ఓ ఇంటి ఉగాది సందడి

ఫాన్ ఆపేసి, రేడియో సౌండ్ పెంచేసి, "పిల్లలూ లెగాలిక" నూనె రాసుకున్న ఒళ్ళు, తల తో నాన్న రూపం కళ్ళు నులుముకుంటూ తెరుచుకున్న మసక చూపుకి ముందుగా అందేది. అటుగానో ఇటుగానో తలకి పెట్టుకున్న పిడపతో, ముఖానికి రాసుకున్న పసుపు వన్నెలో కుంకుమ తడితో హడావుడిగా తిరుగుతూ అమ్మ (మరి పులిహోర, బొబ్బట్లు, గారెలు, ఆవళ్ళు, పరమాన్నం...వగైరా చెయ్యొద్దూ ఒక్క చేత్తో), పెరట్లో మామ్మ (నానమ్మ) పూలమాలలు అల్లుతూ ఉండాలి తప్పనిసరిగా! ఇక తప్పక లేస్తామా, పెద్ద శిక్ష! దంతధావనం అవగానే ఎప్పుడూ "ఎత్తిన గ్లాసు దింపకుండా తాగాలి" అని వత్తిడి పెడ్తూ నాన్న ఇచ్చే వేడిపాలు దొరకవు సరి కదా, నాన్న గారే వంటికి శుభ్రంగా నూనె పట్టిస్తారు, అరగంట నానాక, తలస్నానాలు, ఉగాది పచ్చడి సన్నాహాలకి మనం సాకులు చెప్పకుండా సిద్దపడాలి (ఆకలి పేగుల సంగీతం వింటూ)! నరసింహులో, నాన్నో, నేనో వేప చెట్టు కి ఎగబాకే వానరజాతి వారసులం...క్రిందన పరిచిన తెల్లటి దుప్పటి తో మామ్మ, ఆమె కి తోడుగా అన్నయ్య, చెల్లి అపుడపుడూ అక్క...రాల్చిన పూలని ఒడుపుగా దూసి, నెమిచి, నూకలంత రేకుల వేప పూవు ఒక గిద్ద తయారు చేసేంత వరకు ఎవరూ మాట్లాడకూడదు; మామ్మ ఆర్డర్!

ఓ పక్కన పులిహోర పులుసు కలేస్తూ, గారెలు వేపుతూ, పూర్ణం పాకం పడుతూ, పాలు కాస్తూ (వంటగదిలో గాస్ స్టవ్, ఊకుండల పొయ్యి, నూతన్ స్టవ్ అన్నీ వెలుగుతూ ఉంటాయి వెలుపల ఉన్న కట్టెల పొయ్యితో పాటుగా, పక్కగా రవ్వలు చిమ్ముతున్న బాయిలర్ వెలుగు సాక్షిగా) అమ్మ చాలా నేర్పుగా కొత్త చింతపండు రసం తీసి, బెల్లం కోరి, కారం, ఉప్పు కలిపి ఆ గిన్నె ఇటు జరపగానే, "అమ్మా మామిడికాయ టెంక నాదేగా!?" నా ఆత్రం, "ఇపుడు జీడి కాయలు, ఒక కాయ నీకు దాచాలే," అమ్మ ఓదార్పు. మామ్మ వేప పూవు, చిదుముల్లా తరిగిన పుల్ల మామిడి ముక్కలు, కాసిని అరటిపళ్ళ ముక్కలు కలిపి నాన్న కి ఆ గిన్నె ఇస్తారు... కుటుంబం అంతా కలిసి పూజ చేసుకుని, ఒక్కొక్కరు ఒక వెండి గ్లాసుడు పచ్చడి తాగి (నిజానికి రకరకాల ముఖకవళికలు కావాలంటే మా ఇంటికి రండి కామెరా తో) ఇక వంట గదిలోకి వాపుగా చూపులు. వరసపెట్టి పిండి వంటల తిళ్ళు, మళ్ళీ ఉగాది పచ్చడి తాగటం, నాన్నకి మాత్రమే అర్థం అవుతూ తలూపే పంచాంగ శ్రవణం మనమూ వింటున్నట్లు నటించడం- సాయంత్రానికి మళ్ళీ మంచాల మీదకి చేరే వరకు భుక్తాయాసం! నవ్వులు, అరుపులు, తోపుళ్ళు, మూతి విరుపులు (అన్నీ తినే సరుకుల సమరం లోనే)... 

కొసమెరుపు: నా గ్లాసులో వేపపూవు నెమ్మదిగా దేవి మామ్మ గ్లాసులో పడేయటం, ఆమె నుంచి మామిడి ముక్కలు కొట్టేయటం, అమ్మ పక్కన చేరి పూలదండ అంతా నాదేనని మారం చెయ్యటం, నాన్న గారి పక్కన చేరి నాలుగు పద్యాలు అప్పజెప్పి డబ్బులు దండుకోవటం నా వంతు! బహుశా అందుకేనేమో ఇన్ని చేదు అనుభవాలు ఒక్కసారిగా తింటూ, కోయలేని పూలు పూయిస్తూ, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అప్పజెప్పి సొమ్ము గడిస్తూ- ఉగాది వేసిన బాటలో సాగుతూ ఇలా...

అందరికీ మరొక కొత్త ఉగాది వేడుక కి శుభాకాంక్షలు!

1 comment:

  1. మిత్రులకి, "జయ" నామ నూతన సంవత్సరం పేరుకి తగ్గట్టుగానే అందరికీ విజయ పరంపరలను అందించ గలదని ఆశిస్తూ, ప్రతి ఉగాదికీ మరిన్ని కలలు, ప్రతి ఉషస్సుకీ పలు వర్ణాలు, అనునిత్యం ఎన్నో యశస్సులు మీ మనో ప్రాంగణాల్లో, మీ ఆత్మీయుల జీవితాల్లో వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete