వీడ్కోలు సరే - ఆహ్వానానికి ముందో మరి?

తృప్తి - బహుశా మనిషికి కొరబడిన భాగ్యరేఖ ఇదేనేమో.

ఎన్నున్నా ఇంకేవో కావాలని, యేది అందినా ఇంకేదో లేదని ఆరాటం. అసలు వున్న వాటిని ఉపయోగించుకోలేని అశక్తత. ఆఖరుకి ఇంద్రియాలని కూడా సరిగ్గా వాడుకోలేని అనాసక్తి. ఒక సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చి, మరొక దానికి ఆహ్వానం ఇస్తూ గడిపేయటం.

ఆయేటికి ఆయేటికి పెరిగే ఆశలు, అంచనాలు ఇలా అంతు లేని, అదుపు చేయని, అలుపు రాని ఆలోచనలు. ప్రశాంతతని కరవు చేసే జీవనం. కాస్త తన జీవితాన్ని తరిచి చూసి, ప్రక్కవారిని గమనించే ఎవరికైనా ఇవన్నీ కాక ఇంకేమీ స్ఫూర్తి వద్దా అని ప్రశ్న రాక మానదు. అలాగే మనుషులంతా ఇంతేననీ కాదు ఇక్కడ నేను చెప్ప దల్చుకున్నది. కొత్తదనాన్ని స్వాగతించే మనుషులలో నిత్యనూతన ఉత్తేజం ఎపుడూ వుంటుంది.


మన ఆలోచనల్లో, ఆశయాలలో, ఆచరణలోని అంతరాలు తగ్గి, మరొకరికి అనుసరణీయమైన జీవితం గడపటానికి మన చుట్టూరానే ఎన్నో ఉపమానాలు ఉంటాయి. నేను చూసిన అటువంటి కొందరిని పరిచయం చేద్దామని ఈ చిరు ప్రయత్నం. వీరందరిలో యేదో ఒక విలక్షణత. లోటు వున్నా దాన్ని అధిగమించిన సంకల్పం. సముచితంగా వుంటుందని వ్యక్తుల పేర్లు మార్చాను. సదుద్దేశ్యం తో వ్రాసినది కనుక ఎవరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాసిన టపా కూడా కాదు.

స్టీవ్ : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనలో ఎంతమంది కనుచూపు తెలిపే జీవిత సత్యాలని గ్రహిస్తున్నాము? స్టీవ్ పూర్తిగా అంధుడు. నాకు పరిచయం అయ్యే సరికి దాదాపుగా ఇరవై యేళ్ళ బట్టి కంప్యూటర్/సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన అనుభవంతో, మానేజర్ గా మా కంపనీ/పదవిలో చేరారు. తనకి ఒక గైడ్ డాగ్, "నిప్".

స్పీచ్ అసిస్టెంట్ టూల్ సహాయంతో పనిచేసేవారు. వారానికొక హ్యూమన్ అసిస్టెంట్ వచ్చేవారట. ఈ నడుమ ఆయనకి సాంకేతిక పరిమితి వలన ఆ టూల్ తో కుదరని పనులకి నా పట్ల గల నమ్మకం వలన నన్ను సహాయం అడిగేవారు. చకచకా ఆయనలా తిరుగుతుంటే చాలా ఆశ్చర్యం వేసేది. అలాగే మీటింగ్స్ లో కానీ, ఇతరత్రా చర్చల్లో కానీ ఇట్టే సమాధానాలు ఇచ్చేవారు. ఎదురుపడితే మనం "హాయ్" అనేలోపే "హల్లో XXX" అని సమాధానమిచ్చేవారు. అంత బాగా గొంతు గుర్తు పెట్టుకునేవారు.

కొన్నేళ్ళకి ఇక బ్రతకదనుకున్న ఆయన గైడ్ డాగ్ ని దాని పప్పీ బ్రీడర్ కి ఇచ్చేసి [ఒక నెల ముందు దాని పధ్నాల్గవ పుట్టిన రోజు కూడా చేసారు వర్క్ ప్లేస్లో, నేను "నిప్" వెళ్ళిపోయే రోజు తన ప్రక్కనే కూర్చుని అలా కాసేపు దాని జాలి మొహాన్ని నిమురుతూ కూర్చున్నాను. ఆయన్ని మరి ఇక సాయం ఎవరు అని అడిగితే, నాకు "నిప్" తో అనుబంధం ఎక్కువ, ఇక బహుశా మరొకదాన్ని తేనేమో అన్నారు] ఇప్పటికీ కేన్ స్టిక్ సహాయంతో వర్క్ కి వస్తూ, తన పని తాను చేసుకుంటారు.

