ఘనత తనదే. సో, మళ్ళీ ఫ్రెండ్స్ - నేను అమెరికాకి తను హాంగ్ కాంగ్ కి వెళ్ళేవరకూను.
ఇక ఐవన్ బల్గేరియన్. పెద్దగా మన దేశం గురించే తెలియదు. పైగా ఆంగ్ల భాషా సమస్య. "మామ్" అనేవాడు వాళ్ళమ్మ తర్వాత పళ్ళెంలో వేసి తినబెట్టిన మరో అమ్మని నేనేనని ["ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు" గా] అనేవాడు. నాకు పాప పుట్టినపుడు వాళ్లమ్మగారి నడిగి తీపి పదార్థాలు అవీ తెచ్చి ఇచ్చాడు. తనకి మన పాలకూర పప్పులో, పిండి వడియాలు నంజుకు తినటం ప్రాణం. కాస్త కష్టమైనా గుత్తొంకాయ కూడా అప్పుడప్పుడూను. నేను వచ్చేసే ముందు ఇదిగో ఇలానే మా అమ్మకి వీడ్కోలు ఇచ్చి వస్తాను ఎప్పుడూను అని ఆప్యాయంగా హగ్ చేసి, కన్నీటితో కాండీ బాక్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా "హే మామ్" అని ఓ ఈ-లేఖ రాస్తాడు ఇప్పటికీను. ఎప్పట్లానే ఏడిపిస్తాను, పెద్ద కొడుక్కి బాధ్యత ఎక్కువరా అబ్బీ, అందునా నీకన్నా చిన్నది మీ అమ్మ కనుక నువ్వు పోయేదాకా నేనూ పోనని.
అందరికీ మాత్రం నేను చేసే వంటలు మలిపేసాను.
సరే అన్ని రోజులూ వండటం పడదుగా.
బయటి తిళ్ళు - మన గోడు:
మొదట అనుభవం - చైనీస్ రెస్టారెంట్ లో. అంతకు మునుపే మరొక మిత్రురాలికి జరిగినదిది. ఈవిడ పేరు వాసవి, ఆవిడ తో సంభాషణ జరిపిన వియత్నామీస్ స్త్రీ పేరు చంగ్. తెలుగులో రాస్తున్నాను.
వా: మేము మాంసాహారులం కనుక నాకు ఉషకి మల్లే పెద్ద ఇబ్బంది ఉండదు.
చం: ఓ ఏమేమి తింటారు
వా: చికెన్, ఫిష్
చం: ఓ అవి వెజ్
వా: ష్రిమ్ప్, గోట్
చం: చా అవేమి లెక్క
వా: మరి అసలు నీ లెక్కలోకి వచ్చేవేవి
చం: క్రోకోడైల్, టైగర్, కాంగరూ
వా: .... [నోటిమాట పడిపోయిందన్నమాట]
సో, వాసవి నాకు హెచ్చరికలు, ఎలా మాట్లాడాలో, ఏం అడగాలో చెప్పింది.
ఫ్లైడ్ లైస్ అంటే బెదిరిన రోజుల నుంచి బాగా ఎదిగి, ఇప్పుడు "నో మీట్, నో చికెన్ స్టాక్, నో యెమ్ యెస్ జి, ..." ఇలా సాగే నా మంత్రాలకి "మమ" అని లేదూ నాతో పాటు జపమంత్రం చదివి చేయగల ఒక్క ప్లేస్ కే వెళ్ళేదాన్ని అక్కడుండగా. ఇక్కడా ఒకరు దొరికారలా. ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ కాస్త స్నేహితురాలు కూడ. మొన్నా మధ్యన నా జీవితంలో కాస్త ప్రాధాన్యత ఉన్న రోజున ఇదిగో ఇలా గుడ్ లక్ అని ఒక డాలర్ నోట్ తో ఓరగామి చేసి ఇచ్చింది. అచ్చంగా మన బొట్టు పెట్టి పంపినట్లే.
