కాలగమనం ఒకే తీరుగా వున్నా జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనలు వేగం అన్న లక్షణాన్ని కలుపుతాయేమో! నానమ్మ అస్వస్థతతో అనుకోని ప్రయాణంగా ఇండియాకి వెళ్ళటం, అదే ఆవిడ ఆఖరు చూపు కావటం, మిత్ర వెళ్ళిన వారానికే ఆవిడ చనిపోవటం అంతా కలా, నిజమా అన్నట్లుగానే జరిగిపోయాయి.
ఎంతటి మనిషినైనా కుదిపేసేది మరణం. మనసులోని జ్ఞాపకాల కన్నా మరింకేమీ అవసరం లేదు, అవి సజీవంగానే వుంటాయి ఎప్పటికీను. అయినా ఏమిటో బాహ్యరూపాన లేరు అన్నది, ఇక మన మధ్య మెసలరు అన్నది జీర్ణించుకోవటం కష్టం. తిరిగి వచ్చిందే కానీ మిత్ర మనిషి మనిషిగా లేదు. ఊహ తెలిసాక ప్రియమైన వ్యక్తిని కోల్పోవటం ఇదే.
దిగులు గూడు కట్టుకున్న మనసు పదే పదే పరధ్యాసలోకి నెట్టివేస్తుంది. గుల్డెన్ సానుభూతి తెలిపినా ఉద్యోగరీత్యా భాద్యత తప్పదు కదా. విశ్వ కూడా తీరిక లేనంతగా పనిలో కూరుకుపోయాడు. అందుకే అతన్ని మునుపటిలా కలవటానికి వీలవటం లేదు.
*************************************************
ఓ ఆదివారం ఉదయం అనాసక్తిగానే తిరిగి వచ్చి అలానే వదిలేసిన సూట్ కేస్ బయటకి తీసి సర్దుదామని మొదలుపెట్టింది. నానమ్మ గుర్తుగా తాతగారు ఇచ్చిన వస్తువులున్న చిన్న వెండి డబ్బా తీసింది.
ఆవిడ వాడుకున్న కాటుక, కుంకుమ భరిణె, మంగళ సూత్రాలు, నల్లపూసలు, ముత్యం, పగడం (చిన్నప్పుడు ఆటల్లో అవి నాకు కావాలి అని మారం చేసినప్పుడు నీకు పెద్దయ్యాక ఇస్తాను అనేవారావిడ), దుద్దులు, గాజులు, ఓ చీర - ఇలా ఒకటొకటి తీస్తుంటే లక్షీదేవమ్మ గారు కళ్ళెదుట నిలిచిన భావన.
కంటి నీటి చెమరింఫుకి మసగ్గా కనపడుతున్న ముత్యం, పగడం గుప్పిట్లో పెట్టుకుని వచ్చేసే ముందు తాతగారి మాటలు మననం చేసుకుంది.
"మిత్ర, చాలాసార్లు చెప్పానమ్మా. తోడు లేనిదే బ్రతలేమని కాదు, ఆ బ్రతుకున అర్థం వచ్చేది మనకి తోడునీడగా సాగే మనిషుంటేనే. మీ నానమ్మ నాతో ఇన్నేళ్ళ సావాసం లో తను లేకపోతే నేనెలావుంటాను అని ఆలోచించలేదు. ఈ క్షణం ఆ వెరపు వస్తోంది. తనున్నంత కాలం గడిచిన ప్రతి ఘటన మాదిగానే సాగింది. ఇకపై నా జీవితం తనున్నా లేకున్నా అలాగే గడుస్తుంది. నువ్వు కూడా త్వరలో పెళ్ళి చేసుకుంటే నానమ్మ కోరిక తీరుతుంది. విశ్వని ఇష్టపడుతున్నావని తెలిసింది. కీడు జరిగిన ఇంట శుభకార్యం మంచిది అంటారు. ఆలోచించుకుని చెప్పు అమ్మలు." అన్నారు.
ఏ కష్టాన్నైనా తట్టుకోగల మానసిక స్థితి వయసుతోనో, పరిణితితోనో వస్తుందేమో. మౌనంగానే మాధవయ్య గారు దుఃఖాన్ని దిగమింగుకుని కార్యక్రమాలన్నీ జరిపించారు.
సురేంద్ర, కస్తూరి, విష్ణు, అతని తల్లి, నవీ తల్లి, అనంత ఇలా అంతా అక్కడికి వెళ్ళాక ఇదే ధోరణిలో పడకు, జరామరణాలు మన చేతిలోవి కాదు. చక్కని జీవితం గడిపి, సునాయాస మరణం పొందిన ఆవిడ అదృష్టవంతురాలు అని ఓదార్చి, ఒంటరిగా దిగులుపడకు నలుగురిలో వుండు అని మరి మరి చెప్పి పంపారు.
విశ్వ కూడా వీలైనంత కలుస్తూనే వున్నాడు.
మరో మూణ్ణెల్లు గడిచిపోయాయి. మిత్ర మాటల్లో తాతగారన్న మాటలతనికి ఓ సారి చెప్పింది. మౌనం గా విన్నాడు. పెళ్ళి విషయం లో మిత్రకి కలిగిన విముఖతకి గల కారణాలు మునుపే చెప్పి వుండటంతో ఆ విషయమై యే వత్తిడీ తేకూడదనే అతని నిర్ణయం.
