జలరక్కసి వేవేల వ్రక్కలైతే...

రాముడు తరిమాడో, కృష్ణునికి వెరచిందో
యుగంతాలు ఆ దిగంతాల్లో దాగునుందో
జలరక్కసి ఆకాశమంతా పరుచుకునుందేమో
అమాశకి పున్నమికీ వెన్నువిరుచుకులేస్తుందేమో

పిడుగుల పెడబొబ్బలు పుడమి అదిరేలా పెడుతోంది
బాహుమూలాలు తెగిపడేలా తెగ వంపులు తిరుగుతోంది
మెరుపు కాంతులు తన మేనంతా వణికిస్తున్నాయి
శాపమేమో వేవేల వ్రక్కలై వానచినుకులై రాలిపడింది

చెరువు మురికి కడుక్కుని తేటపడింది
దాని మీద తేలేటి తామర తెప్పరిల్లి నవ్వింది
లోనున్న చేపలు రంగులరాట్నం తిరుగుతున్నాయి
ఒడ్డునున్న కొంగ వుండుండి వాటితో చెడుగుడాడుతోంది

రక్కసి కాయంపడ్డ సముద్రం వులిక్కిపడింది
జరాసంధుని వోలే తిరిగి జీవంపోసుకుంది
రాకాసి మళ్ళీ జనించింది, నింగికెగసి నక్కింది
నిదురపోనుందో? తిరిగి నేల జారనుందో? ఎవరికి ఎరుక!

24 comments:

  1. నాకు కవిత్వాన్ని appreciate చేయటం అంతగా తెలీదు. కానీ అందులో అందాన్ని అనుభవించగలను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడో చిన్న మాట చెప్పాలి. నా బ్యాక్‌గ్రౌండ్ మీకు వివరించటం మంచిదనిపించి...ఆఖరి నాలుగు లైన్లూ అంతవరకూ ఉన్న పద్యం యొక్క అందాన్ని dilute చేసేసినట్లుగా అనిపించింది. అంతవరకూ ఉన్న కవిత చాలా నచ్చింది.

    ReplyDelete
  2. మీ సద్విమర్శని స్వీకరిస్తూ ఆ పాదాన్ని ఈ వ్యాఖ్యలోకి మార్చాను. నెనర్లు భవాని.
    నిన్న రాత్రి సుమారు 12am కి వచ్చిన పిడుగుల వురుముల వానని చూస్తే రక్కసి కూతలు పెడుతుందా అనిపించింది. ప్రొద్దున్నే 5am కి అలా మా ఇంటి వెనుక చెరువు వంక చూస్తే నిర్మలంగా చిర్నవ్వు నవ్వినంతా సుతారంగా హొయలొలికించింది. అప్పటి వూహ ఇది.

    సంధ్యవేళ ఎండలా పదునులేని కవితేమో ఇది!
    చదువరి మనమెరిగిన కవయిత్రి కాంచిన కోణమిది,
    చక్కదనాల వానకి, రక్కసికీ ముడేసిన వైనమిది.
    ఒకపరి కనులు మూస్తే ఆ సరికొత్త చిత్రం మీ స్వంతం!!!

    ReplyDelete
  3. నాకెందుకో మీరు రాసిన కవిత కంటే "సంధ్యవేళ ఎండలా పదునులేని కవితేమో ఇది!
    చదువరి మనమెరిగిన కవయిత్రి కాంచిన కోణమిది" అన్న మీ భావమే నచ్చింది..

    ReplyDelete
  4. మీరు చెప్పింది సునామీ గురించా ? నిషా గురించా?
    కృష్ణుని కి వెరసిందో అన్నారు..శ్రీ కృష్ణుడు ఏం చేసాడు అర్థం కాలేదు

    ReplyDelete
  5. నిజమేకదండి కథాసాగర్, పసలేని పదునులేని కవిత కానీ ఆ భావం అలా తొణికింది.

