ఆ నాన్న కూతురు!!!

నాన్న చెప్పిన పాఠం నిత్య పారాయణం,
తిథి వారాలు ఎంచని ప్రతి పనిలో అదే కొలువు.
ఆ పాఠం స్వయంకృషి.

నాన్న నేర్పిన పాట నా నోట పలికింది,

కోటి గళాలై శతకోటి స్వరాలై.
ఆ భావం ఆశయసాధన.

నాన్న వేసిన బాట నాకు చెప్పింది,
పోటి పడినా వోటమి ఎదురైనా ఆగకని.
ఆ మార్గం స్థిరసంకల్పం.

నాన్న అనుభవం ఆస్తిలో నా వాటా,
ఆటుపోటు తప్పని బ్రతుకున అదే ఆలంబన.
ఆ ధనం స్వాభిమానం.

నాన్న చెప్పిన మాట జేగంట,
గుడి కాని గుడి నా గుండెలో గణగణ.
ఆ రాగం అనురాగం.

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం.

27 comments:

  1. Good one, I think this is on the occasion of Father's Day :-)

    ~sUryuDu :-)

    ReplyDelete
  2. నాన్న గారు చెప్పిన పాఠం,పాడిన పాట,నడచిన బాట,ఆయనిచ్చిన వాటా, చెప్పిన మాటలు బాగున్నాయి

    ReplyDelete
  3. చా... బొమ్మరిల్లు భాస్కర్ కి చెప్పుంటే మిమ్మల్ని అపహాస్యం చేస్తాడని సలహా పారేద్దామనుకున్నా... అంతలో పై వ్యాఖ్యల ద్వారా "పితృ దినోత్సవం" అని తెలిసి నోరు కట్టేసుకున్నా...
    ===
    బాగుందండి. నాన్నే నా హీరో అనని పిల్లలుంటారా? నాన్న చూపేది చెప్పేది అవి మాత్రమే కాదు,
    స్నేహానికి కొత్త నిర్వచనమివ్వడం
    చేసే ప్రతీ అల్లరికీ ఆనందిస్తూ స్ఫూర్తి నింపడం
    మనలో నమ్మకమే కోల్పోయిన నాడు ఆత్మవిశ్వాసం నింపడం
    తను పక్కనుంటే మన తోడు వెయ్యి ఏనుగుల బలం.

    ReplyDelete
  4. ప్రంపంచంలోని అందరు నాన్నలు!!!! "హాపీ ఫాదర్స్ డే". నా పెద్దలు పరిచయం చేసిన మన పండుగలు, ఇక్కడ పెరిగే నా పిల్లలతో కలిసి ఈ క్రొత్త సంబరాలు. సందర్భం ఏదైనా కానీ వేడుక కదా ముఖ్యం. అందుకే "ఫాదర్స్ డే" ని పురస్కరించుకుని నాన్నగార్లకి ఇది నా పాధాబివందనం.

    * సూర్యుడు గారు, అతి శీఘ్రంగా వ్యాఖ్య వ్రాసి సందర్భం వూహించినందుకు, నా కవిత మెచ్చినందుకు సంతోషం.

    * బ్లాగ్ చిచ్చు - మీకు కూడా ఒకవేళ మీరింకా అర్హులు కాకపోతే అర్హులైన మీవారికి నా తరఫున అభినందనలు అందించండి. నెనర్లు.

    * వేణు గారు, బహుకాల దర్శనం. అక్కడి జీవితానికి అలవడినట్లే అని మీ బ్లాగులో మునుపటి వాతావరణం చెప్పకనే చెపుతుంది. మరువాన్ని పలుకరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఉష గారు,
    ఎంత బాగా రాసారండి.అలా రాయటము రాక ఎవరో రాసినవి పెట్టుకొని ఆనందించాను.
    హాపీ ఫాదర్స్ డే

