చక్రభ్రమణం

వాడు నేను ఒకసారే వచ్చుంటాం ఈ లోకంలోకి,
మాముందు మటుకు ఇంకెవరూ వచ్చినట్లు లేరు.

నేను పాలు నివు నీళ్ళవుదామంటే,

నా చిక్కని చక్కందనంలో తాను మిగలనని కామోసు,
లేదూ
కాలం మము మరిగిస్తే తానావిరై అంతరించిపోతానని,
కామోసు,
చీకటివెలుగులౌదాం అన్నాడు.

రంగులన్నీ కలేసిన తెల్ల వెలుగు నాకిచ్చాడు,
రంగూ హంగు అక్కరలేని నలుపు తానద్దుకున్నాడు.
తానెపుడూ చీకట్లో నిలుచుండి,
నను వెలుగు వలయంలోకి నెట్టివేసాడు.

చీకట్లోకి చూడలేక, తన జాడ కానరాక, నా రంగులు దాయలేక,
వెలుగులో నా నీడకి, నేనే వెరుస్తూ గడిపేసాను కాలమంతా.

ముందడుగు నీదని వెనుకుండి,
ముందుకు నెడుతూనే వున్నాడు ఇంతకాలం.
నీడలు సాగించే ఎండల్లో, వెన్నెళ్ళు పూయించే నిశిరాత్రుల్లో,
తోడులేక తల్లడిల్లితే, నీ నీడ నేకాదాని నిష్టూరమాడాడు.

సవ్వడేంలేదని వెనుతిరిగి చూస్తే వెయ్యామడలు వెనుకబడివున్నాడు.

బ్రతుకు యానంలో వాడి ముందున్నానన్నవాడే,
ఇప్పుడు వెనుదిరిగి వురుకందుకున్నాడు, విజేత తానని విర్రవీగుతున్నాడు.
మరా దిక్కు నిలవడి చూసి, తనది పై చేయిగా నే పరాజితనై తలవంచుకున్నాను.

అమ్మగా, అక్కగా ,ఆలిగా, లెక్కకురాని రూపుకొక జన్మగా రూపాంతరాలుచెందుతుంటే,
భర్తగా, బావగా, ఒకటికి రెండుగా రూపుకొక దశావతారంగా తాను తిరిగివస్తున్నాడు.

వెనకుండి వెక్కిరించి, పక్కనుండి పరాభవించి, ఇపుడు ముందున్నట్టు మిడిసిపడుతున్న,
ప్రతివాడూ ఓ మగాడే, వాడి పేరూ మగాడే!
ఇక మిగిలున్న ఆ ఒక్క పేరూ నాదే, మీరెవరూ చెప్పమని అడగనిదీ నన్నే!!
వాడు నేను వెలుగునీడల సాక్షిగా చేస్తున్నదే ఈ గెలుపు వోటమిల చక్రభ్రమణం!!!

18 comments:

  1. చాలా అర్థవంతమైన కవిత. కానీ చదవడం లో ఇబ్బందిగా ఉంది. అది ఎందుకో బొల్లోజు బాబాగారే చెప్పాలి.

    ReplyDelete
  2. నేను వ్రాద్దామనుకొన్న మాటలను మహేష్ గారు వ్రాసేసి నన్ను ఇరికించేసారు :-)
    కవిత చాలా బాగుంది.

    తప్పుగా అనుకోరనే ఈ రెండుమాటలు
    1. కవితల లైన్ బ్రేక్ లపై కొంచెం శ్రద్ద తీసుకోగలరు.

    2. నా కవితలలో కవిత్వం ఉంటుంది కానీ బ్రెవిటీ ఉండదని చాలా మంది పెద్దలు నాకు చాలా అక్షింతలు వేసారు. (రిఫరెన్స్ : నా పాత కవితల కామెంట్లు)
    ఆ అక్షింతల భారాన్ని కొంచెం ఇక్కడ దింపుకొంటున్నాను :-)

    ఒకటి మాత్రం నిజం, మనం మనసులో ఉన్న భావతీవ్రత బయటకు వచ్చేప్పుడు, ఖచ్చితంగా దానికి కావల్సిన పదాలను అదే తెచ్చుకొంటుంది.
    దానిని చదివి ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు, ఒక్క అక్షరాన్ని కూడా తొలగించటానికి, మనసొప్పుకోదు.
    బహుసా అటువంటి పరిస్థితే మీకీ కవితతో ఎదురై ఉంటుందని నా అభిప్రాయం

    అభినందనలతో

    ReplyDelete
  3. చాలా అర్ద్రమైన భావాలతో కవిత అలరారుతోంది. బావుంది అన్న మాట సరిపోదు.