"మిత్ర, మన విషయమై తీసుకునే యే నిర్ణయమైనా తిరిగి నువ్వు రిగ్రెట్ అవకూడదు. నీ కొరకు ఎంతకాలమైనా నేను వేచివుంటాను. ఆ మధుర క్షణాలకోసం అవసరమైతే జీవితకాలమంతా వేచివుంటా." అనునయంగానే అన్నా అతని మాటల్లోని నిశ్చలత మనసుకి సాంత్వననిచ్చింది.
*************************************************
మనసు పెళ్ళి అన్న ధోరణిలోకి వెళ్ళాక కలగాపులగంగా ఏవేవో ఆలోచనలు. నవీకి కాల్ చేసి చాలా సేపు మాట్లాడుతూనే వుండిపోయింది. ఒకప్పుడు వివాహంలోని అసంతృప్తితో మిత్ర వొడిలో పడుకుని చిన్నపిల్లలా కన్నీరొలికించిన ఒకప్పటి నవీ, ఇప్పుడు ఎంతో సమన్వయంగా మాట్లాడి మిత్ర మనసుకి నిర్ణయం పట్ల స్పష్టత చేకూర్చింది.
మనసు చిత్రమైనది. అంత వరకు పెళ్ళి అనగానే సందేహాలు కమ్మి వెనక్కులాగే అదే ఇప్పుడు ఎప్పెడెప్పుడు విశ్వాకి చెప్పేయాలా అని తొందరిస్తోంది.
మన మనసు స్వేఛ్ఛావిహంగం. మనం దాని నీడలం. ఒక్కోసారి దానికన్నా సాగి పెద్దగా, ఒక్కోసారి అసలు లేనట్లే మనని మనం కనుమాయ చేసుకుంటూ, మరోసారి సాక్షాత్కారం చేసుకుంటూ సాగుతామేమో.
మిత్ర తన అస్థిత్వాన్ని విడిచి విశ్వనే తనుగా మార్చుకున్న ఆ క్షణం ఆమె జీవితంలో పెను మార్పులు సంభవించటానికి నాందీ అని వూహించలేకపోయింది. తనది అన్నది కోల్పోవటం అది పరాధీనం కావటం కూడా శాపమా? కాలం మౌనంగా వీక్షిస్తున్న ఆ పరిణామం విశ్వామిత్రుల జీవితాలపై ప్రభావం చూపటానికి సిద్దపడుతూవుంది.
*************************************************
మిత్ర విశ్వాకి తన మనసులోని మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" అని వెల్లడి చేయటం ఆ వారాంతం లో వచ్చిన ఆదివారం ఉదయాన జరిగిపోయింది.
విశ్వ ఆ రాత్రి చదివిన డైరీలో మిత్రతో తొలి పరిచయం నాటి విషయాలు, అతని అలవాట్లలో తెలియకుండా వచ్చిన మార్పు, ఏ పని ఒక ప్రణాలికతో జరపని అతను మిత్ర కోసం ఆమె కి సమీపంగా వుండటానికని, ఆమె మనసుని గెలవటానికి చేసిన సాధన, ప్రయత్నాలు, అతని ఇంట్రావర్ట్ నేచర్, దానినధిగమించి ఆమెతో మనసు వెల్లడి చేయగల స్థితికి చేరటం, క్రమేణా జీవితం పట్ల కలుగుతున్న నిర్దిష్ట భావాలు, అతను మొదలు పెట్టిన సోషల్ సర్వీస్ సంస్థ వివరాలు, నేర్చుకున్నది తండ్రి ప్రభావం చేతనైనా చిత్రలేఖనానికి ప్రేరణ ఆమె నుండి ఎలా వచ్చిందీ, మారథాన్ రన్, భవిష్యత్తులో మిత్రతో కలిసి చేయాలనుకుంటున్న సహజీవనం పట్ల కలలు, ఇలా ఎన్నో వ్రాసున్నాయి.
నిజానికి తను మిత్రతో పది మాటలు చెప్పాలనుకుంటే ఒకమాట బయటకి చెప్పానేమో అనిపించింది అవన్నీ చదువుకుంటుంటే. తన స్వంతమైన ఆమెకి ఇక ఈ వివరాలు అవసరమా అని కాస్త ఈజీ ధోరణిలో వదిలేసాడు.
అదే సున్నితమైన ఆమె మనసులో మరొక ఆశనిపాతానికి ఆజ్యం పోస్తుందనీ అతడూహించలేదు. మిత్రకి ఆమె పుట్టినరోజునాడిచ్చిన భావాల సంపుటి కన్నా, అతను ఈ డైరీలో వ్రాసుకున్న కొన్ని విషయాలైనా ఆమెకి తెలిపివుంటే అతని జీవితంలో తన పాత్ర, పాళ్ళు ఆమెకి అవగతమయ్యేవి. అతని పట్ల తనవి వూహలే కాదు వాస్తవ ఘటనలు వున్నాయని ఆమెకి తెలిసేది. ఒక్క అపోహ అయినా తొలిగేది. ఎందుకంటే ఆ పుస్తకంలో ప్రేమ పూరితమైన పలుకులు ఆమెకి ఆశ్చర్యానుభూతులని మిగిల్చినా నిజ జీవితానుభవాల గాఢప్రభావం ఇంకాస్త కూరిమి కూర్చేదేమో ఆ బంధానికి.
*************************************************
వాస్తవం ఋతువుల వోలే జీవితాన్ని తాకిపోతుందెపుడూను. కాలక్రమం లోని ఈ సంభవాలకి ఎవరూ అతీతులు కాలేరేమో.
