ప్రవాస పునాదులు

"ప్రవాసం" అంటే అనాధారిత ప్రతిపాదనలు,
తుడవలేని అపోహలే కొన్ని మెదడు కొలతల్లో-

పాదమిడిన ఉత్తర క్షణమే
పట్టుపానుపుల పవళింపులని
పాలరాతి మేడల నివాసమని
ఎడతెరిపిలేక కురిసే కాసులని
కడగండ్లు చొరని కాపురాలని:

సగ జీవితం గడిపిన దేశాంతర వాసపు
కథ కాని కథ- అనుభవాలే ఆత్మకథలు కాదా?
నిరుద్యోగ భత్యపుయాచన తో మొదలైన యాత్ర ఇది!
తొలినాళ్ళలో, తబ్బిబ్బయ్యే మనసుతో
తడబడే ఉఛ్చారణతో, తెలియని భయాలతో
కట్టుబొట్టు లో అమిరీఅమరని అసౌకర్యంలో
తెగిపడిన జ్ఞాపకాల చిట్టాలివి

యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా
నోరెండిన పసి బిడ్డని చంకనేసుకుని
గుక్కెడు నీటికి అర్రులు చాస్తే
"Dollar a bottle" అంటూ దాహపు వెల కట్టిన నేలలో
నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను

అర్థరాత్రి నిద్రకొరిగిన ప్రపంచంలో
నిర్జనమైన రైలుస్టేషనులో, చేతిలో సొమ్మున్నా
చిల్లర ఇవ్వ/లే/ని యంత్రపర నిబంధనతో
ఎటూ తోచని విధిలో, అపరిచితుని వెదుక్కుని
"do you have 2 dollars" అన్నదానికి
అర్థాంతరం ఉన్నదని, అది యాచకుల ఊతపదమని
దినపత్రిక వెనుగ్గా వినవచ్చిన విసుగు,
ఎగిరొచ్చిపడిన డాలరు కాసుతో నిర్విచేష్టురాలినయ్యాను

అమ్మ ఉత్తరమో, ఉద్యోగ ప్రకటనలో రావాలని
అర్రులు చాస్తే, పేపరు కట్టలు వేలు వస్తాయి:
మెయిల్ బాక్సుల్లో కొత్త ఉత్పత్తుల వార్తలు,
ఊరి వారి వేడుకల వార్తలు మోస్తూ.
'ఇంతంత కాగితపు అచ్చువేత కి ఎక్కడిదయ్యా సొమ్ము?'
"Junk Mail" అని చెత్తకుప్పల్లోకి విసిరిపడే శ్రమ నష్టం బేరీజు వేసాను

అందుకే ఎవరు వీసా వచ్చిందని వార్త పంపినా
రెండుమాటలతో కార్డుముక్క రాసిపడేసేదాన్ని అప్పట్లో,
డాలర్ పైన పోస్టల్ స్టాంప్ అతికించి మరీ!
"నీళ్ళు కొనుక్కోవాలి రా అబ్బీ,
చిల్లర మార్చుకుని వెంట ఉంచుకోవాలి సుమీ!!!" అంటో
"నీ చిరునామాకి ఎక్కువగా వచ్చి చేరేది నీకక్కరలేని వార్తలేనని" కలుపుతూ-

(1994 అనుభవాల నుంచి)

4 comments:

  1. Replies
    1. Thanks...but none are hilarious then or now though Mr. Krishna Palakollu!

      Delete
  2. ...సగ జీవితం గడిపిన దేశాంతర వాసపు
    కథ కాని కథ...
    అనుభవాలే ఆత్మకథలు కాదా?
    నిరుద్యోగ భత్యపుయాచన తో మొదలైన యాత్ర ఇది!

    యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా...
    నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను...

    అర్థాంతరం ఉన్నదని...
    అది యాచకుల ఊతపదమని...
    దినపత్రిక వెనుగ్గా వినవచ్చిన విసుగు ---


    అనుభవాలా ఇవి...
    నిక్షిప్త, ఉపలబ్ధ చరిత్ర ఇది...

    ఆర్ద్రత సాంద్రత అంతుబట్టని
    ఓ తల్లి వ్యధా హృది...

    భావి ప్రవాసార్తుల
    దిశా కిరణ పాఠ్యమిది...

    బరువెక్కిన మది
    మనస్ఫూర్తి వందనమిది...


    ReplyDelete
    Replies
    1. nmraobandi గారు, మీ దయార్ద్ర హృదయ స్పందనకి నెనర్లు! ఈ నిజ జీవితానుభవం తలిచిన ఏ క్షణాన్నైనా తిరిగి అంతే వేదన చెందేంతగా మిగిలిన జ్ఞాపకాలు! నీళ్ల సీసా దాదాపుగా నోటి నుంచి లాగి వెనక్కి ఇచ్చేయటం వలన (అప్పటికి ఆ దేశం వెళ్లి వారమే కావటం, వేసవి సమయం, నాకు తెలీక చేతిలో డాలర్ లేకుండా బిడ్డ నెత్తుకుని దాదాపుగా 2 కి.మీ. నడిచేయటం వలన నిస్సత్తువ తో పాటుగా) దప్పిగొన్న పిల్లాడు పళ్ళుగిట్టకరిచి ఏడుస్తూ నా భుజాన్ని రక్తం వచ్చేలా కొరకటం తో తిరిగి వచ్చే 2 కి.మీ. పళ్ళబిగువునా బాధ భరిస్తూ రావటం; నా మీదకి డబ్బు విసిరినతనికి మర్యాదగా యాచాకురాలిని కానని నేను నా వద్దనున్న 2 డాలర్లకి విడివిడిగా డాలర్ బిళ్ళల చిల్లర అడిగేనని వివరం చెప్పాక అతనెంతగానో నొచ్చుకుని క్షమాపణ కోరటం వంటి చిన్న చిన్న పాఠాలు మొదలుకుని మన దేశస్తులే నమ్మకద్రోహం చేసిన గుణపాఠాల వరకు చాలానే ఉన్నాయి కట్టడాలు from 20yrs of constrction...ప్రవాసులే కాదు, స్వదేశాన ఉన్నవారూ మోసగిచ్చారు అది వేరే బాణీ అయినాను! లోకం తీరు పలురకాలుగా పరిచితమైన చిట్టా ఈ జీవితం!

      Delete