    ReplyDelete
  4. నేను అనుకోడం ఇది వచనకవిత అని. దానికి లైనుబ్రేకులు వుండవు. భావాలవరద, ఆపకుండా చదివించుకుంటూ పోవడమే దాని లక్షణం అని నేను అనుకుంటున్నాను

    ReplyDelete
  5. చాలా బాగుంది. భావానికి ప్రాముఖ్యత ఇస్తే ఈ కవిత అందం బయట పడుతుంది అనిపిస్తుంది. I think this is one of your best.

    ReplyDelete
  6. బాగుందండీ, రెండవ సారి చదివాక భావం ఇంకా బాగుందనిపించింది.

    ReplyDelete
  7. ముందుగా మీ అందరకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    @ మహేష్ గారు, మీరు నన్నొక సందిగ్ధంలో పడేసారు. బాబా గారు చెప్పల్సిందేమిటానని. కాసేపు భావహీనతాదని? మరి కాసేపు మీ పరమైన శరవర్షమానని
    @ బాబా గారు, మీ రెండు మాటలు మార్గదశకాలు. అనుకునేదేముందండీ ఇందులో. కాని మీ చివరి మాటే ఇక్కడున్న వాస్తవం. నా కలం నుంచి జారే వరకే అది మాట మార్చగల మనసు, జాలువారిన ప్రతీ పదం నా బిడ్డే ఇక ఎవరిని వదిలేయమంటే ఏ తల్లి మాత్రమేమంటుంది? చూసారా ఇక్కడా నాకు బ్రెవిటీ రాలేదు.
    @ ప్రతాప్ గారు, మీరు కవిత ఆత్మలోకి తొంగిచూసారని మీ మాటే చెప్తుంది.
    @ మాలతి గారు, కొంత కాలం మీకు ఏకలవ్యగా మారిపోతే మరింత ప్రావీణ్యం వస్తుందేమో? మీ మాటతో కొండంత ధీమా, నాదీ ఓ పాతమార్గంలో నడకేనని. మళ్ళీ ఇక్కడా ఒంటరిగా కొత్త దారుల్లో వెళ్ళే పయనం కాదని.
    @ జన్య, మీ వంటి వారి స్నేహంతో వచ్చిన అందమేనది నా కవితకి
    @ వేణు గారు, నేనూ చేసే పనే అది. వ్రాసాక తిరిగి తిరిగి చదువుకుంటాను. మనం ఎపుడో తిన్న మామిడి రసాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నట్లు. వాటి రుచి ఇంకా మధురంగా తోచినట్లు. ఒక్కోసారి నేనేనా ఇలా వ్రాసాను అని మురుసుకుంటాను. ఇది కేవలం తృప్తి మాత్రమే.

    ReplyDelete
  8. నాకు చాలా చాలా బాగ నచ్చేసింది ఈ కవిత :)

    ReplyDelete
  9. ౧ పదాలు మరీ క్లుప్తంగా ఉంటే "ఆముక్తమాల్యద"లా తయారౌతాయి కవితలు. కానీ సిసలైన (అర్థం చేసుకోవడానికి) ఆలోచనామృతాన్ని అప్పుడే స్రవిస్తాయి కూడ. ఇది నా అభిప్రాయం మాత్రమే.

    ౨ "చీకట్లోకి చూడలేక, తన జాడ కానరాక, నా రంగులు దాయలేక, వెలుగులో నా నీడకి, నేనే వెరుస్తూ గడిపేసాను కాలమంతా." భలే!

    ౩ "వాడు నేను ఒకసారే వచ్చుంటాం ఈ లోకంలోకి, మాముందు మటుకు ఇంకెవరూ వచ్చినట్లు లేరు.

    అమ్మగా, అక్కగా ,ఆలిగా, లెక్కకురాని రూపుకొక జన్మగా రూపాంతరాలుచెందుతుంటే, భర్తగా, బావగా, ఒకటికి రెండుగా రూపుకొక దశావతారంగా తాను తిరిగివస్తున్నాడు."