సంతసం వసంతంలా ఇట్టేవచ్చి అట్టే జారుకుంటుంది.
మనస్తాపం గ్రీష్మంలా కాల్చేస్తుంది.
దుఃఖం వర్ష ఋతువులా గుండె లోగిల్ని వరద పాల్చేస్తుంది.
ఆత్మ విమర్శకి, ఆశటూపిరులకి మారుపేర్లు హేమంత, శరద్రుతువులు.
ఆత్మ సాక్షాత్కారం శిశిరంలా మనసు లోపలి తప్పుడు భావనలు రాల్చేస్తుంది.
విశ్వామిత్రుల జీవితంలో గ్రీష్మం అరుదెంచనుంది.
*************************************************
మునుపటి కంపనీలో విశ్వ స్థానంలో ఇప్పుడున్న శివ రెండ్రోజుల క్రొత్త ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తాలూకు మీటింగ్స్ కని వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ముగ్గురూ డిన్నర్ కి కలిసి వెళ్ళారు. అతనితో అంతకు క్రితం వున్న అనుభవం రీత్యా మిత్ర మాటలు ఎక్కువగా పెంచలేదు. అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానం ఇస్తూ కూర్చుంది.
"ఊ మిత్ర మొత్తానికి విశ్వని చూజ్ చేసుకున్నారన్నమాట మీ స్వయంవరంలో ..." అదేదో జోక్ లా నవ్వేస్తూ అన్నాడు శివ.
కాస్త మొహం చిట్లించి చూసి వూరుకుంది. విశ్వ ఎప్పటిమాదిరే యే భావమూ గోచరించని మొహంతో కాస్త చిరునవ్వుతో చూస్తున్నాడు.
శివ అక్కడితో ఆపలేదు.
"విశ్వ, నీకన్నా ముందు నేను మిత్రకి ప్రపోజ్ చేసాను." అన్నాడు.
ఇక అతన్ని ఆపటం అనివార్యమనిపించి "శివ, మన పరిచయం అంతవరకు వెళ్ళలేదనుకుంటాను. మీరు ప్రపోజల్ అని ప్రస్తావిస్తున్నది ఒక కాజువల్ సంభాషణ మాత్రమే." అంది చురుగ్గా అతని వంక చూస్తూ.
ఆ తర్వాత జరిగిన రెండు మూడు నిమిషాల చిన్నపాటి వాదన మిళితమైన ఆ సంభాషణని విశ్వ గమనించటమే కానీ పాలుపంచుకోలేదు.
శివ కాస్త పరుషమైన మాట అనేసాడు. ఒకచోట కలిసివున్న ఏ పెళ్ళి కాని ఆడ మగైనా ప్రేమ పేరున అలాగే దగ్గరౌతారని తేలిగ్గా అనేసాడు. ఇక అతనితో అనవసర వాదన పెంచటం ఎందుకని ఆపేసింది.
అయినా మిత్ర కి లోలోపల సంఘర్షణ. విశ్వ మౌనం మొదటిసారి బాధించింది. ప్రక్కనే వుండి తనని సమర్ధిస్తూ ఒక్కమాట అనలేదే అని. ఇంతకు మునుపు ఆశించని ఆ చర్య ఇపుడెందుకు కోరుకుంటున్నది తను?
మనసలా కకావికలంగా వుండగానే ఇంటికి చేరారు. మిత్ర ఎరుపెక్కిన మొహం చూసి విశ్వ కాస్త తటపటాయించి లోపలికి వచ్చాడు.
సోఫాలో మౌనం గా కూర్చునుండిపోయింది. లోపలికి వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి అందించాడు.
"విశ్వ! శివ అంత కుసంస్కారంగా మాట్లాడుతుంటే ఒక్కటంటే ఒక్కసారైనా జవాబీయలేదేం? నాకంటూ ఓ స్థానం ఇవ్వవా?" ఎరుపెక్కిన కళ్ళు, ముక్కుతో మాట లో బాధతో కాస్త పూడుకుపోతున్న గొంతు ద్వనించింది.
"అమ్మలు, మన సంబంధం ఇంతవరకు వస్తుందని మనమెప్పుడు అనుకోలేదు. మనమిద్దరం ఏమి అనుకుంటే అదే అవుతుంది, ఎలా అనుకుంటే అలా అవుతుంది. మనిద్దరకీ సంబందించి, నీకు నేను, నాకు నువ్వు జవాబుదారీ అంతే. నేను నీ వాడిని, నువ్వు నా దానివి , నా స్వంతం. నా జీవితంలో నీకు ఎప్పటికీ ప్రముఖ స్థానం ఉంటుంది. " అతని గొంతులో అదే నిదానం, మృదుత్వం.
దిగమ్రింగుతూ వచ్చిన బాధ ఒక్కసారిగా పెల్లుబుకింది. అతని మీద వాలి కన్నీరు మున్నీరైపోయింది. "ఈ లోకం ఇంత నిర్దయగా ఎందుకు ఆలోచిస్తుంది. ప్రేమని అలా ఎలా పలుచన చేస్తారు. ..." వెక్కిళ్ళ మధ్య అలా మాట్లాడుతూనేవుంది.
అలా పొదివి పట్టుకుని వెన్ను మీద నిమురుతూ వింటూ వుండిపోయాడు.
"ఇలా సెన్సిటివ్ గా ఆలోచిస్తే ఎలా చెప్పు?" అడిగాడు.
