ఒట్టేసి విన్నవించుకోనా?

మరణమొక్కటే మనలను విడతీసే ఒక క్రియ ఐతే,
అది కూడా మన మధ్యన విఫలమవుతుందని, 
నల్లని చీకటినీడల చల్లనిశ్వాసల ఆయువు మీద ఒట్టేసి,
సగర్వంగా, క్లుప్తంగా చెప్పి సరిపుచ్చుతున్నా

ఎందుకంటే,

క్షణానికి క్షణానికి నడుమ నీ జ్ఞాపకమొకటి,
గతంతో కలబడి, విజేతగా నిలబడి,
నిశిరేయిలో నక్షత్రంలా,
నా చీకటి కలలకి రంగులద్దుతుందని,

స్వగతానికి నిట్టూర్పుకీ వశమయిన తలపొకటి,
ఎడబాటు కొరడా ఝుళిపిస్తే,
అమ్మ చేతి స్పర్శలా లేతాకు మెత్తని నీ నవ్వొకటి
ఎదమీద అద్దుకున్నట్లుగా ఉన్నదని,

భయాల్లో, బెంగపడే వైనాల్లో, తెలియని దిగుల్లో,
తబ్బిబ్బయ్యే ప్రతి కలత, 
ఉదయాన్ని చేరి మరుగయ్యే రాత్రివోలె, 
నీ లాలనలో, సముదాయింపులో కరిగిపోక తప్పదని...

ఇన్ని చెప్పేకన్నా, 

ఆ ఒక్క "పర్యాయ పాదం" చాలని,
మురిసిన మనసు ముందుగా ఆ ఊసే విప్పేసింది.

2 comments:


 1. ఏమిటండీ మరువం గారు,

  ఈ మధ్య మరీ మీరు మరణం మీద 'రణం' సాగిస్తున్నారు !?

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అవునండి జిలేబీ గారు, కలం లో ఈ సిరా ఎందుకు నింపబడిందో, గడిచిన గతానికో, నడుస్తున్న ఈ కాలానికో తెలియాలి మరి! వద్దన్నపుడు వచ్చి, రమ్మన్నప్పుడు దాగొనే మహమ్మారి కనుక యుధ్ధ సన్నాహవేళ నిలవరిస్తున్నానేమో, అంతిమ రణాన నెగ్గలేకపోయినా... ;)

   Delete