    ReplyDelete
  6. ఉషాగారు బావుంది పోస్ట్ ..
    ఇంకో విషయం అర్థం కాలేదు పరిమళం,పద్మార్పిత గార్లు హెడ్ ఆఫీసు(మీ బ్లాగ్) కి వస్తారని తెలుసు..మురళి గారి బ్లాగ్,నా బ్లాగ్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు :) చూస్తారని మనవి

    ReplyDelete
  7. మీరు భగవద్గీత చాప్టర్ 7, knowledge of absolute ఫై నమ్మకం వుంది మీకు కూడా లేకపోతే మొదటి లైన్ వుండదు కదా

    ReplyDelete
  8. హరేకృష్ణ, మొతానికి నా బ్లాగుని ప్రచారవేదిక చేసేసారా, మరి నాకు మూల్యం కడతారా లేదా? :)
    ఈ కవిత పిడుగులతో పడే మా వూరి వానని వర్ణిస్తూ వ్రాసానండి. దశావతారాలు సాదారణంగా రాక్షస నిర్మూలనకి వస్తాయి "..వినాశాయ చ దుష్కృతామ్" కదా, అందుకు వారివురినీ ప్రస్తావించాను. నమ్మకం లేదని చెప్పలేదు కదా, నాకు రెండు మూడేళ్ళ వయసప్పటిది గీతతో బంధం. మా మామ్మ గారు ప్రతి సాయంత్రం గీత చదివేవారు. ఓ పాలగ్లాసేసుకుని ప్రక్కన చేరివినేదాన్ని. అలాగే మా నృత్య గురువులు కూడా ఒక అరగంట గీతలోని శ్లోకాలు వల్లె వేసాకనే సాధన మొదలు పెట్టించేవారు.

    ReplyDelete
  9. హ హ్హ..నిన్న మీరు భా రా రే అని వేసిన సటైర్ గుర్తొచ్చి గట్టిగా నవ్వేసా ఆఫీసు లో మూల్యం కట్టాలి అనుకుంటా :)
    చిన్నప్పటి నుండే గీతా శ్రవణం చేసేవారన్నమాట ..అదృష్టవంతులు మీరు

    ReplyDelete
  10. కవిత ఎలా ఉన్నా వర్షానికి రక్కసి తో ఉపమానం సరి కాదేమో!

    వృత్తాసురుడు మేఘాల్ని బంధిస్తే, ఇంద్రుడు దధీచి వెన్నెముకతో చేసిన వజ్రాయుధాన్నిఉపయోగించి వృత్తుడిని సంహరించి, మేఘాల్ని వదిలించి ప్రపంచాన్ని కాపాడాడని వేద గాధ!

    అదీకాక వర్షమే జీవాధారం ఈ వసుధ పై. ఆ వరుణ దేవుని ఉగ్ర రూపాలని కూడా దైవ ఉగ్రత్వం తో పోల్చ వచ్చు గాని రాక్షసత్వం తో పోల్చడం అంత రుచించ లేదు.

    ఎంతైనా జిహ్వ కోక రుచి అన్నారు పెద్దలు.

    ReplyDelete
  11. "వెరసిందో" ఇక్కడ "వెరచిందో" అని ఉండాలేమో అని చిన్న సందేహం నాకు.. భయపడడం అని అర్ధం కదండీ? అమాశ అన్నారు కాబట్టి, అదే యాస లో తీసుకోవాలేమో అని మరో ఆలోచన.. మీకు 'జలరక్కసి' అనిపించిందంటే చాలా పెద్ద వర్షమై ఉండాలి..

    ReplyDelete
  12. నిదురపోనుందో? తిరిగి నేల జారనుందో? ఎవరికెరుక!.....
    నిజమే ఎవరికి ఎరుక..?
    చాలా బాగుంది స్వచ్చమైన తెలుగును దాని తియ్యదనాన్ని చూస్తున్నాను

    ReplyDelete
  13. * హరేకృష్ణ, నవ్వులు వెల లేనివి. అవి పండాలనే కదా ఈ ప్రయాస. అసలు బా.రా.రె. గారు మీ నవ్వులు విన్నారనుకోండి, "ఆయ్ టి.జి. వేంకటేష్ ని పిలుస్తా నన్నేమన్నా అంటే" అని పరిగెట్టుకు వస్తారు :)
    గీత విషయంలో ఆ విషయానికి వస్తే మన మూల గ్రంథాలని పరిచయం చేయటంలో మా నాన్న గారు, మామ్మ [ఆయన తల్లి] ఇద్దరి పాత్రవుంది. ఆ ఇద్దరు కూడా తర్వాతి దశలో సహజమార్గ్ రాజయోగ ధ్యాన సాధన అభ్యాసులే (నా మాదిరే]. ఇలా స్వీయానుభవాలు పంచుకునే అవసరం వస్తున్న ప్రశ్నలకి ఆనందం.

