నాకు నిదురించాలని వుంది

చలిగాలి సుడులు తిరుగుతూ
ఆలపించే వణుకుల రాగం లో...
వెచ్చెచ్చని దుప్పటి కింద ముడుచుకున్న
అరమూతల కళ్ళ వెనుక కదిలే కలలో...
అమ్మవొడి చూసుకుని,
నాన్న గుండె తలుచుకుని,
మమతకి మారుపేరు నా మనసనుకుని...
ఆదమరవనీయని నా హృదయాన్ని

పలుమార్లు సేదదీర్చి, పలుకుగంధాలు వెదజల్లి

తనకంటి నీడ నా కంటి నలుపున కట్టిపెట్టి
నా చెంత నిలిచే నా తోడు కావలితో...
మంచుకురిసే రేయిలో, వానవీడని పొద్దులో
కాలమాగని గతిలో, కనికరంలేని ఋతువులో
కనపడని మాయ కమ్మిన బ్రతుకులో
నీకు
నేను వున్నానన్న జతలయలో...
తృప్తిగా నాకు నిదురించాలని వుంది

36 comments:

  1. లాలి పాటల పార్వతిని మైమరపించి
    జోల పాటల మనస్విని జోకొట్టి
    ప్రతి నిత్యం, ప్రతి క్షణం
    తోడు నీడై నీలో సగమై
    సహన శీలి ఉషా చంద్రునికి

    మరువపు వందన వేడ్కలా ఇవి?

    ReplyDelete
  2. మంచు కురిసిన రాత్రి లో తోడూ నీడైన చెలికాని, మండుటెండల వేడి లో సేద తీర్చే జత గాడిని.. కారు మబ్బుల వాన లో గుండె పట్టిన వలపు రేడుని... ఆరు రుతువుల ఆరునొక్క కాలం లో వెంట నడిచిన మరుల విలుకాని ని తోడు చెసుకున్న మరువపు కొమ్మ కు శుభం గా నిదుర రా గాక. తధాస్తూ.. ;-)

    ReplyDelete
  3. పలుమార్లు సేదదీర్చి, పలుకుగంధాలు వెదజల్లి
    తనకంటి నీడ నా కంటి నలుపున కట్టిపెట్టి
    నా చెంత నిలిచే నా తోడు కావలితో...

    Just wonderful.

    ReplyDelete
  4. ఇంకేంటాలస్యం హాయిగా బజ్జోండి మరి!

    ReplyDelete
  5. భా.రా.రె. "మన చరితే ముందు తరాలకి కావాలి మరోచరిత్ర..." నాకూ స్వంతం కావాలన్ని చిరు స్వార్థం. అందుకే చిన్న చిన్న అనుభూతులు కూడా ఇలా చిక్కగా కలబోసుకుంటూ. నెనర్లు.

    ReplyDelete
  6. భావన, నీ తఫస్సు పుణ్యమాని నిజంగానే నిదురోయా. కానీ ఈ నిదురలోనూ ఈ తలపే తలపోసుకుంటూ గడిపేసా.. ఆయ్ టాంక్సండే అమ్మాజమ్మ గారు. ;)

    ReplyDelete
  7. కల్పన గారు, ఈ రోజు నా జీవితంలో ఒక మంచిరోజు ఇంతవరకూను. ఇకపై ఇంకా మరింత మంచిరోజు. ఎందుకంటే నా బ్లాగులో నాకు గుర్తుండి ఇదే మీ మొదటి వ్యాఖ్య. మీ ఆగమనాలు ఇకపై కూడా కొనసాగాలని నా మనవి. నా గుండె పాళీలో తను నింపే సిరా ఇలా ఒలికింది, మీ మనసుని తాకింది. నెనర్లు.