    ReplyDelete
  6. * చిలమకూరు విజయమోహన్, నిజమండి నేను నాన్నగారి ప్రభావంలో పెరిగినదాన్నే. నేను నాన్నగారి పోలికల్లో, గుణగణాల్లో ఎక్కువగా ఆయనవే పుణికిపుచ్చుకున్నాను. అందరికీ తెలిసిపోయేంతగా బయట పడిపోయేవారు. ఇప్పటికీ ఉషడు [నేను మగరాయుడిలా గంతులేసేదాన్నని అలా పిలిచేవారు] అని ఏవేవో చెప్తూనే వుంటారు. పోయినేడు నేను అక్కడికి వచ్చినపుడు, అంతకు మునుపు తను ఇక్కడికి వచ్చినపుడు ఇంకా చిన్నప్పటి మాదిరే చూసుకున్నారు, నేను నా పిల్లల వెంట ఆయన నా వెంటాను. 6సం. క్రితం అమ్మ వెళ్ళిపోయారు, ఈయన ఒంటరి అయిపోయారు. అన్ని వివరాలు మరో వ్యాఖ్యగా వ్రాస్తాను.

    ReplyDelete
  7. ఉష గారు,,
    నా కమ్మటి కలలో పలకరించిందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  8. miiku mii naanna gaaru ichchina strii dhanam sadaa kaankshaniiyamaina dhanam!

    ReplyDelete
  9. చాలా.. చాలా .. బాగా వ్రాశారండి.
    తల్లి లేని బిడ్డల్ని చూసి జాలి పడతారు. కాని తండ్రి లేని బిడ్డల్ని గౌరవించరు. మాటల తూటాల్తో బలి చేస్తారు.
    నాన్న బిడ్డల చుట్టూ గీసిన ఒక రక్షణ రేఖ. ఆ రేఖ లేని వార్కి దాని విలువ బహు బాగా తెలుస్తుంది.

    ReplyDelete
  10. ఉష గారు,నేనూ నాన్న కూతుర్నే !అమ్మ కంటే ఒకింత నాన్నగారిమీదే ప్రేమెక్కువ . పితృ దినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  11. ఉష గారు ,నిజమే మన వాళ్లకి పోలికలున్నాయి ...మీరు చెప్పినవి నాకు స్వాంతన . మీ నాన్న గారికి అభినందనలు .

    ReplyDelete
  12. ఉషగారూ అమ్మ నిజం నాన్న నమ్మకం అంటూ సినెమా డైలాగులు చెప్పే వాల్లకు మంచి గుణపాఠం మీ కవిత. అందులో ఇద్దర్నీ అవమానిస్తున్నమన్న జ్ఞాణం లేకుండా ఆ వాక్యం విని నవ్వుకున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది. నిన్న ఎదో ఈటీవి2 ప్రోగ్రాంలో కూడా ఈ డైలాగు ఒకాయన చెప్పగా విని నాకు మూడాఫ్ అయింది. ఇప్పుడు మీ కవిత చూడగానే మనసంతా పులకించింది. నేను మైఇల్ క్రిఏట్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నల్లో మీ హీరో అన్న దగ్గర మా నాన్నగారు అని రాసేవాడ్ని . ధన్యవాదాలండి. ఉషగారూ అమ్మ నిజం నాన్న నమ్మకం అంటూ సినెమా డైలాగులు చెప్పే వాల్లకు మంచి గుణపాఠం మీ కవిత. అందులో ఇద్దర్నీ అవమానిస్తున్నమన్న జ్ఞాణం లేకుండా ఆ వాక్యం విని నవ్వుకున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది. నిన్న ఎదో ఈటీవి2 ప్రోగ్రాంలో కూడా ఈ డైలాగు ఒకాయన చెప్పగా విని నాకు మూడాఫ్ అయింది. ఇప్పుడు మీ కవిత చూడగానే మనసంతా పులకించింది. నేను మైఇల్ క్రిఏట్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నల్లో మీ హీరో అన్న దగ్గర మా నాన్నగారు అని రాసేవాడ్ని . ధన్యవాదాలండి.

    ReplyDelete
  13. * మాలా కుమార్ గారు, అనుభవజ్ఞులు, మీరు మెచ్చటం నాకు మంచి కితాబు.

    * అశ్వినిశ్రీ, నాకు అదే ధీమా, సదా ఆ అభిమానధనం నన్ను తలెత్తి జీవించేలా చేస్తుంది.

