చిన్నారి పొన్నారి నా చిట్టి అమ్మలు!!!

పాదులో దాగి పచ్చగా విచ్చిన గుమ్మడిపువ్వల్లే,
పక్కలో ఒదిగి అరమూతల నవ్వింది నా చిన్నితల్లి.
అవ్వాయి తువ్వాయి గెంతులేసే లేగదూడకిమల్లే,
ఆదమరిచి ఆడిపాడింది నా బంగరుతల్లి.

అమ్మ పనికి పోతుంటే,
తోడు నేనంటు మారాముపోయింది.
నాన్న వూరుకి వెళ్తుంటే,
వెంట నేనంటు గారాలుపోయింది.

సరిగమల పాఠాలు ముదమార నేర్వమంటే,
ఆరున్నొక్క రాగాలు ఆలపించింది విపంచి.
తకధిమి నాట్యాలు ఆనంద తాండవమాడమంటే,
మువ్వకొక్క మూతివిరుపుగ చిందులేసింది తరంగిణి.

ఓనమాలు దిద్దుతూనే,
వేయి పలుకులు అమ్మకి పంచింది.
పాలబువ్వ తిననన్న గారాబు బుల్లి,
ముద్ద కలిపి అమ్మ నోటికిచ్చింది.

ఆరిందా తానని అన్నకి ఎదురు తిరిగింది
అమ్మ చిరునామా పేరు మార్చి రాయమంది
చిట్టి పొట్టి చిన్నారి ననుమించి ఎదగనుంది..
చెప్పుకుపోతే వేవేలు, నా చిన్నితల్లికి జేజేలు!! 

17 comments:

  1. ఇది ఊహా జనిత కాదు జీవ కావ్యమని తెలుస్తూనే ఉంది
    పిల్లల గారాలే వారికి అందం అవి చూసే వారికి ఆనందం

    ReplyDelete
  2. ప్రదీప్, మీ వ్యాఖ్య చదువుకుని కవిత బ్లాగులో పెట్టినప్పటి ఆనంద భాష్పాల తడి మరోసారి తుడుచుకున్నాను. అవునివి నా స్నేహ కబుర్లే. నా పంచ ప్రాణాల అన్నకి తోడు నా ఈ ఆరోప్రాణం. మీ వ్యాఖ్యలోనూ జీవం అది నా మనసులో చిరకాలం సజీవం.

    ReplyDelete
  3. బౌద్ధ తాత్వికత ప్రకారం మనిషి పునర్జన్మ తన సంతానమే అంటారు. చచ్చి పుట్టడం అంటూ ఏమీ వుండదని నమ్మే నేను ఇది విశ్వసిస్తాను. మీ చిట్టి అమ్మలు మారాం మరువంనకు మరింత మధురిమను అద్దినది.

    ReplyDelete
  4. "పక్కలో ఒదిగి అరమూతల నవ్వింది నా నిత్యమల్లి
    అవ్వాయి తువ్వాయి గెంతులేసే లేగదూడకిమల్లే
    ఆదమరిచి ఆడిపాడింది నా బొండుమల్లి"....... మీరింత అధ్బుతంగా యెల చెప్పగలరండీ..మీరు రాసిన ప్రతి వాక్యం ....అనుభూతి .....'

    ReplyDelete
  5. చాలా బగుంది ఉష మీ చిన్నారి తువ్వాయి..
    మీ కవిత చూస్తుంటె మీ బొండుమల్లెను దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తోంది..

    ReplyDelete
  6. * వర్మ గారు, మీ విశ్వాసాన్ని గౌరవిస్తున్నాను. నమ్మకాలకున్న విలువల్ని నేను గౌరవిస్తాను. ఈ రకంగా బౌద్ధ తాత్వికతలోని ఒక విషయం తెలిపారు. నా అమ్మలు, కన్నయ్య నాలోని ఎన్నో అనుభూతులకి మూలాధారాలు. నెనర్లు.

    ReplyDelete
  7. * చిన్ని, మీ వ్యాఖ్యల్లో చదివిన గుర్తు, మీ పాప ప్రస్తావన రావటం. అదే కదండీ మాతృత్వం మనకిచ్చే వరం. అనుభవాలు, అనుభూతులు .... వాటిని పదిలపరుచుకునే అమ్మతనం మన స్వంతం.
    * భావన, దగ్గరకి తీసుకుంటే ముద్దాడరండి, నొక్కి గిల్లాలనిపిస్తుంది. వూరిన వూరగాయ వంటివి దాని కబుర్లు, తీయని తేనేవంటి చేతలు దాని నైజం. కవితల్లో నాకు పోటీ. పిల్లాడితో వంటల్లో ఆరితేరిపోతే మిగిలిన అన్నిట్లోను ఇది నన్ను పెంచింది.
    * లక్ష్మి, సుజ్జి, నెనర్లు.
    నా " "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?" http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html ప్రేరణ నా ఇద్దరు పిల్లలే, నా నేస్తం వాళ్ళ అమ్మగారు [ఆవిడ మాటల్లోని ప్రేమానురాగాలు, తన సంతు పట్ల తృప్తీను].

