క్రిస్మస్ సెలవలకి వెళ్ళేముందు నా తెలుగుబడి కబుర్లు!


క్రిస్మస్ సెలవలు రానున్న కారణంగా ఈ నెల కేవలం రెండు వారాలు మాత్రం క్లాసు ఇచ్చాను. మిగిలిన మూడు వారాలు పంతులమ్మ డుమ్మా కనుక నా బుడుగులూ గప్ చుప్ ;) వివిధ కారణాలతో ముగ్గురు, నలుగురైనా రాలేకపోతున్నారు. కానుకలు మాత్రం అందరికీ పదిలం. మారి నాకో? :(
వీళ్ళ కోసం అలా షాపింగ్ చేసి, గిఫ్ట్ రాప్ వేయటం నాకు అదో సంతోషం. లోపల 2010 కాలెండర్, కాండీస్, కీచెయిన్ + పెన్, పెన్సిల్, మార్కర్ వుంచాను. అన్నీ వాళ్ళకి ఉపయోగపడే వస్తువులే.

ముందుగా దశరా, దీపావళి సమయంలో నేర్పిన పండుగ, వేడుక, సంబరాలు, ఉత్సవాలు గురించి మాట్లాడాక క్రిస్మస్ ప్రస్తావన తెచ్చి, అందరినీ ఆ చర్చలో పాల్గొనేలా చేసాను. కనీసం సగం మందికి చాలా విషయాలు గుర్తున్నాయి. పైగా కళ్యాణం, అభిషేకం వంటి క్రొత్త పదాలు కూడా [మరలా కాస్త నటీంచపోతే నాకు నేర్పరు వాళ్ళు :)] చెప్పారు. ఇదొక కిటుకు, వాళ్ళకి తెలిసినవి చెప్పించటానికి కొన్నిసార్లు తప్పదు.

పదకుండు మంది నవ్వుల కాంతులే సిరి దీపాలు

Align Center ఇది నా పుత్రికా రత్నం అలంకరించిన క్రిస్మస్ ట్రీ
అల్లరికి మాత్రం అందరూ సై సై - ఒకరిని మించి ఒకరు


పగలు కూడా శోభామయమే మా ట్రీ

ఇక పాఠాల్లోకి వెళ్తే, థాంక్స్ గివింగ్ సెలవల గురించి కానీ, వాళ్లకి నచ్చిన ఏదైనా అంశం గురించి ఒక్కొక్కరితో రెండు నిమిషాలు మాట్లాడమన్నాను. భలే చెప్పారు, కొందరు భవిష్యత్ లో యూనివర్సిటీ లో పెద్ద ప్రొఫెసర్ అవుతామని, మరొకరు పేద్ద ఉద్యోగం చేస్తామని ఇలా ;)

.. గుణింతాలు వల్లె వేయించకుండా పదాలతో ఒకేసారి నేర్పాను. దాదాపుగా అన్ని శబ్దాలకీ ఏదో ఒక పదం పట్టగలుగుతున్నారిప్పుడు.

ఉదా: "క" గుణింతం:

కల, కాకి, కిస్, కీస్, కుక్క, కూర, కృష్ణ, క్రూరమృగం, కెటిల్, కేక్, కొన్ని, కోతి, కైట్, కంచం

ఇప్పుడు గుణింతాలు, వత్తులు, సంయుక్త అక్షరాలు [ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు] కూడా దాదాపుగా చెప్తున్నారు.

.. మరికొన్ని పదాలు చాలా కూలంకషగా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మారుస్తూ, వ్యాక్యాల్లో కూడా ప్రయోగించి నేర్చుకున్నాము. ఇవి మాత్రం ఉద్దండపండితులైపోయారు.

ఎవరు, ఎలా, ఎట్లా, ఏమిటి, ఏంటీ, ఏమని, ఎంత, ఎన్ని, ఎక్కడ, ఎందుకు, ఎందరు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకైనా, ఎన్నడూ, ... ఇలా చాలా సందర్భాన్ని బట్టి వాడే పదాలు.

.. లెక్కల్లో - ఒకరు, ఇద్దరు... ఏడుగురు ఇలా మొదలైన లెక్క ఎనిమిది సుమారుల్లో "ఎనిమిది మంది" కి మారటం. వంద తర్వాత నూటఒకటి కి మారటం వగైరా నేర్చాము.

ఇవి కాక ఒక మాటకో, పాటకో అభినయించటం కూడా చేసాము. అన్నీ వ్రాయను అంత ముఖ్యంగా అనిపించటం లేదు. కానీ అంతా నాకు హగ్స్ ఇచ్చి వచ్చే యేడు కలుస్తామని వెళ్ళారు.

6 comments:

  1. పాల బుగ్గల చిన్నారుల
    జోల పాటల మైమరపించి
    అల్లరి పిల్లల అమాయక మోమున
    అమ్మయై చందమామని దించి

    కలల లోక ద్వారాలు తెరిచి
    కమ్మనైన కథలు చెప్పి
    కన్ను గప్పి జ్ఞాన వృక్ష బీజాన్ని
    మమతన మనసుల నాటే
    ప్రియ నేస్తం ఈ జన్య.

    ReplyDelete
  2. మీ తెలుగు బడి కబురులు బాగున్నాయి .
    మీ చిన్నారులతో పాటు మీ ఫోటో కూడా పెడితే బాగున్డేది .
    మీ ఓపికకు జోహారులు .

    ReplyDelete
  3. మీ చిన్నారులకు ఆశీస్సులతో కొత్త సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  4. భా.రా.రె. మీ కవితకి చాలా సంతోషం. నా పిల్లలకి తెలుగు నేర్పిన పద్దతే ఇక్కడా పాటిస్తున్నాను. ఒక వినోదంగా వాళ్ళకి విద్య నేర్పాచి అన్న అభిమతం నాది. నెనర్లు.

    ReplyDelete
  5. మాలాకుమార్ గారు, మరి మీరు నా బడిలో చేరకూడదా. ఇంకొన్ని కమ్మని కబుర్లు చెప్పుకోవచ్చు. మరువం కన్నా అందమైన చిత్రమెందుకండి? ;)

    ReplyDelete
  6. జీవని గారు, నా తెలుగుబడి తరఫున కృతజ్ఞతలు. మీ జీవని విద్యాలయ విద్యార్ధులు, ఉపాధ్యాయులకి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete