ప్రస్థానభేరి

పదాల కట్టలు పదిలంగా-
నారుమళ్ళలో ఊడ్పులంత శ్రద్ధగా
విడదీసి భావాల మళ్ళలో గుచ్చుతావు.

"తెగి రక్తమోడే వేలిని అదిమిపట్టినట్లుగానే, 
ఇలాగే,
ఈ గాయపడిన లోపలి మనిషిని ఒడిసిపట్టగలిగితే

అన్నపు పొంగు మీద జల్లిమూకుడు మూసి,
కుండలో మెతుకు పోకుండా 
ఒడుపుగా గంజివార్చినట్లు,

వెల్లువౌతున్న వేదనకి మరొక మనసు మూత ఉంటే,
బండబారకుండా
కోలుకునేలా బాసట గా నిలిస్తే బాగుంటుంది"

మెదడు కి మాట అప్పగిస్తే 
పెదాల గట్లు దాటి జారే పలుకులవి.
వెలుపలి పొరల్లో మనిషితనం ఇంతే!
యాంత్రికత లో అబ్బిన వస్తుగుణం ఇదే కదు?!

గుండె కి గుట్టు నేర్పగలిగితే- 
నిన్ను నువ్వు వినటం,
ఊరడించడం సాధించగలిగితే...

నీవే ప్రకృతి అవుతావు
లయమౌతూ, సృజించబడతావు

శ్రుతి చేసుకుని జీవనగానం పాడుతావు
నీలోని వేవేల విధులలో నిమగ్నమౌతావు

బాగుం/టుం/ది ఊహ, కానీ

చెదిరి బద్దలైన గుండెని,
బెదిరి చిన్నాభిన్నమైన 'నేను' లనీ
వెదికి తీసుకురావాలి

గాలికి, నీటికీ నడుమ నిష్పత్తిలా,
నేలకి, నింగికి మధ్య ముడిలా
నియమాలు నేర్పుకోవాలి,
నిలిచి ఉండటం అలవరచుకోవాలి.

కూడలి కి చేరితే ఎపుడూ ఇంతే-
దారీతెన్నూ తెలీనట్లే, 
నాలుగు దిక్కులూ పిలుస్తున్నా...

యంత్రఖచిత వనాల్లో
అనాధగా అలమటించనా?

నిరంతర వాహిని లో
సింధువునై తరించనా?

పిపాసతో బ్రతుకు స్వరాలు
సర్పాల్లా బుసకొడుతున్నాయి

సరళమైన రచన రాసుకోవాలి
నేను జీవించాలి
ఒక 'నేను' జీవచ్ఛవమైతే
పది 'నేను' ల కాంక్షతో రగలాలి

బతుకు యాగానికి 'నేను' సమిధనవ్వాలి

ఇంతకీ 'నేను' /మిగిలి/ఉన్నానా,
ఉన్నానన్న భ్రమలో ఉన్నానా!? 
అంతిమ ప్రస్థానం వరకు యింతేనా,
చివరకు మిగిలేది యిదేనా...

27/03/14

6 comments:

  1. ...వెల్లువౌతున్న వేదనకి మరొక మనసు మూత ఉంటే,
    బండబారకుండాకోలుకునేలా బాసట గా నిలిస్తే...
    ...మెదడు కి మాట అప్పగిస్తే
    పెదాల గట్లు దాటి జారే పలుకులవి.
    వెలుపలి పొరల్లో మనిషితనం ఇంతే...

    ...గుండె కి గుట్టు నేర్పగలిగితే-
    నిన్ను నువ్వు వినటం,
    ఊరడించడం సాధించగలిగితే...

    ...కూడలి కి చేరితే ఎపుడూ ఇంతే-
    దారీతెన్నూ తెలీనట్లే,
    నాలుగు దిక్కులూ పిలుస్తున్నా...

    ఏ దిక్కూ కలవనట్లే...



    ...ఇంతకీ 'నేను' /మిగిలి/ఉన్నానా,
    ఉన్నానన్న భ్రమలో ఉన్నానా!? ...

    how very incidental?

    ఉన్నా...నా...?

    అని నేను కూడా వ్రాసి...
    తుది మార్పులు చేర్పులు దశలో వున్నా...
    ఇంతలో...మీరిలా...

    of course ...
    నేను 'నేను' వరకే పరిమితం అనుకోండి...
    మీ అంత విశాల పరిధి లోకి విస్తరించి...
    తొంగి చూడకుండా... చూసేంత దృష్టి "కూడా" కరువై...

    అక్కడెక్కడో మీరన్నారు...
    మీరు "కూడా" రాస్తారుగా అని...

    అవును ...
    దొరికిన ముడిపదార్దానికి మేము...సారీ...నేను
    పెట్టేవి గాట్లయితే మీరు అదే పదార్ధాన్ని శిల్పంగా
    మలుస్తారు...మారుస్తారు...

    అంతే తేడా...

    ఆత్మీయ నమస్సులు...

    ReplyDelete
    Replies
    1. nmraobandi గారు, >> ఆత్మీయ నమస్సులు...<< అవి మాత్రం వద్దు, ఆ గౌరవం కొందరికే అట్టిపెట్టుకోండి. మాటల మీదుగా ఆపాదించవద్దు, స్వానుభవం తొ చెప్తున్నాను. మనిషికి మాట, చేతలకి చాలా అంతరం ఉంటుంది. రాత/ల/ల్లో/ మనుషులని అస్సలుకి నమ్మద్దు నాతో సహా! Other than that- ఇంత చిక్కని భావనకి ఏదో ఒక సమాధానం రాయలేక, అలాగనీ మౌనంగా ఉండలేక- నెనర్లు! ఏకాంతం లో ప్రవాహమై సాగినా, గడ్డకట్టి నిలిచినా మన మనసు మనకి పూర్తిగా వినవస్తుంది, వినిపిస్తుంది కూడా!!!

      Delete
    2. మేడం గారు...
      ఇక్కడ 'స్వచ్చ'మైన అర్ధం లోనే...

      Proper : आत्मीय , निजी , स्वच्छ : aatmeeya , aatmeeya , svachh
      (http://hamariweb.com/dictionaries/proper_hindi-meanings.aspx)


      ...... "ఆలేరులో చంద్రబాబుకు కార్యకర్తల ఆత్మీయ స్వాగతం"
      (http://www.ap7am.com/ap7am-flashnews-view.php?id=35913)

      ......"జయలక్షికి ఆత్మీయ సన్మానం"
      (http://www.andhrajyothy.com/node/80844)


      స్వానుభవ పూర్వకమైనప్పుడు...
      పెద్దలు, తప్పక మీ మాట వినాలి...
      కేవలం అపోహలు అపార్ధాలు
      ఉండకూడదనే పై references...
      ____//\\____

      Delete
    3. nmraobandi గారు, సరేనండి, ఇంత వివరణ అవసరం లేదు, ఈ కొద్దిపాటి సాహితీ కరచాలనం వంటి స్నేహితానికి. నేను అన్నది ఆ "నమస్సులు" అన్నవి వద్దు అని! పెద్ద/చిన్న అన్న వయోభావం నేను పాటించను, నా వరకు "గారు" "నమస్సులు" వంటివి "గారు" అనేవి ఒక మనిషి సామర్థ్యానికి, చేసే పనులకు, నడవడికకిచ్చే గౌరవం. రాతలదేముంది కలం, నోరు/చెయ్యి ఉన్న వారంతా చేయగల పనే కాస్త సాధన పెడితే! మానసిక బలిమిని, ఉత్సుకత ని నమ్మి అభిమానించినంతగా బలహీనమైన బాహ్య కొలతలు వయసులు, ఆస్తులు, మరొకటి మరొకటి లెక్కలు నాకెక్కవు

      సందర్భం కనుక ఈ ప్రస్తావన: ఎన్నటికీ మనల్ని వీడని స్థిరమైన మైత్రి సాహిత్యం. అదే శాశ్వతానందం మృత్యువు దాకా. మంచి సాహిత్యాన్ని గుర్తించి ఆ అనుభవం/అనుభూతి మిగుల్చుకోవాలంటే ఒక మార్గం పఠనం, అది పుస్తకం, బ్లాగు, మరే ఇతరత్రా ఆన్లైన్ సోర్స్ అయినా గానీ...నేను రచయితలు, కవులు కూడా జొరబడని కేవలం నా పఠనా లోకం లోనే మెసులుతాను. మీకో అదే సూచించాను-

      Delete
    4. ma'm...

      it seems the chord went twined
      somewhere in the line...

      ...ఆ "నమస్సులు" అన్నవి వద్దు అని...
      ...i failed to read the meaning earlier...

      ...చూసేంత దృష్టి "కూడా" కరువై...
      (చూశారా, నా లైన్ నాకే అక్కరకు వచ్చింది...)
      the oversight may be condoned...

      nevertheless, the regard and the
      admiration never withers...

      friends...

      Delete
  2. అంతే తేడా...
    ...Perhaps nothing more than that distant variation...

    ReplyDelete