    ReplyDelete
  14. * ప్రసాద్ గారు, ఈ ఆఘ్రాణింపు మీకు రుచించలేదు. అది సహజం/వ్యక్తిగతం, మీరన్న గాథ నేనూ చదివాను. అలాగే ఇంద్రుని, వరుణుని చర్యలన్నిటినీ సమర్థించినదాన్నీ కాదు. నిజానికి రాక్షస జాతికే నేను వ్యతిరేకిని కాదు. అణచబడి వారి జాతి హక్కుల కొరకు పోరాడిన వారు కావచ్చు. ఆ మార్గంలో క్రూరత్వాన్ని అలవరుచుకున్నవారు కావచ్చు. మన గాథల్లో మహా భక్తులైన రాక్షసులు ఎందరు లేరు. కానీ చర్చని ఇంకా ఆ దిశలో పొడిగించటం నా అభిమతం కాదు. ఈ చిరు కవిత అటు దారి తీయటం సమంజసమూ కాదు. సూటిగా వచ్చిన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. April నెలలో వ్రాసిన "వలపు, వాన చినుకు ఒకటేనట! " చదివారా? వానని మరో రకంగా దర్శించాను.

    ReplyDelete
  15. * మురళీ గారు, ముద్రారాక్షసాన్ని సరిదిద్దానండి. నిజమే చాలా పెద్దగా వస్తాయి ఇక్కడ వానలు. ఇళ్ళు కూల్చేసే "టోర్నడోలు" మనిషిని గజగజ లాడించే, మన పురాణ కథల్లో చెప్పే మాదిరిగా హోరుగాలులు, గాలి వానలు వుంటాయి. భూకంపం వచ్చినంత అదిరిపోతుంది. హైదరాబాదు, ఇక్కడ రెండు సార్లు earth quake ని స్వయంగా చూసాను. మైళ్ళ తరబడి flat భూములుండటం గాలి ఉధృతకి కారణం కావచ్చును. నెనర్లు.

    ReplyDelete
  16. * శ్రీ, నా తెలుగు భాషలోని స్వఛ్ఛత పట్ల మీ సదభిప్రాయానికి ముదావహం. భాష పట్ల అభిమానం మెండుగవుంది కాని పట్టు, క్లుప్తత, స్పష్టత, వ్యక్తీకరణ ఇవన్నీ ఇంకా బాల్యావస్థలే. ఏడాది ప్రాయమే కదా. మరువం ఇంకా ఎదగాలి. ధన్యవాదాలు.

    ReplyDelete
  17. ముద్రారాక్షసాన్ని...అన్నారు..సందేహాన్ని వివరించండి
    ఉష గారు సుభవారాంతం :):)

    ReplyDelete
  18. * హరేకృష్ణ, ముద్రారాక్షసం అంటే అచ్చుతప్పు or typo: an error (as of spelling) in typed or typeset material నాకూ తెలుగు వచ్చునని అనిపింపచేస్తున్నారు. ;) మీకు కూడా శుభవారాంతం, కానీ నేనీ శనాదివారాలు రెండు రోజులూ ఆఫీసు పనిచేయాలి. కనుక multi tasking weekend home chores + work, ఇవే జీవితం పట్ల మరింత విరక్తిని పెంచే విషమ పరీక్షలు. ఎగిరే పిట్టని, పరిగెట్టే బన్నీని చూసి ఉడుక్కునే ఘడియలు/సమయాలు. :(

    ReplyDelete
  19. నాకైతే చాలా బాగా నచ్చేసింది యే మాత్రం డవుట్లేమి లేకుండా :)

    ReplyDelete
  20. నేస్తం, ఆ మాత్రం అభిమానం వుండాల్లేద్దురు, ఇక అదీ నాకు కరువైతే నేనొక "అభిమాన జల రక్కసి యజ్ఞం" చేయాలి. లేదా అలవాటు లేనిది ఏదో ఒక వ్రతం అదీ మిమ్మల్నే అడిగి నేర్చుకుని చేయాలి. అగ్ర తాంబూలం మీకే పంపాలి. :) నెనర్లు.