    ReplyDelete
  14. * జాహ్నవి, మీరు అభిప్రాయపడ్డట్టే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు కూడా తన టపా http://naasaahityam.blogspot.com/2009/06/blog-post.html లో వ్యక్తం చేసారు. మీరు చూసివుంటే సరే, లేకపోతే చూడండి, నాకు చాలా నచ్చింది.

    ReplyDelete
  15. * పరిమళం, చిన్ని, మనం ముగ్గురం నాన్న కూతుర్లుం అన్నమాట! చిన్ని మా నాన్నగారి మీద పెడ్తున్న వ్యాఖ్య చూడండి, బహుశా మరి కొన్ని పోలికలు దొరకొచ్చు.

    ReplyDelete
  16. * వర్మ గారు, మీ అభిప్రాయమే నాదీను. ఇద్దరూ సంతానం విషయంలో సమవుజ్జీలే. ఇద్దరూ మార్గదర్శకులే. నాకు కూడా నా role model మా నాన్న గారే. మరో వ్యాఖ్యలో వివరంగా వ్రాస్తున్నాను. మీ అభిప్రాయాల్లో ఒక విలక్షణత వుంది. ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మీ తల్లితండ్రుల పాత్ర చాలా బలమైనదైవుండాలి.

    ReplyDelete
  17. * ప్రదీప్, బొమ్మరిల్లు భాస్కర్ కి నన్ను అపహాస్యం చేయటానికి గల అర్హతలు ఏమిటో తెలియలేదు ;) తరాల మధ్య అంతరాలు సహజం. దాన్ని ప్రత్యేకించి అంతగా చిత్రీకరించటం నాకు నచ్చలేదు. మా నాన్నగార్ని ఎంత అభిమానిస్తానో అంతే నిశితంగా విమర్శించగల స్వేఛ్ఛా ఇచ్చారు. మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రం నాకూ చాలా నచ్చింది. ముందే చెప్పాను, వేడుక అని ఈ రోజు తిరిగి మననం చేసుకోవటమే కానీ ఆ భయం, భక్తి, ప్రేమ, గౌరవం ఒక రోజు వచ్చిపోయేవి కావు. నెనర్లు.

    ReplyDelete
  18. @ఉష గారు,
    బొమ్మరిల్లు భాస్కర్ "నాన్నగారు చెప్పారండీ" అంటూ పెద్ద సెటైర్ వేస్తాడని నా ఉద్దేశమన్నమాట. ఇక మలి వ్యాఖ్యలో మీరు రాసిన ఆ విషయాలు ఇంకా చదవలేదు. ప్రస్థుతానికి అలసిపోయి ఉన్నా. మళ్ళీ వచ్చి చదువుతా..

    ReplyDelete
  19. * ప్రదీప్, అంత వివరణ ఆవసరం లేద్సండి. అపహాస్యం కన్నా చమత్కరిస్తాడు అనంటే నేనలా అడిగేదాన్ని కాదేమో. నాకు అపహాస్యం అన్నది మా నాన్నగార్ని అవమానించటంగా తోచింది. తండ్రి సంరక్షణ లేనిదే, తల్లి త్యాగం చూడనిదే మనమింత వారంకాలేము కదా. చిన్నది కానీండి, పెద్దది కానీండి అవసరం అన్న తక్షణం హద్దెరగక పరుగిడివచ్చేది నాన్న కాదా? ఆవకాయ ముక్క దగ్గరనుంచి, అరెకరం పొలం వరకు అడిగింది కాదననిది అమ్మ కాదా? ఎవరి అమ్మ నాన్నా వారికి గొప్ప, వారికి వారి సంతానం ఇంకా గొప్ప ప్రీతిపాత్రులు. ఇక వదిలేద్దాం అండి ఈ విషయాన్ని.