    ప్రకృతి పురుషులనా మీ భావం?

    ReplyDelete
  10. నేస్తం! మీ మెచ్చుకోళ్ళకి అలవాటు చేసేస్తున్నారు, ఇబ్బందుల్లో పడతారు ఆనక మరి, ముందే చెప్తున్నా ;) చాలా చాలా థాంక్స్.

    రాఘవ! కొంతవరకు అదేను, కానీ నావి బౌతిక రూపాల వర్ణన కనుక స్త్రీ, పురుష బాగా వర్తిస్తాయేమో. ప్రకృతి, పురుష అనేసరికి, మరీ ఇంత ఘాటుగా విమర్శించలేం. ఇది నా అభిప్రాయం మాత్రమే.

    ReplyDelete
  11. ఉష గారూ! మీ కవితలో నాకు నచ్చిన లైనులు "బ్రతుకు యానంలో వాడి ముందున్నానన్నవాడే,
    ఇప్పుడు వెనుదిరిగి వురుకందుకున్నాడు, విజేత తానని విర్రవీగుతున్నాడు.
    మరా దిక్కు నిలవడి చూసి, తనది పై చేయిగా నే పరాజితనై తలవంచుకున్నాను."
    "చీకట్లోకి చూడలేక, తన జాడ కానరాక, నా రంగులు దాయలేక,
    వెలుగులో నా నీడకి, నేనే వెరుస్తూ గడిపేసాను కాలమంతా."

    ఇది నూటికి నూరు పాలు వాస్తవమే! మీరు ఇలాగే వ్రాయాలని నా విన్నపము.

    అమ్మగా, అక్కగా ,ఆలిగా, లెక్కకురాని రూపుకొక జన్మగా రూపాంతరాలుచెందుతుంటే,
    భర్తగా, బావగా, ఒకటికి రెండుగా రూపుకొక దశావతారంగా తాను తిరిగివస్తున్నాడు లైనులు

    ReplyDelete
  12. the above comment is given by minakshi.there are typing errors kindly overlook those things.

    ReplyDelete
  13. "భావతీవ్రత బయటకు వచ్చేప్పుడు, ఖచ్చితంగా దానికి కావల్సిన పదాలను అదే తెచ్చుకొంటుంది."
    bollOju baba gaaru samamgaa cheppaaru.

    ReplyDelete
  14. తృష్ణ, అందుకే నాకు బాబా గారి సద్విమర్శలు అంటే గౌరవం. కుండ బద్దలు గొట్టినట్లు చెప్తారు. ఇక్కడ ఇలా నన్ను సమర్థిస్తూ. మరో కవితలో నన్ను నిలదీస్తూ. ఈ పర్వంలోనే నేను ఎదుగుతున్నాను. నెనర్లు.

    ReplyDelete
  15. ఇదేంటండి.. సంవత్సరం నాటి కవితలు కూడా మాచేత చదివిస్తున్నారు? కామెంట్ చూసి లగెత్తుకొనొచ్చా.. చూస్తే పాతచింతకాయ పచ్చడి. దాని టేష్ట్ దానిదే !

    ReplyDelete
  16. అన్నట్టు పై వ్యాఖ్యలో కొస మిస్ అయ్యింది.. " ఈ నాటి సమయోచిత కవిత"

    ReplyDelete
  17. భా. రా. రె గారు, వైనం చూడకుండా పరుగెట్టుకొచ్చి ఈ అర్థ రాత్రి ఆరాలేమిటండి బాబు?;) ఫ్రిజ్ లో మిగిలిన కాసింత మా అమ్మ చేతి పాత చింతకాయ పచ్చడికి ఇపుడు కాలం చెల్లిపోయిందిక. ఆ పాపం మీదే సుమీ!

    ReplyDelete
  18. భా. రా. రె గారు, ఫి టి ఉష మాదిరి ప్రతి వ్యాఖ్య వ్రాసేసాను. సమయోచితమని అంగీకరించినందుకు ధన్యవాదాలు. నేను స్త్రీవాదిని కాను. అందుకే "అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి" లో http://maruvam.blogspot.com/2009/05/blog-post_29.html లో కూలంకషగా చర్చించాము. మీ తీరికని బట్టి వ్యాఖ్యానిస్తే సంతోషం.

    ReplyDelete