నాటుకునేందుకొక నేల

గతి తప్పని కిరణాలు, తొలకరి జల్లులు కురిసిపోయాయి, 
మెత్తగా నలుగుతూ, గోరు వెచ్చని ఆవిరి కక్కుతూ మట్టినేల
వరుసలలో అంకురిస్తున్న మొలకల, అలవికానంతగా పాకిన పచ్చికల పసిరివాసనలతో.
లోలోనా దుఃఖ భూమి, దుగ్ధ విత్తులు చెల్లాచెదురుగా మొలకెత్తుతూ.
చతికిలపడి మన్ను మీదకి మోము వాల్చుకుని "అమ్మా" అన్నంతలో
గుప్పెడు గాలి బరువుగా గుండెలోకి, చప్పుడు లేని చీకటి రేఖలు దేహమంతా ఆవరిస్తూ.
మళ్ళీ వాన కురుస్తుంది కళ్ళనుంచి, పచ్చికలు ఒళ్ళు సాగదీసి చూస్తుంటే...
వేయి పంటలు వేవేల హస్తాలకి అందించిన నేల, మరిన్ని మార్లు దుక్కిపోట్లకు సిద్ధమౌతూ-
ఈ మట్టి మీద ఎందరి ఆనంద విషాదాలకి వీలునామాలు రాసిఉన్నాయో!
ఒక్కొక్క దారపు పోగు తెగుతున్న చప్పుడు నా నుంచి నాకు ప్రసారమౌతూ
ముళ్ళు విడివడిన మనసు పచ్చని పైరులా, తేలికపడ్డ పిడికెడు నిశ్వాసగా
నిటారుగా నిలుచుని అడుగులు వేస్తుంటే నీటిబుడగల నవ్వులతో "పోయి రమ్మంటూ" నా మట్టితల్లి.


2 comments:

  1. మరింత పొడిగించగల కవిత! మీ కవితార్తికి జోహార్లు.

    ReplyDelete
    Replies
    1. సి.ఉమాదేవి గారు, నా భాగ్యరేఖ ఏమంటే ఈ పొలాలు నా ఇంటి కిటికీ నుంచి కనిపిస్తాయి, కొలతకి 100 అడుగుల లోపు, లెక్కకి రెండు నిమిషాల్లోను వెళ్ళి ఆ ఒళ్ళో పడగలను. తాయిలం ఇచ్చి అవతలకి పంపే అమ్మ గుర్తొస్తుంటే తినటం అయ్యాక మారాం ఊసెత్తే బిడ్డలా ఇవతలికి వచ్చానంతే! ఎప్పుడూ వెళ్ళేది మట్టివాసన కొరకే కనుక...అదే ఉధృతిలో రాయగలనేమో చూస్తాను, నెనర్లు.

      Delete