"మన చేతుల్లో ఏమీ లేదు కదా. నిమిత్తమాత్రులం. ఇవాళ కలిసున్నాము. రేపు ఏ కారణంగా నైనా మనం విడిపోతే నా మీద ఇంతగా నీవు ఆధారపడకూడదు. ప్రేమ అన్న భావనని అందరిలోనూ ఒకే తీరుగ ఆశించకూడదు. " విశ్వ మాటలు వింటుందే కానీ అర్థం చేసుకోవటం లోనే ఇద్దరి నడుమ చిన్న అంతరం వచ్చింది.
మిత్ర మనసు తేలిక పరచాలని ఆమె దృఢవ్యక్తిత్వం తన వలన చెక్కు చెదర కూడదని అతని అభిప్రాయం.
తన మనిషి అనుకున్న తనని అతనింకా వేరుగా చూస్తున్నాడని ఆమెలో పొడచూపిన అనుమానం.
"మిత్ర, ఒక మాట చెప్పనా? నీకు గత స్మృతులు తలపోసుకోవటం బాగా అలవాటు. అందువలనే నీలో ఆలోచనలకి అంతం వుండదు. విషయాలని ఇంతగా తరచి చూడటం మానరా అమ్మలు." విశ్వ చిరుచెమటతో తడిసిన ఆమె ముంగురులు వెనక్కి సర్ది నుదురు మీద చిన్నగా చుంబిస్తూ అన్నాడు.
"తేలిగ్గా తీసుకోవటం నాకు రాదు. " మొండిగా అంది మిత్ర.
"నేను SAP మెంటాలిటీ గలదాన్నని నువ్వేగా అన్నావు. ఇంతలో నేనెలా మారిపోతాను." ప్రశ్నించింది.
మిత్ర సెన్సిటివ్ థింకింగ్, తను ఇష్టపడ్డ వాటి పట్ల పెంచుకునే అటాచ్ మెంట్, ఆమెది అనుకున్న వ్యక్తులు, వస్తువుల పట్ల కనపరిచే పొసెసివిటీ కలిపి Sensitive Attachment Possessive [SAP] అలా అనొచ్చని అతనన్నమాట గుర్తు చేసింది.
"ఎందుకంటే నేను కూడా నీ పట్ల BAAL ఫీలవుతున్నానని నువ్వూ అన్నావుగా బంగారు. " కాస్త తేలిక పరచాలని నవ్వుతూ అన్నాడు.
అతను తనని సాప్ అన్నాడని అతను తన పట్ల కనపరిచే లక్షణాలకి మిత్ర కూర్చిన ఆక్రోనిమ్ అది. Bonding Attachment Affection Love [BAAL] వలన అతను తన ప్రేమ దైవం అనేది. నిజానికి ఒక నమ్మిక ప్రకారం ఆ పదానికి మాస్టర్/దైవం అని అర్థం వుంది.
"అందుకే నా ప్రేయసి బాధ పడ కూడదని నా ఆకాంక్ష." విశ్వ మాటలతో చెదిరిన మనసు చిక్కబడ్డట్లు కాస్త తెరిపిన పడింది.
అలాగే పట్టుకుని వుండిపోయింది. మిత్ర నిద్రలోకి జారాక నెమ్మదిగా సోఫాలోనే కంఫర్టర్ తెచ్చి సర్ది, డోర్ లోపల్నుండి లాక్ చేసి అతను వెళ్ళిపోయాడు.
*************************************************
మళ్ళీ డిశంబర్ మాసం. మంచు తన దారిన తన పని చేసుకుంటూ, మిగిలిన ప్రకృతిని తన సమ్మోహనాస్త్రాలతో లోబరుచుకుంటూ వుంది.
మిత్ర సరదాగా నాలుగు లైన్లు వ్రాసుకుంది.
"ఎండుటాకుల కసువు వూడ్చి
మంచునీళ్ల కళ్ళాపు జల్లి
ఎండా నీడల ముగ్గులేస్తున్న
కట్టు బానిస గాలి నోట విన్న పాట
'మళ్ళీ తెల్లారింది మాయ లోకమా
నాకు మాత్రం తప్పకున్నదీ వెట్టి చాకిరీ' "
ఆ రోజు మిత్రకి మరపురాని రోజు. హెల్ముట్ ఇంటి నుండి వస్తూ విశ్వ చేతుల్లో వొరిగి ఇంటికి వచ్చిన రాత్రి మాట గుర్తుకు వచ్చి తనలో అమిత గాఢానుభూతిని మిగిల్చిన ఆ జ్ఞాపకం అతనికెంత గుర్తుందో తెలుసుకోవాలనిపించి వెంటనే ఫోన్ చేసి అడిగింది.
తేదీల ప్రకారం డైరీ వ్రాసుకున్నా కానీ అమెకున్నంత వైనంగా గుర్తు వుంచుకోవటం అలవాటు లేని విశ్వకి వెంటనే తట్టలేదు. అదీకాక వృత్తిపర వత్తిడిలో వున్న అతనికి ఇతరత్రా ఆలోచనలు రాలేదు. అతనామాట నిజాయితీగానే ఒప్పుకున్నా మిత్రలో నిరాశ.
"అమ్మలు, ఆ అనుభూతి నాకూ అపురూపమే కానీ ఇలా రోజు, సమయం వివరాలతో అంటే ఎలారా?" అల్లరిగా అడిగాడు.
*************************************************
తర్వాతి వారం మిత్ర కి శరాఘాతం మాదిరి అనుభవం.
ఉదయమే అడిగింది. లంచ్ కి వెళ్దామని. కొంచం ఆలస్యమౌతుంది కానీ వచ్చి కలుస్తానని చెప్పాడు.