ఇక శాఖాహార భోజనానికి మారే వారి సంఖ్య పెరగటం తో రాన్రాను నాకు ఇబ్బంది అనేది లేదసలు ఏ ప్లేస్ లో తిన్నా, ఏ కిచన్ కి వెళ్ళినా..ఎక్కడో ఒకటీ అరా తప్ప..పైగా అందరికీ తెలుసు నేను Ovo Lacto vegan [so eat egggs, dairy products and vegetarian] .. అని. :)
*************************************************************
ఇక నా వంటల విషయాలు: ఒక కారాలు, మిరియాలు కవితగా చెప్పేసా ఏనాడో :)
తొక్కుడులడ్డు/బందరు లడ్డు/సాదా లడ్డు సన్యాసం: అమ్మ ఆవలీలగా చేసేసేవోరు మనకెందుకు రాదని దిగానా..మరే దేవతల దీవెనో మొదటిసారే దిమ్మ దిరిగేంత రుచిగా వచ్చేసాయి - అవి పాతిక. ఆ ధీమాతో రెండోసారి ఆరింతలు చేయాలని నిచ్చెన వేసాను. నా వంటకి ముందు ఏర్పాట్లివి. హాయిగా మధ్యాహ్నం పడకేసి రాత్రి ఎనిమిది సుమార్లలో మొదలెడ్తాను పిండి వంటలు మాత్రం. సన్నగా పాటలు, మధ్యలో నృత్యం చేయ వీలగు దుస్తులు, వేడి పాలు ఇవన్నమాట. అలా అలా ఆ రాత్రి పన్నెండుకి జంతికలు వేపి తీసి, పిండి పట్టటం అయింది. కాసేపు కునుకు తీసి మళ్ళీ రెండుకి పాకం మొదలెట్టాను. పైన రవ్వలడ్డుకి ముదురు పాకం, మనకి లేత పాకం తెగులు పడ్తాయని ఒక్క బ్రహ్మకే తెలుసునేమో! రెండు తీగల పాకం వచ్చిందని మంట ఆర్పి, పిండి కలిపి, నెయ్యి పోసి, తిప్పి, పప్పు గుత్తితో కుమ్మి లడ్డూ చుట్టి కాసేపలా వత్తిగిల్లి లేచి వద్దును కదా, తొక్క తీసిన సపోటాల్లా మెత్తగా తగిలాయి. ఉసూరుమని అక్షరాల నూట ఇరవై లడ్లు ట్రాష్ చేసేసా. అది విన్న ఫ్రెండ్ "అయ్యో, పైన క్రష్డ్ నట్స్ పోసి లెంటిల్ పుడ్డింగ్" అని ఆఫీసులో ఇచ్చేయాల్సింది అన్నప్పుడూ గానీ తెలిసిరాలేదు పాపం మన చేతిలో వీళ్ళు ఇలాగూ బలవుతారని. :) ఏదేమైనా ఇప్పటికి మళ్ళీ చెయ్యలా.. చేసేవారితో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయి.
అందర్లానే ఏవో ప్రయోగాలు - బీట్ రూట్ ఆకు పప్పు, క్రాన్ బెరీ పచ్చడి, గ్రీన్ యాపిల్ ఊరగాయ, సెవెన్ కప్ స్వీట్ ఇవన్నీ కాదు గానీ, మొత్తానికి ఇక్కడికొచ్చి బతుకుతెరువు నేర్చుకున్నట్లే "బతికుంటే బలుసాకు" కూడా పట్టేసాం. ఇదిగో ఇదే. ఆకు, సగం పెసర, సగం శెనగ పప్పు కలిపి ఉడికించి తీసి, జీలకర్ర, మెంతి పిండి, కారం, ఉప్పు, చింతపండు, పచ్చిమర్చి వేసి ఉడికించి ఇంగువ పోపు వేసి తింటే దేవేంద్ర వైభోగమే.
ఇక వచ్చిపోయినప్పుడల్లా అక్కడి నుంచి రవాణా చేసేవి వంట పాత్రలే. నేను నాన్ స్టిక్ వాడను. అమ్మ వాడిన మూకుళ్ళు, పెనాలు ఇప్పుడు నా ఆస్తులు.
రోటి పచ్చళ్ళకి ఇదిగో నా ఉపకరణాలు. ఒకటి ఇందిరా పార్క్ దగ్గర నేను దాదాపుగా దగ్గరుండి చేయించుకున్న సనికెల్లు. నాతో ఇలా దేశాలు పట్టి తిరుగుతూను.
ఇక, ఇదేమిటీ ఈ సాన, గంధం చెక్కా అంటారా? అదే మన సౌందర్య రహస్యం. :) ఈ చెక్క నా పెళ్ళికి అమ్మవాళ్ళు కొన్నది. నా చితిలో వెయ్యాలి సాంప్రదాయం ప్రకారం అట, కానీ ఇదిగో నా కన్నా ముందే అరిగిపోతుంది. పగటి పూట వంటకి ఇలా గంధం, పసుపు, పాలు, తేనె కలిపి రాసి మరీ దిగుతాను వంటలోకి. లేదా వండే కూరగాయలు, తినే పళ్ళు పేస్ట్ అద్దేస్తా.. ఆ మధ్య బొబ్బాస కాయ సగం చెక్కలో ఫోర్క్ వేసి లాగిస్తూ, కొంచం మొహానికి కూడా అద్దేసా, ఈ రూపం సంగతి మర్చి పోయి కాలింగ్ బెల్కి బదులిచ్చానా? అవతలి మనిషి మొహమ్లో చూడాలి కంగారు. తర్వాత చెప్పాడు మీరు భలే ఇన్నోవేటివ్ గా చర్మ రక్షణ చేస్తున్నారల్లే ఉందే అని.
************************************************************
ఇక పోతే భావితరం/పిల్లకాయలు వచ్చేసారుగా వాళ్ళ పరిభాష చెప్తే హడలిపోతారేమో..
మూడేళ్ళ క్రితం ఎనిమిదేళ్ళైనా లేని నా బిడ్డీకి వంట పిచ్చి ఇప్పుడు నాకున్న స్థాయికి పైనే. కాకపోతే అది వాడే ఒవెన్ మాత్రం నా స్టవ్ కి క్రింద ఉంది. :) దాదాపుగా భీమ్లీ పేరు అది కొట్టేసి నన్ను వట్టి నళిని గా వదిలింది.
నమ్మనివారొకరిద్దరు మా ఇంటికి వచ్చి దాని ప్రజ్ఞాపాటవాలు చూసి వెళ్లారు - పూరీలు పిండి కలుపుకుని వేపే వరకూ అంతా తనే + ఇడ్లీలు చక్కగా వాయ వేసి తీసి పళ్ళాల్లో పెట్టటం, కూరగాయలు తరగటం గట్రా. కనుక అనుమానిస్తున్న చదువరులు ప్రయాణపు ఖర్చు పెట్టుకుంటే వసతి, భోజన సదుపాయాలు మేము కల్పించి మరీ పిల్ల ని పరీక్ష చేయనిస్తాము. నిజంగానే - అదొక అదృష్టం. అన్ని పనులూ వచ్చు - లాండ్రీ, ఇల్లు క్లీనింగ్, గ్రోసరీ షాపింగ్ ఇలా. ఒక విధంగా నాకు పెద్ద దిక్కు అదే. వెంటుండి అన్నీ గుర్తు చేయను.
కాకపోతే బ్లూ పులిహోర చేయించటం, ఊతప్పాన్ని రకరకాల టాపింగ్స్ తో స్టఫ్డ్ స్పైసీ ఇండియన్ పాన్ కేక్ అని మార్చి పడేయటం వంటి ఇన్నోవేటీవ్ ఆలోచనలతో బుర్ర తింటుంది కాని. :) నిజానికి నేను ఒక ముగ్గురు పనిచేసేప్పుడు నోరు మెదపను - హాయిగా అరటిపండో, కారెట్టో నవుల్తూ కూర్చుంటా, ఒకరు పిల్లది, రెండోవాడు వీకెండ్ ఇల్లు క్లీన్ చేయటానికి వచ్చే చైనీస్ వాడు, మూడో మనిషి అప్పుడప్పుడు యార్డ్ క్లీనింగ్ కి వచ్చే మెక్సికన్ వాడు - ఒకరితో తలపడటానికి తర్కశాస్త్రం, మిగిలిన ఇద్దరితో సకిలించాలంటే బహు భాషా పరిజ్ఞానం అవసరం. ఆ రెండూ నాకు శూన్యం కనుక మనం చేయగలా పనల్లా ఇకిలింపులు, సైగలతో పని పూర్తి చేయించటమే.
