హరివిల్లు - 5 : దొంగలు వేసిన హరివిల్లు

[నా సాహితీ మిత్రులు "అర్జునుడి బాణాలు" ప్రదీప్ సంకల్పించిన "సప్తకవితల సంకలనం" లో చదువరుల మనసు రంజింపచేయగ ఇది చివరగా ఎక్కుబెట్టిన హరివిల్లు.]

చీరల దొంగ చెట్టు దాపు చాలదని
విను వీధిన పరుగిడాట.
వాన మబ్బు ఫక్కుమని నవ్వే,
అది చూసి సూరీడు తొంగి చూసే.
కినుక పడ్డ చిన్ని కన్నయ్య
సప్తవర్ణ వస్త్రాలు విసిరిపారవైచే
ఆ వంక మొదలు ఆ వంక వరకు
రంగుల హరివిల్లు విరిసే

ఆకతాయి అబ్బాయి మనువాడిన మరదలి
మోముగిల్లి మంచె మీదకు మళ్ళిస్తే,
మావికొమ్మలు పచ్చనాకు పందిళ్ళు వేసే
తంగేడు పసుపు నలుగు పెట్టే
తమలపాకు సిగ్గెరుపుకు సవాలై నిలిచే
పాలపిట్ట రెక్కల వీవెన విసిరే
నీలి మబ్బు చిన్నబోయి ఊదా కలనేసిన కాషాయం కట్టుకునే
ఆ చెలిమిలో వలపుల వానవిల్లు బింబించే

6 comments:

  1. ఈ హరివిల్లులో మూడు కవితలు నల్లనయ్య మీదే రాసాము. నల్లనయ్యే ఈ హరివిల్లుకి రాజన్నమాట...
    ఇక ముక్తాయింపు శ్వేతకవిత మిగిలింది.
    అడగడం మర్చేపోయాను, పైన ముందుమాటలో నా పేరు దగ్గర సప్తవర్ణాలలో వాక్యాన్ని రాసారు కదా.. బాగుంది మీ సింబాలిజం. హరివిల్లు కనిపించి తీరుతుంది ఇక.

    ReplyDelete
  2. ప్రదీప్! నల్లనయ్య అలా సప్తవర్ణ హరివిల్లుల కవితలకి స్ఫూర్తినివ్వటం చిత్రమే. అయినా కృష్ణయ్య లేనిదెక్కడ? పోతే ఈ రకంగా వూహల్లోనైనా దేవ/దేవేరుల సప్తపదులు, సప్తసాగర మథనాలు, సప్తస్వరాల ఆలాపనలు, సప్తర్షిమండల సాధనలు, సప్తవర్ణ స్వప్నాలు అన్నీ ఈ ఏడురంగుల హరివిల్లున దర్శించాము. ధన్యజీవులమైనాము. వర్ణం లేని జీవం లేదు. జీవం వుట్టిపడని కవితే లేదు. ఇక ఆ మిగిలిన శ్వేతకవిత కూడా రానున్నది. నెనర్లు.

    ReplyDelete
  3. చివరిగా ఎక్కుపెట్టిన హరివిల్లు .... సరస శృంగార విరి జల్లు !
    మీ సప్తకవితా సంకలనం ....చదువరులకు మోహనవంశీరవం !

    ReplyDelete
  4. "కోరికలే గుర్రాలైతే,ఊహలకే రెక్కలు వస్తే
    అంతేలేని ఆశలకు,అందని స్వర్గం ఏముంది.."
    అని ఒక పాట ఉందండీ.మీ కవితలు చదువుతూ ఉంటే ఆ పాట గుర్తు వచ్చింది.
    మదిలోని భావాలకి రూపం ఇచ్చి,
    మనసు తలుపులు విశాలంగా తెరిస్తే,
    విరిసేది,కనిపించేది సప్తవర్ణాల హరివిల్లే సుమండీ!!

    ReplyDelete
  5. * పరిమళం, మీ వ్యాఖ్య చాలా తృప్తినిచ్చింది. సరస శృంగారం అంటారా లాలిత్యంగా, సున్నితంగా చెప్పినంత వరకు దానిపై ప్రబంధాలే లిఖించవచ్చు కదండి. ఆ చెప్పే తీరీ కీలకం. యధాలాపంగా అనుకున్నది ఇలా 7 హరివిల్లు కవితలుగా విస్తరించటం - ఈ అందమైన అనుభూతి అనిర్విచనీయం. ఏమైతేనేమి, ఈ ప్రక్రియ ద్వారా ప్రదీప్ గారి బాణీలో కొన్ని, నా ధోరణిలొ కొన్ని భావాలు రంగులు వెదజల్లటం నాకు ఆనందంగా వుంది.

    ReplyDelete
  6. * తృష్ణ, "వూహల రెక్కలతో వయ్యారాల విహారాలు, విలాసాలు, విలాపాలు" వెరసి ఈ "మరువపు వనం". అది సప్తవర్ణాల వలెనె, షడ్రుచుల మాదిరిగా అన్ని పోకడలు చూపుతుంది. నా మనసు స్పందనని తానే వెలికి తెచ్చుకుంటుంది. నాకోసమే నేను వ్రాసుకుంటాను. అవి చదివి మెచ్చే మరో మనసుంటే దానికి ఓ సార్థకత, అలాగని అదే నా కవితలకి భవిత కాదు. అవి జనిస్తూనే వుంటాయి. దాదాపుగా నావన్నీ నా వరకు ఉత్తమ రచనలే, ఇది ఆత్మవిశ్వాసమే. నాది సాహిత్యం కాదంటే తర్కించను, అసలు కవిత్వమే కాదూ అన్నా ఖాతరు చెయ్యను. సమకాలీన తీరుల్లో వున్నదని మాత్రం నమ్ముతున్నాను. పాఠకులు వస్తున్నారు, ఇకపై వస్తారు. వ్రాసాక తిరిగి తిరిగి చదువుకుంటాను. మనం ఎపుడో తిన్న మామిడి రసాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నట్లు. నా మటుకు నేను ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతాను కనుక, మన రచనలకీ చదువరులు పుట్టుకొస్తూనేవుంటారు. జయహో బ్లాగ్లోకం. జయహో బ్లాగ్వ్యాఖ్యాస్వాతంత్రం జయహో బ్లాగ్సాహీతీమిత్రత్వం ... ;) నెనర్లు.

    ReplyDelete