    ReplyDelete
  8. Who tucks me in at night?
    Who lets me use her perfume?
    Who do I keep in my heart?
    Who has deep eye?
    Who else is a girl in my family?
    Who is like a queen?
    Who has black hair like me?
    Who is smart in my family?
    Who else do you think?
    My mother

    ఇవి నా పొదరింటి పువ్వు నా మీద జల్లిన పరిమళాలు. తన పోకడ చూస్తే అచ్చంగా నా చిన్నప్పటి ప్రతిబింబాన్ని చూసుకున్నట్లు వుంటుంది. తనని పెంచుతూ నేను మానసికంగా ఎదిగిన అనుభవాలెన్నో. ఒకసారి విసుగులో, పరధ్యాసలో ఓ దెబ్బ వేసాను, దాని కన్నా ముందు నేనే కళ్ళనీళ్ళపర్యంతం అయిపోయాను. గబ గబా మంచి నీళ్ళు, tissue box తెచ్చిచ్చి నా వెన్ను నిమురుతూ [అప్పటికి దాని వయసు 7సం.] 'పర్లే అమ్మా, నేనే సారి చెప్పాలి, you are mad at me because of me." అన్న మాట తర్వాత ఈ మాదిరి దృశ్యం మాఇంట్లో మరి లేదు. చిన్న చిన్న చీటీల మీదా ఏవేవో వ్రాసి పెడుతుంది 1.when in game you be rough, no rules just win, 2. don't worry I am with you, with me you are the mightiest ఇలా గీతలో కృష్ణునిలా జీవిత సారం తిరిగి పలుకుతూవుంటుంది. ఎక్కువగా నేను తనని చెల్లి అని పిలుస్తాను. జనవరిలో నేను వ్రాసిన "పునరపి జననం, పునరపి మరణం." http://maruvam.blogspot.com/2009/01/blog-post_05.html చదివిన వారికి అర్థంకావచ్చు ఎందుకలా పిలుస్తాను అన్నది. స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  9. పునరపి జననం ...ఇప్పుడే చదివాను ..నా కళ్ళు నా మాట వినడం లేదు ......చేదు జ్ఞాపకం ..ఆ చీకటి నుండి రావటానికి అక్షరాల యేడాది .....జీవితాంతం వెంటాడే "తడి "....నా చిన్నారి..

    ReplyDelete
  10. What can I say. Marvellous !!

    ReplyDelete
  11. * చిన్ని, మీ మాటల్లోని సానుభూతి చాలు. కొన్ని దుఃఖాలకి అంతువుండదు. అందుకే నేనీ ప్రత్యామ్నాయం వెదుక్కున్నానేమో? తను తిరిగివచ్చిందని నాకు నేను చెప్పుకుంటున్నానేమో. ఈ భావనే బావుంది కూడా. అందుకే ఇక ఈ చిన్నారినే చూస్తాను.
    * జన్య, నా బ్లాగులో బహుకాల దర్శనం. నీ అంత మంచి కూతురు కాదు లేవే ఈ భడవ. :) అయినా నాకు నా బంగారమే.

    ReplyDelete
  12. బ్లాగ్ చిచ్చు గారు, మీ తొలి వ్యాఖ్యని స్వాగతిస్తూ, క్లుప్తంగా వున్నా అమితానందాన్ని ఇచ్చిందని మనవి చేసుకుంటున్నాను.

    ReplyDelete
  13. మీ చేయి పట్టుకు అడుగులేసిన చిట్టితల్లి ,
    మీ అడుగులో అడుగేసి పెరిగిన చిన్నితల్లి ,
    మీ జ్ఞాపకంగా మిగిలిపోయిన ఆ చిట్టిచెల్లి !
    తానే మిమ్మూరడించవచ్చిన బంగారుతల్లి !
    మీ తీపి జ్ఞాపకాలను ఇంద్ర ధనుస్సులా
    మరోసారి మీ ముందు ఆవిష్కరించిన
    చిన్నారి పొన్నారి మురిపాల పాలవెల్లి ....

    ReplyDelete
  14. * పరిమళం, ఎంత ముద్దుగా వుందో మీ కవిత. మురిపంగా మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. అపుడా కవితకి, ఇపుడీ కవితకీ మీ స్పందన లో సాంద్రత చాలు మీ మంచితనమన్న పరిమళం వెదజల్లను. ధన్యురాలను.

    ReplyDelete