ఒకసారి "ఇలా అడిగినందుకు యేమీ అనుకోకండి" అని, "చూపు లేదని ఎప్పుడైనా బాధ పడేవారా?" అని అడిగితే, "ఎందుకు నాకు లేనిదాన్ని గురించి బాధ పడటం, వున్నవాటితో నేనేమి చేయగలనో అదే నాకు ముఖ్యం" అన్నారు. అలాగే తనని చూపులేని కారణం గా జాలి పడటం కానీ, వివక్ష చూపటం కానీ ఇష్టపడనన్నారు. వృత్తి పర విభజనలో నేనిప్పుడు ఆయనతో పనిచేయక పోయినా ఎదురుపడితే "హాయ్" అన్న పదం నా నోటి నుండి వెలువడక ముందే "హాయ్ ఉషా, హౌ ఈజ్ ఇట్ గోయింగ్?" అన్న పలకరింపులో మాత్రం మార్పు లేదు. అతి ముఖ్యమైన ఇంద్రియం లేని జీవితం కూడా ఎంతో తృప్తిగా, విజయవంతంగా జీవిస్తున్నారీయన.

మొరీన్ : ఆఫ్రికన్ అమెరికన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళవీ మగవారిది పైచేయిగా వుండే సంసారాలు. యం.బి.ఏ. చేసిన తను నాకు పీర్. నేను మానేజ్ మెంట్ రిలేటెడ్ భాద్యత నిర్వహించిన సమయంలో ఇద్దరం రెండేళ్ళు కలిసి పనిచేసాము. బాగా కలిసిపోయాము కూడా. చాలా యెఫీషియంట్ మానేజర్.

తన మొదటి వివాహం ఆమె భర్తకి మాత్రం రెండవది. దాదాపు పదేళ్ళకి విడిపోయాక ఇద్దరు ఆడ పిల్లల్ని పెంచుతూ, అతని కారణంగా కలిగిన ఆర్థిక దుస్థితి నుండి మరొక పదేళ్ళపాటు పొదుపుగా బ్రతికి బయటపడింది. ఒక్కోసారి పిల్లల్ని తన ఆఫీసు రూం లోనే ప్రక్కన పడుకోబెట్టి పనిచేసేదట. వారి ఆలన పాలన అన్నీ తనే చూసుకుంది. ఇప్పటికీ యేవో ఒక వత్తిళ్ళే. ఎదురీత జీవనం.

పెద్ద కూతురు పరిస్థితి బాగా లేదని మనవరాలి బాధ్యత తను తీసుకుంది. పైన ఎనభై యేళ్ళ వృద్దురాలైన తల్లి [ఆవిడకి వైద్యం, శస్త్ర చికిత్సలు] రక్షణ, పోషణ. దరిమిలా తను కూడా రెండు వైపులా Hip Replacement చేయించుకోవాల్సివచ్చింది. మా కుటుంబంలో ఒకరికి ఈ సర్జరీ జరిగింది కనుక నాకు అందులోని సాధక బాధలు తెలుసు. కేవలం మూడు వారాల్లోనే ఇంటి నుండి పని చేయటం ప్రారంభించింది.

ఆలోపుగా ఒకసారి లంచ్, ఫ్లవర్స్, స్ట్రాబెర్రీ పై [తనకవి ఇష్టమని నాకు తెలుసు] తీసుకెళ్ళిన నన్ను చూసి ఒక్క నిమిషం తన కళ్ళలో చిరు తడి, "ఎంత గుర్తుగా తెచ్చావు?" అని సంబరంగా అడిగింది. అంతే ఎప్పటి మాదిరే నవ్వుతూ, ధైర్యంగా నేనున్న గంటా యే పని అడిగినా వద్దని సున్నితంగా చెప్పి, నేనిక పని చేయగలను అని ఎంతో ధైర్యం గా చెప్పింది.

అలాగే నాకొకసారి కలిగిన విపత్కర పరిస్థితి సమయం లో, నా మొహం చూసి యేదో జరిగింది అని తలిచి, ఆ సమయాన నాకు కావాల్సిన నాలుగు కన్నీటి చుక్కలు, బోలెడు మానసిక భరోసాని పంచింది. ఇప్పటికి రెండేళ్ళుగా ఇద్దరం వేరే వేరే కంపనీలకి పనిచేస్తున్నా నేను చనువుగా కాల్ చేసి, సలహా తీసుకునేంత కాంటాక్ట్స్ వున్నాయి.