అప్పుడప్పుడు నాకు దానికీ పరస్పర క్విజ్ పెట్టుకోవటం అలవాటు. ఉదా: అమ్మ టిక్ టిక్ అంటే జీలకఱ్ఱ; బిడ్డీ టిక్ టిక్ అంటే ఆవాలు. ఇదిగో ఈ క్రింద శాల్తీల పేర్లు మీరూ చెక్ చేసుకోండి. దాదాపుగా మాకు నూరు వచ్చేస్తాయి.
ఇక నా బిడ్డడికి జామకాయ ఏదో, గ్రీన్ యాపిల్ ఏదో తెలియని అయోమయం కనుకా నేను ఏది వండి పెట్టినా అమ్మ చేతి ముద్ద, నా కడుపు చలవ అని లాగించేస్తాడు. వాడితో చిక్కల్లా తాజా కూరలు కావాలి, నూనె తడి తగలకూడదు అంతే.
ఇక కాస్త విస్తరించి ఈ పిల్లజాతికి నా వంట ఉద్దారణ ఇస్తే, ఒక ఘటికురాలు "ఉషాంటీ యువర్ చికెన్ లెగ్స్ ఆర్ యమ్మీ" అని కాప్లిమెంట్. మా గోదావరి స్పెషల్ స్వీట్ "పనసతొనలు" లేక "కిళ్ళీ బుట్టలు" కి పట్టిన అధోగతి. మరొకడు "యెల్లో థింగీ ఈస్ ఆవ్ సం" ఇవి పకోడీలు.. అలాగే "బాదుషా" == ఇండియన్ డోనట్. "నిమ్మకాయ పులిహోర" == సాల్టీ లెమొనేడ్ రైస్ [లెమన్ రైస్ అన్నా చాలు కదా] ఏదేమైనా పిల్ల స్కూల్లో నా పులిహోర, రవ్వ కేసరి, ఉల్లి పకోడీ కి మాత్రం నూటికి నూరు మార్కులు పడతాయ్.
ఇక నాకు ఆర్గానిక్ కూరగాయల వాడకం ఎక్కువ. బ్రౌన్ రైస్ దాదాపు సంవత్సమున్నర నుంచీను. నేను అన్ని విధాలుగా తినేస్తాను. మొదలుపెట్టాలనుకున్నవారు అన్నంగా కాదు కానీ, దోశతో శ్రీకారం చుట్టవచ్చు
రైస్ - ఒక కప్పు
మినప్పప్పు - ఒక కప్పు
కంది పప్పు - మూడు స్పూన్లు
మెంతులు - ఒక చెంచా
నానబెట్టి రుబ్బేప్పుడు ఒక అరస్పూన్ జీలకర్ర, చిన్న మిగల పండిన అరటి పండు ముక్క కలిపి, ఉప్పేసి రుబ్బి, ఆ దోశలకి సీమ వారి టమేటో+ఉల్లి పచ్చడి రంగరించి తింటే వాహ్ హుజూర్ అనాల్సిందే ఎంతవారలైనా గాని.
అలాగే ఓట్స్ దోశ. ఒన్ మినిట్ ఒట్స్ సగం, గోధుమ పిండి సగం, కాస్త మజ్జిగ, నీరు పోసి కలిపి - జీలకర్ర, మిరియాల, కొబ్బరికోరు [ఆప్షనల్] ఉప్పు వేసి ఒక పావుగంట నాననిచ్చి... దోశలు మరీ పలచగా రావు... పెసరట్టులా కాస్త మందంగా వేయాలి... మధ్యలో అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారెట్ కోరు, రోస్టేడ్ నట్స్ వేసుకుని కాలాక, వేడిగా తింటే ఇక ప్రక్కన పచ్చడి అధరువు అవసరం లేదు.
మీరు తింటే అందులోనే ఎగ్ బీట్ చేసి కలిపి [అప్పుడు మజ్జిగ కలపకండి], తరిగిన మష్రూం మైక్రోలో లైట్ గా స్టీం చేసి వేసుకుని అలా కూడా వేయొచ్చు..
గోధుమ బదులు అప్పుడప్పుడు బియ్యం పిండి కలపపొచ్చు... అల్లం పచ్చడి సైడ్
లేదా బ్రౌన్ రైస్ నానబెట్టి, ఒకటికి ఒకటి ఒట్స్ వేసి రుబ్బుకుని [దాదాపుగా అటుకుల దోశ మాదిరి] చేయొచ్చు. దీనికి పల్లి చట్నీ అదుర్స్..