    ReplyDelete
  21. వర్మ గారు, అపుడపుడూ ఇలా మన తేట తెలుగు మాటలు గుర్తుచేసుకుంటే మా అమ్మ చేతి వంటంత, గరువ మీద మేపుకొచ్చిన గేద పాలు మరగకాచి మా అమ్మమ్మ తోడుపెట్టిన పెరుగంత, మా వూరి పూతరేకులు, మడతకాజ, కాకినాడ కాజ అంత రుచిగా వుంటాయి. తినటానికి ఏడ్చే నేను వీటికి మాత్రం పిపాసిని/బానిసని.

    ReplyDelete
  22. జల రక్కసి మేఘాలలో దూరి మేఘనాదున్ని హింసింప
    అంతట కన్నెర్ర చేసిన అర్జునుడు ఆ రక్కసిని సంహరించ
    ఆకసంబు వాన చినుకులు కురిపించ
    జల పుష్ప విలాపం తీరెనుగా
    ( ఉరుములు ఉరిమినప్పుడు "అర్జునా ఫల్గుణా పార్దా కిరీటి" అంటూ పాండవ మధ్యముడిని తలచుకునే వాక్యాల గురుతులలో మీ కవిత ప్రేరణతో)

    రాముడు సేతువు నిర్మింప సముద్రునిపై బాణమెక్కుపెట్ట
    సముద్రుడి ప్రాణాలు ఆవిరై జల రక్కసి చెంత బంధింపబడ
    ఆ సంద్రము దాటిన పిమ్మట రామానుజుడు ఆ జల రక్కసి రేడు
    ఇంద్రజిత్తుని సంహరింప ఆకసంబు చినుకలతో సీతా మాతను అభిషేకించేన్
    (మేఘనాదుడు అని రాసినప్పుడు ఇంద్ర జిత్తు గుర్తు రాగా)

    భగీరదుడు తన పూర్వీకుల ఆత్మశాంతికి తపము చేయగా
    పరవశించిన బ్రహ్మ గంగను పంపగా, మదమున నేలకు వస్తున్న
    ఆ గంగను ఆ పరమశివుడు బంధింప గంగమ్మేరాకాసి ఆయెనా ?
    ఆ రాకాసి మదమణచి శివుడు చిరుపాయను భాగిరదుని కొరకు పంపెనా!
    (పైన రెండూ రాస్తుంటే వచ్చిన ఆలోచన)

    ===
    ఉష గారు,
    కవిత చాలా బాగుంది. బాగుండబట్టే కదా నా ప్రేరణ కవిత రూపంలో అలా వెలికి వచ్చింది

    ReplyDelete
  23. * ప్రదీప్, మూడూ మూడే, నన్ను ముప్పేట ముప్పిరిగొన్నాయి. ఉప్పెనంటి అలౌకికానందంలో ముంచివేసాయ్. చాలా చాలా చాలా బాగున్నాయి. ఇప్పటికీ ఉరుములొస్తే చిన్న మార్పుతో "అర్జున ఫల్గుణ కిరీటి పార్థవా" అనటం, భయమేస్తే "ఆంజనేయ రక్షణం హనుమంత పాహిమాం" అనుకోవటం అలవాటు. ఇంద్రజిత్తుని మరణం నాకు చాలా బాధ కలిగించే ఘట్టం, బహుశా మండోదరి పరంగా ఆలోచిస్తానేమో? భగీరథుని గాథలో గంగావతరణం అమిత ఇష్టం. ఆమె అతిశయం ఇంకా ఇష్టం. హరుని జటాజూటంలో చిక్కినా మొగలి పూవల్లే నవ్వే ఆమె ముఖవర్చస్సు ఇంకా ఇంకా ఇష్టం. "కవిత చాలా బాగుంది" మాట చెప్పకనే తెలిసింది మిత్రమా! నెనర్లు.

    ReplyDelete