    ReplyDelete
  8. విజయమోహన్ గారు, నన్నలా కలల్లోకి తోసి మీ మానాన మీరు మరో సంకలనం చిత్రించేద్దామనే. నిన్న నడిరేయి నిదుర కళ్ళని ఆపి, పని చేయక తప్పని స్థితిలో మనసు చేసిన మారామిది. ధన్యవాదాలు. ఇక మీరన్న అదే పనిలో వుంటాను. :)

    ReplyDelete
  9. బాగుందండి
    నేను ఇపుడే నిద్ర లేచా గా ...సరే మీకు గుడ్ నైట్ :)

    ReplyDelete
  10. వంశీ, అలాగే :) నిదురమ్మ మీ ఇంటి ముందు సంక్రాంతి ఆటల్లో వుందింకా ... "కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో .." అంటూ... మరి మావూరి క్రిస్మస్ స్నోమాన్ బిల్డ్ చేయటానికి పంపితే నా జతకడతదేమో!

    ReplyDelete
  11. బాగుందండి. నేను భావన, భా.రా.రె అంత బాగా చెప్పలేను కానీ, మీ నిదుర గురుంచి నా భావం కూడా అదే.

    ReplyDelete
  12. Excellent.! I wish u a very good sleep all the times. ;)

    ReplyDelete
  13. మీ ఆశ నిరాఘాతంగా నెరవేరాలని మనసారా కోరుకుంటూ...
    లాలి లాలి జో లాలి జో ....

    ReplyDelete
  14. ఉషక్క ఎప్పటిలానే సూపర్ గా రాసారు :)

    సందె వేళలో విను వీధి నుండి జాలువారే
    విరిసీవిరియని కంకేళికా హిమకుసుమాల తాకిడికి
    పులకించిన ప్రియురాలి పసిమేను చిరు వణుకుతో;
    చెలికాని యదపై వాలి; ఆలాపన నిద్దురలో
    హృదయాంతరాల నింపుకున్న ఊహలు;
    నులివెచ్చని శ్వాసల ఊసులుగా , షడ్జాది నిషాదాన్తములతో కలగలిపి
    వలక బోసుకున్న తలపుఝరుల నిర్మల రవంలా ఉంది.....

    ఆ ఆలాపన నిద్దుర నుండి ఆదమరిచే నిద్దుర లోకి హాయిగా జారుకోండి
    జీవితాంతం మీ చెలికాని యద మీ తలగడేగా మరి....

    మీ సంతోషం కోరే...
    మీ తమ్ముడు :) :)

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  15. మరింకెందుకు ఆలస్యం....
    ఆశల పందిరిలో
    కలల కౌగిలిలో
    వెచ్చని ఒడిలో
    హాయిగా నిదురించండి!

    ReplyDelete
  16. మీ కవితా లోకం లో నిదుర మధురిమ చాలా బాగుంది. మేమేదొ, అలా నిద్ర పోయేస్తాం అంతే.

    ReplyDelete
  17. హన్నన్నా...
    ఇరుగు దిష్టి...పొరుగు దిష్టి...ఇంట్లో వాళ్ళ దిష్టి....థూ..థూ...
    ఎవ్వరి దిష్టీ తగలకుండా ....ఒకరి కొకరై....ఒకరి కోస మొకరై
    ఒకరి నీడ ఒకరై........ఒకరి వేడి ఒకరై
    అన్నీ, అంతా ఒకరి కొకరై ఒదిగిపోతుంటే
    నింగి కాస్త తలవంచి నేలను తాకుతుంటే
    నేలతల్లి చేయి చాపి నింగిని అందుకుంటుంటే
    ప్రకృతికాంత మలయమారుతానికి పులకించిపోతుంటే
    జాబిలమ్మ జోలపాట అందుకుంటుంటే..
    ఎవరెంత దిష్టి పెడితేనేమి
    మంచులా విడిపోదా ఆ దృష్టిదోషం..
    వెన్నలా కరిగిపోదా ఆ మానిని హృదయం...
    హిమగిరిలా పెరిగిపోదా ఆమె సంబరాల బంధం....?