మధ్యాహ్నం పన్నెండున్నర నుండి చూస్తూ కూర్చుంది. నాలుగయ్యే వరకు అతని జాడ లేదు.
అప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడినా అతనికి ఈ మాట గుర్తుకు రాలేదు. తనే గుర్తు చేసి అలగాలని అనిపించలేదు. కానీ ఆ తాలూకు ఆలోచనలు ఆమెని చుట్టుముట్టేసాయి. ఈ మధ్య కాలం లో ఎందుకో ప్రతి సంఘటనలో తను నిరాశకి గురౌతుంది.
చనువు పెరిగాక తను అతనిలో లోపాలు వెదుకుతుందా? అతని పట్ల ఆశింపు పెరిగిందా? తన ప్రేమ అతనికి ప్రతిబంధకంగా మారనున్నదా? ఎందుకు అతనికి అన్నిటికన్నా అందరికన్నా తనే ముఖ్యం కావాలని మనసు మారం చేస్తుంది? ప్రేమలో తను కుంచించుకుపోతుందా? తొలినాటి ఆత్మీయత లోపించిందా తమ మధ్యన?
'విధి ఎంత చిత్రమో అంత బలీయం, కొంత కాలం క్రితం ఇతనికి నా పట్ల ప్రేమ/పెళ్ళి అభిప్రాయం ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకున్న నేను, ఇపుడు ఇతనిని వదిలి వుండగలనా అని వ్యధ పడుతున్నాను. విధి మళ్ళీ ఏం వైపరీత్యం చూపుతుందా అని బెంగ పడుతున్నాను.' స్వగతంగా అనుకుంది.
పది ప్రశ్నలు పదివేల ఆలోచనలు. అసలు ఈ మనసు తనని మోసం చేస్తుందా.
1. క్రొత్త బాటలో వెళ్తున్నానా? [తన తోడుని తాను వెదుక్కుని]
2. దారి తప్పుతున్నానా? [తన పొసెసివిటీ గురించి]
3. ప్రకృతినై జీవించగలనా? [రాగ ద్వేషాలు అంటని విధంగా]
4. సాధారణ స్త్రీగా బ్రతికేయనా? [లౌకిక పరంగా]
5. అతనిలో తను కోరుకున్న యే ప్రత్యేకత లేదా? [ స్పష్టత లేని ఆలోచన]
6. తమ అనుబంధంలో ఏది ముఖ్యం? [అతనికి తనకి వున్న అంతరాలు నిలదీస్తున్నట్లు]
7. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించనున్నాడా?
8. నన్ను శాసించాలని చూస్తాడా?
9. ముందుకు సాగనా?
10. ఆగి వెనక్కి మళ్ళనా?
ఎందుకింత ప్రశ్నార్థకమైపోయింది నా జీవితం?
తల విదిల్చి లేచి స్నానం చెసి కాసేపు ధ్యానం లో కూర్చుంది. నిర్మలీకరణ జరిగినట్లు మనసు మళ్ళీ నియమానుసారం నడుస్తున్నట్లుగా వుంది. కానీ తనలో తన ఆలోచనలను నియంత్రించుకోలేని బలహీనత ఎందుకు కలుగుతుంది. గంట క్రితం కలిగిన ఆలోచనలు స్థిరమైనవేనా? క్షణికావేశమో, బాధో కలించిన పరిణామమా?
"మసక వెలుతురు, పొగమంచు, ధూళితెర, నివురు విడివిడిగానే చిత్రాన్ని కలగాపులగం చేస్తాయి; దృష్టిని ఏమారుస్తాయి. అదీ అంతే! అన్నీ కలిసికట్టుగా కమ్మేసినట్లుగా వుంది. ఉద్వేగం ఊపిరాడనంతగా తనని వణికించేసిన విచిలితమైన ఆ స్థితి మరెన్నడూ రాకూడదనే ప్రార్దిస్థున్నాను. బహుశా నాపై అపైవాడు రువ్విన పరీక్షాపత్రం కావచ్చది." ఇలా తర్జన భర్జన పడుతూనే వుంది.
మనసు ఖాళీ చేసానెందుకు?
ఎందుకు జార్చుకున్నాను,
మనసులోని భావాలు నాలోనే దాచుకోక?
ఎవరు దాచుకున్నారు,
మరపురాని అనుభూతిగ ఎదలోపల పదిలంగా?
కొలమానం లేని, రాసిగల అక్షరాల రాశులు,
ఎవరికి లెక్కలెంచక పంచేసాను?
వెలకట్టలేని, వాసినందూ సాటిలేని కమ్మని కావ్యాలు,
ఎందుకు ఎడతెరిపిలేకుండా లిఖించేసాను?
వెలికి వచ్చినవి తిరిగి నాలోకి ఇముడ్చుకోవాలని,
వెదికి వెదికి వేసారినా జాడ తెలియకున్నదేమి?
ఉబికి వొలికి నన్ను వదిలిపోయాయేమి స్పందనలు!
వెలితి పడిన మనసు ఉసూరురంటోందేల రేయీపగలు?
నాడు ఊగిసలాడి, వేగిరపడి తృళ్ళిపడిన ఉవ్విళ్ళు,
నన్ను నేనే దోచుకుని వేడుకచూసిన సందళ్ళు.
నేడు సత్తువలేక, సాగిలపడి నిట్టూరుస్తున్న సవ్వళ్ళు,
నన్ను నేనే మరిచిన ఈ నిశీధి పయనంలో కీచురాళ్ళు.