నేను ఆరోగ్యం కి మంచిది అనే ప్రతి గడ్డీ తినేస్తా... మందులకన్నా ఇవి నయమని నా నమ్మకం.. ;) ఈ పాటికి చెప్పకపోయినా మీకు అర్థం అయుండాలి.
ఈ మధ్య ఒక కలీగ్ కి ఆలుగోబీ రెసిపీ ఇచ్చి బదులుగా స్వీట్ రైస్ కేక్ చేసే విధానం తెలుసుకున్నాను. కావాల్సిన వారు అడగండి. చెప్తాను. అది దాదాపుగా మన పంచదార అరిశెల రుచిలో ఉంటుంది.
అలాగే Textured vegetable protein [TVP] గోరు వెచ్చని నీళ్ళలో నానబెట్టి, కాస్త రెడ్ ఆనియన్, సోంఫు అవీ వేసి వండితే యమ్మీ. ఇది నేను ఒక శ్రీలంక తమిళుల వద్ద నేర్చుకున్నాను. సింగళీస్ దగ్గర బేబీ బనానా కూర ఒకటి [తొక్క తీయరు, కాస్త మసాల దట్టించి దాదాపు గోదావరి జిల్లాల్లో పెళ్ళిళ్లకి వండే పనసతొనల కుర్మా లా ఉంటుందీ కూర].
పిల్లదాని పుణ్యమాని కాస్త బర్గర్స్ తినటం అలవాటైంది. బేక్డ్ టోఫూ ఒకటి, బ్లాక్ బీన్ బర్గర్ ఒకటి బావుంటాయి.
చివరిగా, పోపులకి నూనె బాగా కాగనిచ్చి కాకమీద పోపు దినుసులు వేయాలి, నిలవ పచ్చళ్ల పోపుకి చివర్లో రోస్ట్ చేసిన మెంతుల పొడి, వెల్లుల్లి గుండా వేస్తే రుచీ శుచీ అనీన్ను, పులిహోరలో గసగసాలు, కొబ్బరి, జీలకర్రల పేస్ట్ కలిపినా [దీనికి ఆవ పెట్టకూడదు] అదొక బెమ్మాండమైన రుచన్నీను - ఇవన్నీ అమ్మమ్మల, మామ్మల చిట్కాలనీ చెప్పనవసరం లేదు, జస్ట్ గుర్తు చేయటమంతే..
ఇదంతా చెప్పటం అయ్యాక గంజి కలేసిన అన్నాలు, ఐసుపెట్టె కూళ్ళు సర్వసాధారణం అయినా కూడా ఎప్పుడో చదివిన ఒక కథతో ముగిస్తాను.
ఒక సెమినార్ అదీ శాస్త్రీయంగా మనమెంత వృద్దిలోకి వచ్చామన్న అంశం మీద అన్నమాట. అందరి చేత భేష్ అనిపించుకున్నా గానీ ఇంకెక్కడో సామాన్య జననీకం నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని ఒక శాస్త్రవేత్త ఒక బిచ్చగాడిని పట్టుకుని అడుగుతాడు. "అయ్యా, మా తాతల తరంలో కడుపుకింత కూడు బిక్షగా దొరికేది. లేదూ గంజి దొరికేది. కుక్కర్లు వచ్చాయి. ఆ గంజీ కరువైంది. దయగల అమ్మ కాస్త సద్దన్నం విదిల్చేది. ఐసు పెట్టెలొచ్చాయి, అదీ కరువైపోయింది." అని నిట్టూరుస్తాడు. నిజమే కదా?
ఇవండి అచ్చంగా మాగాయ పెరుగన్నం మీద బతికిన ఓ మనిషి పదారేళ్ళూగా కలప కంబషన్ తో వజ్రం గా మారినట్లు, ఆటుకీ పోటుకీ తట్టుకుని వంద రకాలు వంద మందికి వండి పెట్టే శక్తి, సామర్థ్యాలని పెంపొందించుకున్న యాత్రానుభవాలు. ఇంకా ఎన్నో ఊసులు కదలాడుతున్నాయి. నిజ జీవితానుభవాలు కనుక కోతలేకుండా రాసాను. భేషజంగా తోస్తే మన్నించండి. మీ మాటలు పంచుకోండిక.