    ReplyDelete
  18. సునిత, ఎవరి బాణీ వారిది, ఎవరెలా చెప్పినా అర్థం చేసుకునే ధోరణి నాది. థాంక్స్. ;)

    సుజ్జి, ముందు అలవాటు, తర్వాత కలవరపాటు ఆ నిదుర తీరు. కానీ వదిలే పనే లేదు. టాంక్యూ... [కావాలనే మళ్ళీ టైపో అని గీతాచార్య సరిదిద్దుతారని] ;)

    ReplyDelete
  19. హను, మీదీ మొదటి వ్యాఖ్యే కదు? ఎంతైనా నిదుర చేసే కనికట్టిది అందర్నీ ఈ వనం లోకి ఆకర్షించింది. ;)

    వర్మ, మీ వంటి హితుని వచనాలు వమ్ము కావు. నెనర్లు.

    ReplyDelete
  20. కార్తీక్, చాలా చిక్కని పదాలతో మీ ప్రతి-కవిత అలారారుతుంది. నా కవితకి ఎప్పుడూ ఇలా తులసీ దళాలు కలుస్తూనే వుంటాయి, కదంబాన్ని కడుతూనేవుంటాయి.

    ReplyDelete
  21. పద్మార్పిత, మీరైతే ఇంచక్కని చిత్రమొకటి కలిపి ఇంకాస్త అందం కలిపేవారేమో ఈ చక్కదానాల నిదురాలాపనకి...

    జయ, మా యువ నిదురపోయే వాడి చెల్లి/స్నేహ మోముని చూస్తూ ప్రపంచంలోని శాంతి అంతా అక్కడే వుంది కదా అన్నాడో సారి, అలాగే ఒక నిమిషం పాటు తృప్తిగా మన మానసచోరునితో నిదురపోయినా అది ఓ యుగం పాటు శక్తినిస్తుంది కదండి. :)

    ReplyDelete
  22. శ్రీలలిత గారు, అనుకున్నా మీరు ఆ చివరాఖరి మాట తో పదం ఎత్తుకుంటారని పాదాలు కలుపుతారని. ;)

    నా వూహ నిజం చేస్తూ అచ్చంగా నేనుకున్నట్లే మీరు ... ఇక పోతే మన సాహిత్య స్నేహితంఇలాగే యే దిష్టీ తగలకుండా ఈ మైత్రివనాన సాగాలి. నా పిచ్చి బుర్ర "ఒకరి కొకరై....ఒకరి కోస మొకరై, ఒకరి నీడ ఒకరై........ఒకరి వేడి ఒకరై
    అన్నీ, అంతా ఒకరి కొకరై ఒదిగిపోతుంటే... హిమగిరిలా పెరిగిపోదా ఆమె సంబరాల బంధం....?" లో బందీ అయిపోయిందిక. కనుక దీర్ఘనిద్రలోకి జారిపోతూ, మీకు వేవేల కృతజ్ఞతలు పంపుతూ.. ఇన్ని బంధాలలోను అనుబంధాన్ని వెదుక్కోగల మానసాన్నిచ్చిన స్వామికి వందనాలు సమర్పించుకుంటూ.. మీ నేస్తం.

    ReplyDelete
  23. మాకు చెప్పోద్దులెండి...ఇరుగుబ్లాగుల దిష్టి ...పొరుగు బ్లాగరుల దిష్టి....కామెంటర్ల దిష్టి ......
    అంతా మూసిన కళ్ళ కాటుక నలుపులో ,నిదురించిన చీకటి మలుపులో కరిగిపోవాలి .తిరిగి ఉషోదయంతో మరువపు పరిమళాలు మాకుపంచాలి.
    శుభరాత్రి మరి !

    ReplyDelete
  24. ఉష గారు
    awesome.. very beautifully written

    ReplyDelete
  25. నేనొప్పుకోను.. నాకంటే ఎక్కువ కామెంట్లు ఎలా వచ్చాయి మీకు?

    ReplyDelete
  26. పరిమళం గారు, అంత రహస్యమేమీ లేదండి ;) నేను సరదాకి ఆ కొసమెరుపు కలిపాను. నా ప్రియనేస్తం చాలా సుదూరాన వుంటుంది. కనుక మా ఇద్దరికీ నడుమ నడిచేవి ఈ-మెయిల్సే. మొన్న రాత్రి తప్పనిసరిగా వర్క్ చేయటం, అదే సమయానికి మానసికంగా అలిసిన వేళల తన ఈమెయిల్ అందటం తో అలా కలుపుకు వెళ్ళాను ఓ కవితగా...

    నేనిక్కడ ప్రస్తావించింది, మానసిక బంధాన్ని. ఒక తోడులో తల్లిని, తండ్రిని, స్నేహితుని వెదుక్కోగల మనసుకి ఆదరించి జతగా బ్రతికే సహవాసి దొరకటం భాగ్యం. ఇందులో లౌకిక భావన వెదికితే/దొరికితే అది నా భావ వ్యక్తీకరణలోని లోపం. ఇక్కడ నిదుర అన్నది ప్రశాంతంగా మరే ఆలోచనలు లేని నిద్రకి ప్రతీక. ఇక్కడి జీవితాల్లో అది చాలా అరుదైనది. కానీ మీ వ్యాఖ్యలో ఎప్పుడూ విలక్షణత నాకు నచ్చుతుంది. నెనర్లు.

    ReplyDelete
  27. ఫణి, Thanks for the comment. You must have read about this news very recently "SAP India CEO Ranjan Das dies of cardiac arrest". He mentioned in an interview not too long before his death that sleep was still a scarce commodity. He was suspected to be a victim of lack of sleep.

    Since then back of my mind I was tracking on how much sleep I get and even if I get how much of that is stress free and real peaceful. Along those lines together with so beautifully worded text from my close friend made me wondered what helps me all the time to cope up and what matters to me in terms of peace and contentment in life. Hence is this answer. This is a verse of heart.

    If there are misinterpretations of this, that is left to the poor exposure of ones' discrimination. :)

    ReplyDelete
  28. బిడ్డా, భా.రా.రె. "నాది నాది అనుకున్నది నీది కాదురా.." [లేకపొతే బిడ్డీ అని నన్ను సంభోదిస్తారా :)]
    కనుక నీ బ్లాగును సాగరసంగమం మాదిరి ఆ మరువపు బ్లాగున కలిపేసి నావి నీవి అన్ని కలిపి వారివి [చదువరులవి] అన్న వేదాంతం అలవరుచుకుని, ఇక యోగనిద్రకుపక్రమించు. పెద్దల మాట చద్దిమూట. అది నీ మంచికే చెప్పేది. :)

    చిన్ని, నెనర్లు. చెప్పిన మాట గుర్తుంది కదా. పట్టి పీఢిమ్చాల్సిన వారిని [అనగా ఈ పైవారిని] మాత్రం వారి సీమలో వదలొద్దు... ;)

    ReplyDelete
  29. అలలుతెరలుగా వీస్తుంటే
    కడలి తరంగాల పాన్పుపై
    ఈ కవితా గానం వింటూ
    హాయిగా నిదరోవాలని ఉంది

    ReplyDelete
  30. ప్రదీప్, మౌనముద్ర/నిద్ర నుంచి లేవగానే మళ్ళీ నిదురపోవాలనిపించిందా నా కవిత పుణ్యామాని. మంచిదేలెండి. సముద్రగాలి, కవితాగానం అంతకన్నానా? కాకపోతే కాస్త కుళ్ళుకుంటాను నాకా అదృష్టం లేదే ఇలా మంచు కరిగిన నల్లేరే నాకు మహా సంద్రమని.. ;)

    ReplyDelete
  31. "మంచుకురిసే రేయిలో, వానవీడని పొద్దులో
    కాలమాగని గతిలో, కనికరంలేని ఋతువులో
    కనపడని మాయ కమ్మిన బ్రతుకులో
    నీకు నేను వున్నానన్న జతలయలో..."

    ఈ లైన్లు చాలా నచ్చాయండి.

    ReplyDelete
  32. మీరు నా మనసులో మాటల్ని కవితలా రాసారంతే...:)

    ReplyDelete
  33. తృష్ణ, మరి ఇక ఆలస్యమెందుకు? కానీయండి. ఓ కమ్మని కథనం ఆపై మాకూ పంచేయండి. ;)

    ReplyDelete