వలపు దోబూచులు

ఈ గుండె ద్వీపాల్లోకి ద్వారాలు నా కళ్ళే,
అవి మూసినా తెరిచినా ఆ చూపు నీ కొరకే.

శిశిరపు గాలులు పాడే పదాలు నా ఎద రొదలే,
ఆ పదాల మాటున దాగిన వేదనలు నీ కొరకే.

మల్లియ నడిగి మంచు తెచ్చుకున్న తెలుపుకి,
సుగంధ పరిమళాలు అద్దేవి మన వలపులే.

నీ సందిట నేను చేరినా, నా మోహపు వలలో నీవు చిక్కినా,
వేడుకలు మనవే, మదనుని చిరునామా మనదే!

నీవు కప్పిన నా మేను పుష్కరస్పర్శకి పునీతమైన నది.
నా ఒడి చేరిన నీవు గంగాజలకాలాడిన పవిత్రుడివి.

నాదని నీదని ఏమీ లేదని నీకూ నాకూ తెలిసినదే,
ఎదలో ప్రేమని దాచిన ప్రతి జంట ఆడే దోబూచులివే.

23 comments:

  1. హ్మ్... మల్లియ కన్నీరు లొలికిన ఈ ఘడియ వశమై పరవశమై నీవశమవ్వక ఎక్కడికి వెళతాడు... కలకంఠి కంట కన్నీ రొలిక చూడగలడే విభుడూ.. నీదని నాదని వేరే కలదా కలసిన కంట వొలికిన ప్రేమ కన్నీరు సాక్షి గా అని పలకడా కన్నయ్య సందిట చేరిన సుగంధ పరిమళ మల్లియల తోడు గా.. :-)

    ReplyDelete
  2. చాలా బాగుంది. నేను చదివిన మీ కవితల్లో నాకులాంటి పామరులకర్థమయ్యేలా రాసిన కవిత బహుశా ఇదేనేమో. చాలా సరళమైన పదాలతో ఎంతో అర్థవంతంగా సాగింది. మీ శైలికి చాలా భిన్నంగా తోచింది. ప్రతి పాదమూ అద్భుతంగా ఉంది. అన్నిట్లోకీ నాకు

    మల్లియ నడిగి మంచు తెచ్చుకున్న తెలుపుకి,
    సుగంధ పరిమళాలు అద్దేవి మన వలపులే.

    అనే పాదం బాగా నచ్చింది. :)

    ReplyDelete
  3. ఉషాగారు పుష్కరానికి వోక్కసరే పునీత మవుతారా?

    ReplyDelete
  4. ఉష అక్క చిన్న చిన్న పదాలతో అందరికి అర్థం అయ్యేలా చాలా చక్కగా రాసారు ...

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  5. భావన, ఈ మధ్య నీ వచనాలే బాగుంటున్నాయి నాకు. ఏదో వ్రాసేసి నీతో ఇలా వ్రాయించగలిగితే భేషుగ్గా వుందంటారిక. మొత్తానికి "కన్నయ్య" పోలిక ఎక్కడో ఓ చోట పట్టేస్తావు.

    ReplyDelete
  6. సుజ్జి, సునిత, నెనర్లు.

    విశ్వప్రేమికుడు, కార్తీక్, థాంక్స్. ఇటువంటి అంశం కాస్త జాగ్రత్తగా వ్రాయాలి కదా. అందులోని సున్నితత్వం/ఫీల్ పోకుండా - ఆ కష్టం తప్పదు [నా వరకు].

    ఇకపోతే విశ్వప్రేమికుడు గారు, ఈ మాట మునుపూ విన్నానే ;) నేను రెండిటికి అనంగీకారం తెలుపుతున్నాను.
    ఒకటి - "నాకులాంటి పామరులకర్థమయ్యేలా" ఏదో సినిమాలో డైలాగ్ - నువు యూత్ ఏమిట్రా అని. అందులో ఆ యూత్ ని "పామరుడు" అని మార్చి కాస్త గౌరవార్థకం కూడా ఆ చివర కొసకి తగిలించండి.
    రెండు - సరళమైన పదాలు - నావి అదే కవితలవంటివి చాలా వరకు సరళమే. ఇది తనకి అర్థం కావాలని మా మాటల్లా వ్రాసేసా. ;)

    ReplyDelete
  7. రవిగారు, అడిగారూ, అనుకున్నాలెండి. ఆ "నది" అన్నది ఉపమానం. పుష్కరసమయంలో నదికి వుండే స్వఛ్ఛత, [విరహం, వేదన, ఇలా అనేకానేక భావాలు తొలగిన] నాయికలోను కలుగుతుందని నా భావన. ఏమో నా మనసుకి ఎప్పుడూ అదే అనుభూతి కలుగుతుంది తన సమక్షంలో. ఇది మాత్రం నిజం.