పరి పరి విధాల సమీక్షించుకుంటే ఒకటి మాత్రం స్పష్టంగా నిలకడగా తెలిసింది. తనది మోహావేశం కాదు ప్రేమావేశం, అదీ వ్యక్తి పట్ల కాదు, ప్రేమించే మనసు కోసం, ఆ మనసులోని భావన కోసం. ముందుది కలయికలతో తీరిపోతుంది, కరిగిపోతుంది. రెండోది కాలంతో ఎదుగుతుంది, కలిసిన మనసుని కలిపేవుంచే ప్రతి దారినీ వెదుకుతుంది. తనలోని ప్రేమ విత్తు మొలకై, మొలక మొక్కై అలా మహావృక్షంలా ఎదిగిన వున్నత భావన.
ప్రశాంతంగా కూర్చుని అలా తిరిగి తిరిగి పునరావలోకనం చేసుకుంటూ అలాగే దాదాపుగా తెల్లవారే వరకు గడిపింది. మిత్ర కి అలా మనసు చెదిరిన రోజుల్లో నిద్ర మాని గడపటం అలవాటే.
ఉదయం ధ్యానం చేసుకుని విశ్వని ఉద్దేశ్యించి వ్రాసుకుందిలా...
కన్నా, నీ రాక కై ఎదురుచూపుల్లో, నిట్టూర్పుల్లో గోరువెచ్చనైన నా గుప్పిట ఈ వేకువల్లో విప్పి అందులో నా పెదవితో నీ రూపు చిత్రించి, ఆ మోమునిండా ముద్దులద్ది, తిరిగి గుప్పిట గట్టిగా మూసి నీ ద్వారంలోకి పంపాను. అవందుకుని మరి నీ తీపి తేనియలద్ది నా లెక్కకు సరి జోడుగా వెనక్కి పంపేయ్. అవే వూపిరిగా వేచివుంటాను వెయ్యిన్ని వేకువల వరకు. నా వలే మారకు, నీ ముగ్దతనం నాకిచ్చే కానుక అని మాట తీసేసుకున్నావు. అందుకే "కలలో నీవైతే కలనే వరించనా, నిన్నే కలవరించనా" అని పాడుకున్న ఆ తొలిప్రేమ నుండి, "నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జనమలో ఇక ఏ జన్మకైనా ఇలా ..." అని నా మాటలు చాలవని ఇలా అరువు పాటలు కూడా నీ నామ కోటికి అలంకారాలుగా అద్ది ఇంకేమి చేయాలో తెలియక ఇంకా చెప్పాలన్న తపన వదలక, తనివీ తీరక..
నా శక్తానుసారం ఏ రాగద్వేషాలు మన నడుమ ప్రవేశించకుండా చూస్తున్నాను. నీ నుండి నాకు, నా నుండి నీకు దైవం పట్లవుండే ఇష్టం, శ్రద్ద, ప్రేమ, భక్తి మాత్రమే పయనించాలని, ఇవే మనకి పరిణితిని కలిగించి యోగ, ధ్యాన మార్గాల్లో సంపూర్ణతని ప్రసాదించాలని నా ప్రార్థన. "
మనిషికి మనసు, మాట, ఆలోచన శాపమో, వరమో... మరపు మందో మరింత కడగళ్ళు తెచ్చే శాపమో..
[ముగింపు వచ్చే వారం]
వారం వారానికి సంక్లిష్టత పెరుగుతోంది.మిత్ర మనసులోని అనురాగపు చెలిమి చెలియ కట్టలు దాటీ కన్నీరు గా జారుతుంటే కష్టం గా వుంది చూడటానికి. మనసు మనసున కథ లు వెలికి తీసే వరకు
ReplyDeleteవెలికి తీసిన కథ ల కన్నీటి పలుకు
పైనున్న వాడికి తెలుసటే చిలకా
వెతుకుతున్న మనసు అది ఇదని తెలుపా
చెవి వొగ్గ వినుటకు మనసే సాధనం.
ప్రతి దానికి భాష వుండదు కదా.
మిత్ర మానసిక కల్లోలం చూస్తుంటే నాకే బాధగా వుంది . పాపం చాలా అలజడిగా వుంద్ . విశ్వ ఇంకెంతకాలము ఏడిపిస్తాడు ? సున్నితమైన అనుభందాలకు వికృత రూపము కలిగీంచే కుసంస్కారులైన శివ లాంటి వారికి , విశ్వ లాగా మౌనమే సంధానము ఇవ్వాలేమో !
ReplyDeleteసారీ అచ్చు పొరపాటు , సంధానం కాదు , సమాధానము .
ReplyDeleteభావన, మాలాకుమార్ గారు, పూర్తి విరుద్ద స్వాభావం వున్న రెండు మనసుల సహవాసం లో తప్పని తడబాట్లివి. పెళ్ళిపుస్తం లో ఒక పాట వుంటుంది చూడండి.
ReplyDelete“అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో…
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని…
మసకేయని పున్నమిలా మనికినింపుకో…”
ఇదీ అంతే. ఈ ప్రణయగానం లో తూలిన ఓ అపశృతి.
maree peddadaipoindandee baaboo. repochhi chaduvuthaanu
ReplyDeleteతలపులు తడబడితే
ReplyDeleteగంతులేసే లేడికూనకు
కాళ్ళకు బంధాలు పడతాయేమోనని భయాలు..