    ReplyDelete
  20. ఉష గారు అచ్చు మీ నాన్న గారు మా నాన్న ఒక్కటే ,మా నాన్న ఉద్యోగం లో దుర్వాసుడు,చండ శాసనుడు ,మా నాన్న చదువు ఇంజనీర్ ,ఆయన చదువు రైలు కట్ట వెంట పడి వెళ్తే నాలుగు మైళ్ళు దూరం ,సరైన ట్రాన్స్పోర్ట్ లేక మైళ్ళు మైళ్ళు నడిచిన వైనం ,నాన్న పని చేసింది రవాణా శాఖ ...అమ్మ వాళ్ళు అచ్చు మీ అమ్మావాళ్ళు లానే బాగా ఆస్తిపరులు ...భలే పోలికలండీ ....!

    ReplyDelete
  21. network connection problem తో "నాలో నేను" సుజ్జీ పంపలేకపోయిన వ్యాఖ్య. నాకు చాలా నచ్చిన ముచ్చటైన మాటలు.

    ur new poem is awesome, it sounds "truth of the emotion"

    ReplyDelete
  22. ఉష గారూ,
    అద్భుతం.. ఎంతంటే చెప్పలేను. మీరు రాసిన ప్రతీ అక్షరంలో నాక్కూడా మా నాన్న కనిపించారు.
    "నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
    అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
    ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం."
    ఈ వాక్యాలు చదవగానే నా కళ్ళు చెమర్చాయంటే నమ్ముతారా.?
    మనసులో ఉన్న ప్రేమని మాటల రూపంలో చెప్పడం ఒక పెద్ద కళ అనడానికి ఈ మీ కవితే ఉదాహరణ.
    మీ నాన్న గారికి చూపించారా మరి?
    నేనింకా వ్యాఖ్యలన్నీ చదవలేదు. ప్రస్తుతానికి కవితానుభూతి వల్ల కలిగిన ఆనందంలోనే తేలుతున్నా.
    మళ్ళీ వస్తా..!

    ReplyDelete
  23. అయ్యో నా ఉద్దేశ్యం అది కానే కాదు, ఎలా అవమానిస్తాను ? అలాంటి ఆలోచనే లేదు, రాదు.
    చాలా బాగున్నాయి మీ నాన్న గారి కబుర్లు. నేను గత ఆరునెలలుగా ఒక సంకలనం గురించి ఆలోచిస్తున్నాను. ఆ సంకలనం పేరు "మా నాన్న చెప్పిన కధలు". ఇది ప్రతీ ఒక్కరూ రాయగలరు. మీరు ఇప్పుడు రాసినవి కొంచెం మార్చి, కొంచెం కలిపి ఆ సంకలనం గా అచ్చు వెయ్యచ్చేమో.
    గమనిక: నేను ఇంత వరకు మొదలుపెట్టలేదు. బహుశా నేను ఇండియా వెళ్ళాక చెయ్యబోయే పనులలో ఒకటేమో.

    ReplyDelete
  24. * మధుర, మనకి మన నాన్నల పట్ల వున్న ప్రేమే అలా గాఢమైన నా కవితగా, మీ వ్యాఖ్య గా వెలికివచ్చాయి. ఇంకా చూపించలేదండి. వ్రాసానని చెప్పాను. నవ్వేసి వూరుకున్నారు. నాకు కళ్ళు మాత్రం తడి ఆరవు. ఏదో ఒక వంకతో వాగులై పోతుంటాయి. తరచుగా మట్టుకు అమ్మా నాన్నలతో గడిపిన రోజులు గుర్తుకొచ్చే నిండుకుండలౌతాయి. బహుకాల పునర్దర్శనం. నెనర్లు.

    ReplyDelete
  25. * ప్రదీప్, ఆ సంకలనం అన్న ఆలోచన బాగుంది. నిజానికి నాన్న గారి మీద ఇప్పటికి ఓ రెండు చిన్న కథలు వ్రాసాను. అపుడపుడు ఆయన చెప్పిన విఫలమైన తన ప్రేమ కథ వ్రాయాలనిపిస్తుంది. ;) నేను వ్రాసింది ఆవగింజంత. ఆయన జీవితం ఓ పనస కాయంత. మా ఇద్దరం చెప్పుకునే కబుర్లు ఓ అక్షయం. మీరలా ఉద్ద్యేసించారని కాదండి, నాకలా ధ్వనించిందెందుకో. ఇక వదిలేద్దాం సార్ ఆ మాట.

    ReplyDelete