వికిరణం

"నాకేమీ ఆకారాలు కనిపించలే"దన్న స్వరం లో వారింపు
"ఇప్పుడూ సవ్వళ్ళు వినిపించలేదు" ఖండింపుకి చూపు జోడి
చివరి ప్రయత్నం "అలానూ అనిపించలేదు మరి" గా మిగిలిపోయాక
ఇక గుప్పిళ్ళు విప్పాలనిపించ లేదు, 
గుండె చప్పుడు కూడా...
అక్షరాలని విభజించి 
అణుశక్తి వెలికి తీయాలంటే 
మరో ఇంద్రియం అవసరం
ఈ అసంఖ్యాక మెదళ్ళు 
ఎప్పటికీ అపరిచితమే, 
నేనొక మబ్బుకమ్మిన ఆకాశం కావచ్చు
ఆ వాస్తవ చిత్రం లో 

బావిలో కడలి హోరు, 
దేహం లో పాకే అలజడి.
గోడలకి తలబాదుకునే యోచనల అలికిడి లో-
కెరటాల మీద నీడలు తేలుతూ, 
నన్నో నిన్నో ఆకృతిగా మలుస్తుంటే
నిశ్శబ్దం రాకున్నా బాగుంది, 
ఏదో అనిపిస్తే ఇంకాస్త బాగుంది
ఆగని ఆరాటాలకి భాష్యం చెప్పాలని 
నియమం లేదు - మన నడుమ...
ఈ అసంకల్పిత ఆనందానికి ఎప్పటికీ వాహికనే, 
నీవొక చల్లని కిరణసమూహం అవుతుంటావు 
ఆశలు పొడచూపితే.

2 comments:

  1. అస్పష్ట ఆకృతులూ...
    ఇంద్రియ మధనాలూ...
    దేహపు అలజడులూ...
    యోచనల అలికిడులూ...
    ఆగని భాష్యాలూ...
    దాగని ఆరాటాలూ...
    ఆశల సమూహాలూ...
    అసంకల్పిత ఆనందాలూ...

    నీవొక నిత్య జీవన వాహినివి ...
    ధారా వాహికవు...

    ...ఈ అసంఖ్యాక మెదళ్ళు ఎప్పటికీ అపరిచితమే...
    ప్రతిష్టితం కాని ఆకారాలే ...
    ...ఇప్పుడూ సవ్వళ్ళు వినిపించలేదు...
    అ ప్రతిష్టపు ఆకారాల, అపరిచిత - మెదళ్ల - స్వరాల - సవ్వళ్ళ
    అనుసంధాన ప్రయత్నమే కదా మీ వాహన యత్నం ...

    ...నేనొక మబ్బుకమ్మిన ఆకాశం కావచ్చు ఆ వాస్తవ చిత్రం లో...
    మీదొక నిజ భావన సాకార అనియమ ప్రయత్నత ... ఈ ఆత్రం లో ...

    ReplyDelete
    Replies
    1. nmraobandi గారు, ఎప్పటి మాదిరిగానే అక్షరాలలోకి మనసుని చొప్పించి, మాటల్లో మీ స్పందనగా విడమరిచినందుకు నెనర్లు!

      Delete