స్వేఛ్ఛగా ఎగిరే రామచిలుకకు
పంజరం బంధన మవుతుందన్న దిగులు...
ఎల్లలు లేని ఆలోచనలకు
ఎవరో అడ్డుకట్ట వేస్తారేమోనన్న వెరపు...
తనదీ అనుకున్నది
తనను గురించి చింతించటం లేదన్న గుబులు...
జరగకూడనిదేదో జరిగిపోతుందన్న భయం..
నిలబడగలనో లేదోనన్న దిగులు...
అనిశ్చితంగా అవిరామంగా అయోమయంగా
నట్టడవి మధ్యలో నిలబడినట్టు
పెనుతుఫాను హోరులో చిక్కుకున్నట్టు
నడి సంద్రంలో మునిగినట్టు
లోకంలో తనొక్కతే బాధపడుతున్నట్టు
ఎంత క్షోభ ... ఎంత వేదన...
ఓ మిత్రా...సలలిత రాగ సుధా మధురిమా..
ఎందుకమ్మా అంత బాధ? అవునులే..
నీకే కాదు ఎవరికైనా జీవితంలో ముఖ్యమైన మలుపు కి నిర్ణయం తీసుకునే ముందు ఇది సహజమే..
అందులోనూ నీవు భావుకురాలివి.. వాస్తవానికి కాస్త దూరం జరగాలనుకునేదానివి
అలాంటి నీకు మనసు, మాట. ఆలోచన వరమే కావాలని
యోగ,ధ్యాన మార్గాలో సంపూర్ణత సాధించే శక్తిని నీ కిమ్మనీ
ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను..
చాలా బాగుంది కవిత శ్రీలలిత గారు. ఎంత చక్క గా మనసులోని హోరు ను ఆవిష్కరించారో.. ఏమోయ్ ఉషా, ఇక నుంచి మన ఇద్దరం శ్రీలలిత గారి పంకాలం సరేనా..
ReplyDeleteమిత్ర మానసిక కల్లోలం కాస్త కలవరపెట్టినా, తన వ్యక్తిత్వాన్ని ఇరువురిబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే తను త్వరలో బయటపడుతుందని నమ్మకం సమాధానపరచింది.
ReplyDelete"చనువు పెరిగాక తను అతనిలో లోపాలు వెదుకుతుందా? ........ తొలినాటి ఆత్మీయత లోపించిందా తమ మధ్యన?" పరస్పర విరుద్ద స్వభావం వున్నవారేకాదు ఎటువంటి రెండు మనసుల సహవాసంలోనైనా ఈ తడబాటు తప్పదేమోనండి. ఏదో ఒక సమయంలో ఈ పేరాలో ఉన్న ప్రశ్నలు వేసుకోని ప్రేమికులు ఉండరని అనుకుంటున్నాను.
ఈ సంధర్భంగా ఎప్పుడో ఎక్కడో చదివిన ఈ లైన్లు గుర్తొస్తున్నాయ్... There will be usually 3 stages in love or relationship 1st one initial euphoric stage where you see the best in others. Then the second stage where you start noticing the differences and criticism and blaming each other will occur. చాలా జంటలు ఈ రెండవ ఫేజ్ లో విడిపోవడం జరుగుతుంది (స్వానుభవమా అని అడక్కండి ;-) And when you cross the second phase you end up appreciating the unique quality in each other and the relationship gets stronger with mutual understanding. విశ్వామిత్రల ప్రేమ ఈ మూడవ ఫేజ్ నుండి మొదలు అయింది కానీ ఎందుకో ఈ ఎపిసోడ్ లో ఒకస్టెప్ వెనకకు వేసి రెండవఫేజ్ కు వెళ్ళిందని అనిపించింది మళ్ళీ ముందుకు వచ్చి మరింత బలపడుతుంది అని ఆశిస్తున్నాను. అసలు నన్నడిగితే ఇలా జరిగితేనే ఆ బంధం దృడమౌతుంది అంటాను.
వావ్ శ్రీలలిత గారు మీ కవిత చాలా బాగుంది.
ReplyDeleteప్రియ, మరేమీ ఫర్వాలేదు.
ReplyDeleteశ్రీలలిత గారు, "తనదీ అనుకున్నది
ReplyDeleteతనను గురించి చింతించటం లేదన్న గుబులు.."
"నీవు భావుకురాలివి.. వాస్తవానికి కాస్త దూరం జరగాలనుకునేదానివి"
నిజంగానే మిత్ర మనసులోని సంక్షోభానికి కవితారూపమిచ్చారు. తన సున్నితత్వానికి, వ్యక్తిత్వానికి నడుమ సంఘర్షణ చూపటానికి నేను పడిన శ్రమకి మీరు తగ్గ ఫలితమిచ్చారు. చాలా కృతజ్ఞతలు. ఈ కష్టం పగవాడికి కూడా వద్దు అనుకుంటామే ఇదీ అంతే. నేను చాలా క్షోభపడి ఈ భాగాన్ని వ్రాసాను. నాకు నిన్న రాత్రి నిద్రే పట్టలేదు. ఒక విధంగా మిత్రలోకి పరకాయప్రవేశం చేస్తున్న నేను తననా విధంగా అలజడి పాల్జేయటం మూలాన్నేమో, ఇపుడు మిత్రని మించి బాధ పడుతున్నాను. ఒక పాత్రతో ఇంతగా అనుబంధం పెంచుకున్న నేను రచయిత్రిగా తగనని రాత్రే నిర్ణయించుకున్నాను. ఇది నా ఓటమా లేక బలహీనతా అన్నది నాకే తెలియటం లేదు. కానీ విశ్వ మనస్తత్వం మిత్రకి ఆ విధమైన అనుభవాల వలనే అవగతమౌతుందని నేను నమ్మాను. నెనర్లు.