    కాదూ కూడదు - నా ప్రశ్న అది కాదు అంటే - నేను నదిలో పుష్కరస్నానం చేసి కొన్నేళ్ళు అయింది. :)

    ReplyDelete
  8. మీరు మరిన్ని పుష్కర స్నానాలు చెయ్యాలని కోరుకుంటూ మీ ముష్కరుడు .

    ReplyDelete
  9. A very nice roantic feel.

    can you plaese explain the second stanza?

    ReplyDelete
  10. రవిగారు, మీ ఆకాంక్షకి సంతోషం. ఇక్కడ మీరు మిత్రులే కానీ మరోలా భావించబడరు.

    ReplyDelete
  11. సమీర, థాంక్స్. నా వ్రాతలకి ఇంత లోతుగా అర్థాలు అడుగుతున్నారంటే మీకు భాష మీద అభిమానం కలిగిందన్న మాట. సంతోషం.

    గాలి మీద రక రకాల వర్ణనలు వుంటాయి కదా. "గాలి ఈలలు వేసేనని" "పాటల పల్లకివై ఊరేగె చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కెడ వెతకాలి" అలాగే నేను గాలి చేసే శబ్దాల్లో పదాలు/జానపదాలు/పాటలు చూపాను. అదీ ఈ శీతువులు/వింటర్ లో వీచే గాలుల్లో అదొక వేదన/నిర్వేదం ధ్వనిస్తుంది. వాటిని నా ఎద/హృదయపు రొద/సవ్వళ్ళు/వేదనలకి ఉపమానంగా వాడాను. ఆ వేదనలు తన కొరకేనని [తనకి తెలిసినా] మళ్ళీ చెప్పాను. మీకు క్రొత్త కదా, ఇక్కడ ఈ తీరున కవితలు అప్పుడప్పుడు వస్తాయి. నాకు మనసు ఆగదు/దాచుకోవటం రాదు. నా కవితలన్నిటికీ ఏదో రకంగా స్ఫూర్తి తానే. ఇందులో నాయిక నేను. నా స్వరాన దాగున్నది తాను.నెనర్లు.

    ReplyDelete
  12. బాగుంది ఉషగారు, అందరూ అన్నట్లు తే్లికైన పదాలతో చాలా బాగా రాశారు. కోట్ చేయాలని చూస్తే కవితఅంతా చేయాల్సి వస్తుందని ఊరకున్నాను. ప్రతి రెండులైన్లు దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి.

    ReplyDelete
  13. "నాదని నీదని ఏమీ లేదని నీకూ నాకూ తెలిసినదే,
    ఎదలో ప్రేమని దాచిన ప్రతి జంట ఆడే దోబూచులివి."

    నిజమే కదా

    ReplyDelete
  14. మరీ ఎక్కువైపోయిందీ మధ్య మీకు. అందుకోవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ, ఇలాగే మీరు వ్రాయాలనీ, మమ్మల్ని అలరించాలనీ, కోరుకుంటున్నాను గృష గారు

    ReplyDelete
  15. paina unna naa comments lo modati padam SPEED. aa maata miss chesi chaalaa thappu cheshaanu. Kshantahvydini. Mannimpa praarthana.

    Speed mare ekkuva ... ani vraayaalsindi. porabaatuna copy paste lo miss ayindi.

    ReplyDelete
  16. వేణు, రాఘవ్, నెనర్లు.

    సృజన, చాలా వరకు మీకు చివరి పాదం నచ్చుతుంది నేను గమనించినంతలో. నాకు కూడా చివరి పాదం నుండి పైకి/వెనక్కి వ్రాయటం అలవాటు.

    గీతాచార్య, నేను మీరన్నట్లుగానే అర్థం చేసుకున్నాను చదివిన ఫ్లోలో. థాంక్స్.

    ReplyDelete
  17. పదాలమాటున భావుకతను దారంలా అల్లుకుపోవడంలో మీకు మీరే సాటి...

    ReplyDelete
  18. ఆ భావుకత మాటున మూర్తీభవించిన ప్రేమని నా హృదయానికి లంకె వేసిన తనకు మాత్రం ఎవరూ సాటి కారు :) ఇది తన పట్ల నా విశ్వాసం అంతే. నెనర్లు.

    ReplyDelete
  19. " మల్లియ నడిగి మంచు తెచ్చుకున్న తెలుపుకి,
    సుగంధ పరిమళాలు అద్దేవి మన వలపులే " - enjoying snow fall ? or still in mood of Viswaamithra

    ReplyDelete
  20. Both. ;) Also our lake is frozen and the geese are walking in surprise. :)

    ReplyDelete