కాళ్ళు అలా వుండి కూడా వాటర్ యేరోబిక్స్, కార్డియో వర్క్ ఔట్స్, జుంబా డాన్స్ నా జీవితంలోకి రావటానికి తనే కారణం. తనతో లివింగ్ టుగెదర్ చేసే రిచ్ నన్ను చూసి మనసు పడేసుకున్నాడని నవ్వుతూ చెప్పటం తనకే చెల్లింది. నాలో ఇంత పాజిటివ్ గుణాలు ఇంకా నిలబడటానికి తన వంటి మిత్రులు కొంత కారణం. తను కూడా ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా వుంటుంది. కష్ట నష్టాల కోర్చి నడుపుతున్న తన జీవితంలోని ఇన్ని అనుభవాల్లో మనం వెదుక్కోగలిగినవి ఎన్నో వున్నాయి. కాదంటారా?

యేమా/Emma : నేను రోజూ స్కూలుకి దింపే పదేళ్ళ చిన్నారి. మా పాప క్లాస్మేట్. ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. నేను వినే సినిమా పాటలు తనకి నచ్చితే అడిగి అర్థం తెలుసుకుంటుంది. ఉదాహరణకి "ఆప్ కా సురూర్ " నుండి నేను "మెహబూబా మెహబూబా .." వింటుంటే తనూ హమ్ చేసింది. ఆపై వివరాలడిగింది.

మా అమ్మాయి స్నేహ కి నిట్టింగ్ పిచ్చి. యేమా కూడా చేస్తుంది. కానీ మా పాప అంత వేగంగా చేయలేదు. క్రిస్మస్ కి వాళ్ళ కజిన్ కని ఒక స్కార్ఫ్ మొదలుపెట్టింది. తనని చూసి మా పొన్నారి మొదలు పెట్టింది. ఇదేమో చక చకా అల్లేస్తుంది. సరే ఒక రోజు ఓ డీల్ పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకరిదొకరు మార్చుకున్నారు. ఆ రకంగా ఆ పిల్లది కాస్త ముందుకు జరుగుతుందని ఆలోచన. ఆ రాత్రి మా పిల్ల చక చకా హోమ్వర్క్ చేసేసి, గబ గబా డిన్నర్ తినేసి, యమా స్పీడ్ గా నిట్టింగ్ చేసి మర్నాటికి తనకి చాలా పూర్తి చేసి ఇచ్చింది.

ఆ పాప కూడా ఎంతో సంతోషపడిపోయి, నేను కూడా వీలైనంత అల్లాను కానీ ఇందుమూలంగా నువ్వు పూర్తి చేయాలనుకున్న సమయానికి అలస్యం జరిగివుంటే నన్ను మన్నించు అని ఎంతో మర్యాదపూర్వకంగా చెప్పి, పైగా ఇకపై మనమిద్దరం అవసరంలో ఇలా పరస్పర సహకారం చేసుకోవాలి అని సూచించింది.

అన్నట్లుగానే స్కూల్ లో యేదో మ్యూజిక్ ప్రాజెక్ట్ కి, అదా ఇదా అనుకుంటూ, అది సగం ఇది సగం చేసిన మా పిల్ల చివరి వారానికి బిక్క మొహం వేస్తే అప్పటికప్పుడు తన టీం లోకి తీసుకుని ఇద్దరూ సమయానికి వర్క్ పూర్తిచేసారు. ఇద్దరిలోనూ తృప్తి, సంతోషం. కలిసివుంటే కలదు సుఖం. ఐకమత్యమే బలం. ఎంత నిజం అనిపించింది. అలా ఆ పసికూనల్లో వున్న పరస్పరావగాహన, సహకారం చూస్తే ఒక సుమతీ శతకం లోని పద్యం గుర్తుకి రావటం లేదూ?

క్రిస్మస్ కి మా అమ్మ, నాన్న, చెల్లి, అన్న, నేను, మా అమ్మమ్మ, తాత, మా డగ్గీ కలిపి ఎనిమిది మందిమి చేసుకుంటాము అన్నప్పుడు, మా బుల్లిది ఆ డగ్గీ అంటే డాగ్ కి స్టైల్గా అలా పేరా అని అడిగితే "కాదు మేము దాన్ని "Doug/డగ్" దగ్గర కొన్నాము, అందుకే అతని గుర్తుగా ఆ పేరు అని చెప్పింది. కుటుంబ విలువలు చాటే ఇటువంటివి కార్లో వాళ్ళ సంభాషణలో ఎన్నో వింటాను.

డ్రైవ్ చేస్తున్నంత సేపు, ఒక ప్రక్క పాటలు, ఒక ప్రక్క యేమా, లోరెన్ [యేమా చెల్లి] మా స్నేహల కబుర్లు నాకు ఉదయపు వార్తల వంటివి. నిజానికి ఇక్కడి జీవితాల్లోకి ముఖద్వారం అటువంటి సమయాలే.

ఇలాగే నేను అవసరానికి వుంచుకో అంటే "లేదు, నాకు యేదైనా చేయగల పనిచ్చి డబ్బు ఇవ్వు" అని, నా చీర మీద వర్క్ చేసి గంట కింత అని మాత్రం చార్జ్ చేసి తీసుకున్న అరవై యేళ్ళ అమెరికన్ ఆండ్రియా, పార్ట్ టైమ్ జాబ్ గా బీడ్స్ దండలు, క్రిస్టల్ సెట్స్ చేసి తన చదువు ఖర్చు తల్లికి భారం కాకుండా జాగ్రత్త పడే మొరీన్ రెండో కూతురు మరియా [తను నాకు ఇలా అయితే చీప్ గా చేయొచ్చు, నీకు ఇది బాగుంటుంది వంటి సలహాలు కూడా ఇస్తుందే తప్పా, యేనాడూ నాకు ఖరీదైన నగ/వస్తువు అంటగట్టలని చూడదు], సంపాదించింది చాలు, నా రచనలతో సంపాదించాల్సిన తృప్తి ఇంకా మిగిలేవుందని ఉద్యోగానికి రాజీనామా చేసి రచనావ్యాసాంగం చేపట్టిన స్కాట్....

ఇలా మరెందరో స్వయంకృషి, స్వయంప్రతిపత్తి, తృప్తి, ప్రేమ, ప్రశాంతత, ఆచరణ, అవగాహన, అభ్యాసం వంటి ఎన్నో లక్షణాలకి సోదాహరణలుగా నాకు జీవితం పట్ల మక్కువ, స్ఫూర్తి ఇస్తారు.

ఒక కాలెండర్ మారి మరొకటి రాగానే మార్పు రావాలని కాదు. క్రొత్త అన్నది జీవితంలో యేదో ఒక నూతనత్వాన్ని తేవాలి, విజయం కలుగజేయాలి కనుక ఈ టపా నుండి మీకు ఒక చిరు సందేశం అన్నా అంది వుంటుంది అని ఆశిస్తూ...

నా వరకు "మరువం" కారణం గా ఎందరో ఆత్మ బంధువులు దక్కారు, కవిత్వం పట్ల అవగాహన, పరిజ్ఞానం వున్న వారి పరిచయభాగ్యం దక్కింది, మార్గదర్శకత్వం అందింది, తద్వారా ఈ లక్ష్యసాధనలో విజయాన్ని, నా బ్లాగు నడిపిన ఈ ఒక సంవత్సర కాలం లోనే కాసింత గుర్తింపు వచ్చిన తృప్తిని వెనకేసుకుని...

ఈ యేటికి వీడ్కోలు పలుకుతూ, వచ్చే యేటిలోకి అడుగిడుతూ, మరిన్ని ఆశయాలకి, ఆచరణకి ఆహ్వానం పలుకుతూ, మీ అందరికీ కూడా మరొక నూతన సంవత్సరం రానున్న ఈ తరుణం లో మీరు, మీ ఆత్మీయులు సంతోషపూరిత వాతావరణంలో, ప్రశాంత సమయాలు మరిన్ని గడపాలని కోరుకుంటూ... మీ నేస్తం.

26 comments:

 1. చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పారు.
  మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. చాలా చక్కటి పోస్ట్. జీవితమ్మీద మీ దృక్పధం,మీరు చూసే కోణం అర్ధం ఐంది నాకు.సంతోషం, కొద్దో గొప్పో భావసారూప్యం కలిగిన స్నేహం నాకు మీ రూపంలో దొరికినందుకు. Happy new year.

  ReplyDelete
 3. Nice one Happy new year.. have a blast...

  go go go adigo lokam adigo.. :)

  ReplyDelete
 4. స్ఫూర్తి వంతమైన టపా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
 5. కొత్త సవత్సరం లో ఉత్తేజభరితమైన పోస్ట్ తో అడుగు పెడుతున్నాం ...మీకూ ఈ కొత్త సంవత్సరం మరిన్ని శుభాలను ఇవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు !

  ReplyDelete
 6. పడిపోయిన ప్రతిసారి, తిరిగి పైకి లేవడం లోనే మనిషి యొక్క గొప్పతనం బహిరంగమౌతుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే కిటికీ నుంచి చూసినా, ఒకరికి నక్షత్రాలు ఒకరికి బురదగుంటా కనిపిస్తుంది...అదే జీవితం. అనేక నీతులు చెప్పడం కన్నా ఒక మంచి పని చేసి చూపడం మేలు కదా! మీ మంచి స్నేహితులకు, మీకు, నా అభినందనలు...నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. great inspirational post...నేనూ ప్రత్యేకం న్యూ ఇయర్ అనుకోనండీ..మనమెప్పుడు విచారాన్ని వదిలి కొత్తగా రోజు ప్రారంభిస్తే అదే కొత్త సంవత్సరం నాకు...anyways...
  Happy new year too...
  మాకన్నా మీకక్కడ హడావుడి ఎక్కువ కదా...:)

  ReplyDelete
 8. చాలా గొప్ప వ్యక్తుల గురించి పరిచయం చేశారు..

  >>క్రొత్త అన్నది జీవితంలో యేదో ఒక నూతనత్వాన్ని తేవాలి, విజయం కలుగజేయాలి
  కరెక్ట్ గా చెప్పారు..

  మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీరు మీ ఆత్మీయులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...

  ReplyDelete
 9. ఒక కాలెండర్ మారి మరొకటి రాగానే మార్పు రావాలని కాదు. క్రొత్త అన్నది జీవితంలో యేదో ఒక నూతనత్వాన్ని తేవాలి, విజయం కలుగజేయాలి కనుక ఈ టపా నుండి మీకు ఒక చిరు సందేశం అన్నా అంది వుంటుంది అని ఆశిస్తూ...

  తప్పకుండా ఉషా. కొత్త సంవత్సరం ప్రారంభం లో మంచి విషయాలు చెప్పారు.

  ReplyDelete
 10. మంచి టపాతో 2009 కి మరువపు వీడ్కోలు బాగుంది.

  మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉష గారు

  ReplyDelete
 12. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మీకు నచ్చిన, మీ జీవితాన్ని ప్రభావం చేసిన వ్యక్తుల్ని ఇలా అందరికీ పరిచయం చెయ్యటం బాగా నచ్చింది. ధన్యవాదాలు.

  మనకు లేని దాని గురించి బాధ పడకుండా ఉన్నవాటితో ఏమి సాధించవచ్చో అని అని ఆలోచించే స్టీవ్ ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు ఈ వాక్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

  ReplyDelete
 13. నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన నా ప్రియనేస్తం నాకు ఎప్పుడూ స్ఫూర్తి, కానీ ఈ టపా ద్వారా తనలోని పట్టుదలను తన నుంచి నేను నేర్చుకోవలసినవి చాలా గుర్త్తు చేశారు...

  మీకు మీ ఆత్మీయులకూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

  ReplyDelete
 14. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు .

  ReplyDelete
 15. చూసే మనసుంటే ప్రపంచమంతా అందమే. బాగుంది మీ టపా. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 16. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 17. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మీకు నచ్చిన, మీ జీవితాన్ని ప్రభావం చేసిన వ్యక్తుల్ని ఇలా అందరికీ పరిచయం చెయ్యటం బాగా నచ్చింది. ధన్యవాదాలు..!
  మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 18. జరిగిపోయిన కాలము తిరిగిరాదు
  గడిచి పోయిన వెన్నియో అనుభవాలు
  కనిన కలలన్ని మట్టిలో కలసిపోయె
  అయిన కలగందు ముందు బాగుండు ననుచు....
  My dear Usha...

  WISH YOU A HAPPY AND PROSPEROUS NEWYEAR...

  ReplyDelete
 19. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 20. ఇక్కడ యేదో ఒక స్ఫూర్తిని అందుకుని, సంతోషం గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీకు మీ ఆత్మీయులకీ నా తరఫున నూతన సంవత్సర హార్ధిక శుభాకాంక్షలు.

  ReplyDelete
 21. మంచి విషయాలు చెప్పారు.
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 22. శ్రీనిక గారు, ఇలా ప్రతిదానిలో యేదో ఒక మంచి తప్పక వుంటుందనే నా నమ్మకం. కాస్త సరదాలు కలిపిన భాధ్యతాయుత జీవనం నా తీరు. నెనర్లు. మీకు కూడా హాప్పీ న్యూ ఇయర్.

  ReplyDelete
 23. ఉష గారు,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 24. ఫణి, నెనర్లు. మీరు కూడా ఈ సం. శుభారంభంతో మొదలిడి సంతోషంగా గడిపారని ఆశిస్తూ..

  ReplyDelete