భావన, నేను ఆవిడ అభిమానానికి పాత్రురాలనయ్యాను కనుక నీవంటి మంచి అభిమానిని ఆవిడకి సంపాదించిపెట్టాను. కాదంటావా?
ReplyDeleteవేణు, శ్రీలలితగారి కవిత నిజంగానే నా కథకి కొసమెరుపు అద్దుతుంది. నెనర్లు.
వేణు, నాకు ప్రేమ, క్షమ పట్ల ఎంతో నమ్మకం. ఇదివరలోనే ఒప్పుకున్నాను, ఈ కథలో అంతో ఇంతో స్వానుభవం జతపడుతుంది కనుక వైరుద్యాల నడుమ సమన్వయాన్ని సాధ్యం చేయగలననే విశ్వసిస్తున్నాను. కానీ ఈ గ్రహణపుదశ మాత్రం నాకు విషమపరీక్ష పెడుతుందండి. నా SAP నేచర్ ని సవాల్ చేసే ఒక ఆత్మీయునికి ఏదో నిరూపిద్దామని ఈ మలుపు తిప్పాను, ప్రతిఫలంగా మరింత SAP నా పాత్రలతో డెవలప్ చేసేకుంటున్నాను. ఈ పరిణామం నవలకి మంచిదా కాదా తెలియటం లేదు. నెనర్లు.
ReplyDeleteపాత్రలతో "శాప్ నేచుర్" మంచిదే కాని పాత్రలు రచయితను డోమినేట్ చేస్తే కధనంలో అనురక్తి తగ్గిపోతుంది...ఇది నేను కొన్ని రచయితలు స్వయంగా రాసినది చదివి తెలుసుకున్నది...నేను రచయిత్రిని కాదు కాబట్తి అమ్రి స్వానుభవమైతే లేదు..:)
ReplyDeleteవేణూ గారూ, మీరు రాసిన రెలేషన్షిప్ ఎనాలిసిస్ బాగుందండీ...ఆ రెండవ స్టేజ్ దగ్గరే చాలా రిలేషన్స్ ఆగిపోతాయి...ఏ రిలేషన్లో నైనా మనిషిలోని గ్రేటర్ క్వాలిటీస్ తో పాటూ లోపాలను కూడా సమానంగా మనం స్వీకరించగలిగినప్పుడే అది నిలుస్తుందండీ...రెండవ చెయ్యి అందివ్వకపోతే చప్పట్లు రావు కదండీ....! ultimately i feel life is too short for blaming and fighting.PEople who know this truth will enjoy life and people who ignore this truth will suffer..
తృష్ణ, మీ అభిప్రాయానికి థాంక్స్.
ReplyDeleteyet, thinking while going through a state of mind and thinking out side of the very same state differ a lot. Maturity, integrity, impulse - none these could show the complete influence on a emotional front. Mind is beyond predictability often times.
ఈ మధ్య స్త్రీ, పురుష సైకాలజీ మీద ఒక వ్యాసం చదివాను. స్త్రీ సమస్యని ముందుగానే వూహించుకునో, దాని వెలుపల నుండే గమనించో పరి పరి విధాలుగా పరిష్కారాలు వెదుక్కుని, ఆత్మీయులతో వీలైతే చర్చిమ్చుకుని మరీ సిద్దపడుతుమ్ది. కానీ తనదే తుది నిర్ణయం కనుక ఆమెకి అన్నిటికీ సంసిద్దత వస్తుంది. పురుషుడు సమస్యలో కూరుకుపోయే వరకు వాస్తవాన్ని గ్రహించకుండా, అప్పుడు కూడా తనదే కరక్ట్ అన్న అహం తో సమస్యని జటిలం చెస్తాడట. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మనలా మరొక మనిషి చెప్పినవే. ;) నా స్వానుభవం లో ఒక బాధ, కాస్త దిగులు, బెంగ తప్పని చిన్న చినా రాజీలు, ఆపై మరింత ఆనందం, ప్రశాంతత నే కనపడుతున్నాయి. "ఎంతో చిన్నది జీవితం..." అనుకుంటూ అనుభూతుల్లో అనుభవాల్లో కాలం గడిపేస్తాను. ;) కానీ శాప్ + భావుకత వలన బయటపడిపోతాను. నా కవితల ధోరణి వలన మీకీసరికి అది తెలిసే వుండాలి.
ఈ కథ మొదటి నుండి చదివి ప్రతివారం ఫీడ్ బాక్ ఇచ్చే మీ మాట నాకు చాలా ముఖ్యం.
Venu does add very critical portion of feedback on each of my works. I am indebted to him and feel fortunate about it. He puts time and effort to analyze and provide the opinion.
డాక్యుమెంటారీ లాగా ఉంది. కానీ ఏదో మ్యాజిక్ కట్టి పడేస్తోంది. చెప్పా కదా. అలిసిన మనసుకిక్కడ సాంత్వన దొరుకుతోంది. ధన్యవాదాలు
ReplyDeleteఅడ్డ గాడిద (The Ass) గారు, కారణం ఏదైతేనేమి వస్తున్నారు, మీకు నచ్చినది చదివి వెళ్తున్నారు. నా రచనకి అర్థం చేకూరుస్తున్నారు. ;) నెనర్లు.
ReplyDelete