వింటున్నావా?

పున్నాగ బూరలు ఊదుతూ,
పారిజాతం రాలిపడుతూ
పరిమళం పంచిపెడుతున్నాయి-
ఆవరణ అంతా మేని పులకింతలే.

చిటారు కొమ్మన సీమచింత,
కావేసిన మావిడి పంట
నోరూరిస్తున్నాయి-
చావిడి నిండా చాపిన చేతులే.

గోడ మీదుగా లావాదేవీలు
ఇటు ముంజెలు అటుగా,
అటు మొగ్గలు ఇటుగా మారకం.

ఒప్పులకుప్ప, తొక్కుడుబిళ్ళ
ఆడనంటే చెల్లదక్కడ,
పూలజడ చెదిరితే ఒప్పుకోరిక్కడ
తేలని లెక్కల్లో తెగని ఆరాటం.

మొన్నటి ఊసులు
నిన్నటి ఆశలు
నేటి కలలు
ఏదైతేనేమి
మనుగడకి ఊపిరులు కాదా!?

కంటి కాంతులకి కొదవ లేదు:
మెరుపులు మసకేస్తే
మెరుగులు పెట్టటమే
మాగన్ను కునుకులో జోగటమే, బతుకంతా ఇకపై...

మరలు తిప్పుకుంటూ మళ్ళి పోను,
మమతలెరుగని యాంత్రికత లోకి.
ఎదురీత బారల్లో ఎద నిండా తృష్ణ పీల్చుకుంటా-
వస్తావా మరి నాతో చెయ్యీ చెయ్యీ కలిపి?

5 comments:

 1. చీకూ చింతలు లేని కాలం ...
  సీమ చింతలేరుకున్నవాళ్ళం ...
  తొక్కుడు బిళ్ళల కాలం ...
  బల్లల దరువుల తాళం ...
  వదిలేశారెందుకు మేడం
  బఠాణీలూ, జీళ్ళ పాకం ...
  కొంటానికి పావలా ఇవ్వకపోతే ఇంటిదగ్గర శోకం...

  వింటూనే జ్నప్తికొచ్చిన బాల్యం ...
  ఎప్పటిలానే మీ కవిత అమూల్యం ...

  ReplyDelete
  Replies
  1. అయ్యో అలా మరిచానేం
   సూదిలో దారం సందులో బేరం
   పప్పూ బెల్లం తియ్యని అల్లం
   పందిట్లో పానకం
   అర చేతిలోబొంగరం
   తిరణాల్లో తిరగడం
   దెయ్యానికి జడవడం
   కయ్యానికి కలబడటం ...

   ఎన్నెన్నో ...
   అన్నన్ని ...
   కదూ ...

   Delete
  2. nmraobandi గారు, మీరు తిరగతోడుకోవటం బాగుంది ;) ఇంతకీ ఒక జలనిధి ని ఒక్కసారిగా తోడి తీసుకురాగలమా, అది చెప్పండి మరి!? అలాగే ఇదీను, దప్తి గొన్న మనసుసూరుమన్నపుడు కాసింత ఓదార్పు కి ఓ దోసెడు జ్ఞప్తులు తోడి దాని మీద చిలకరించడమే నేను చేసిన పని. నెనర్లు మీరు కలిపిన గురుతులకి. తృష్ణా! థాంక్స్.

   Delete
  3. పలకరింపుల చిలకరింపులో...
   మరి చిలకరింపుల పలకరింపులో...
   తెలియదు గానండీ ...
   వాటన్నిటికీ ...
   పునర్నెనర్లు ...

   అసలు ఇవన్నీ...
   ఎప్పు ఎప్పుడియ్యో ...
   మీకెలా గుర్తుంటాయండీ ...

   అసలు జ్ఞప్తులు తోడాలంటే ...
   చల్లగా చల్లాలంటే ...
   మీ తరువాతే ఎవరైనా ...
   ప్రామిస్ ...

   Delete