"బీటల్లం భోజ్యం": అనగనగా అమ్మల కథకొక కొసమెరుపు!


కథలోకి కంటిచూపు తిప్పేలోగా పంచుకోవాలని ఓ- అప్పుడప్పుడు ఆలోచనల్లోకి వచ్చే- ప్రశ్న: కౌసల్య పెట్టకపోయినా కైకేయి ఉందిగా రామబాలకునికి తినిపించన్, యశోద కూరిపెట్టినా తస్కరించి మరింత లాగించన్ కన్నయ్య కి వెన్నతో పెట్టిన విద్య, వకుళమాత పెళ్లిసందడితో సరిపెట్టింది, అంతా మంచి అమ్మలు.  కాకపోతే, కైకసి ఎంచక్కా పూజలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ కనిపిస్తుంది అంటే ఆమెకు కలిగిన నలుగురూ, రావణ, కుంభకర్ణ, విభీషణు, శూర్పణఖలు తిండిపేచీ ఎరుగని బంగారుబిడ్డలా?
 

పోతే, నాకు సస్పెన్స్ కథ నచ్చదు కనుక- ఇందులో నీతి యేమంటే అమ్మైనా నాన్నైనా ప్రతిఘటన, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎటువంటి మినహాయింపులు ఉండవు, జరిగేది ఒకటే!  

ఇక కథ అంశం పాతదే.  ఈ అమ్మల జీవితం లో ఆవేదన వండింది తినని, అసలు అన్నమే తిననని, ఆకలి లేదంటూనే నానా చెత్త లాగించే పిల్లకాయలతో మొదలై, వాళ్ళు ఆకతాయిలు మాత్రమే కాక ఆటకాయలు కూడా అయినట్లయితే, వారి ఎదుగుదలలో భాగం గా అమ్మకి ఎదురుపాఠాలు నేర్పి పెంపకం ఒక ఎదురీత గా మార్చినప్పుడు ఆక్రోశం గా మారుతుంది. అదే కాలక్రమేణా క్రోధం, క్రౌర్యం ఇత్యాది అష్ట రసాలలో అధిక శాతం రసాలు పీల్చుకున్న మమకారం తగ్గి కారం ఎక్కువై ప్రతీకారం గా మారుతుంది. అనగా, అష్ట నాట్యరసములు శాంతము తోడు చేసుకుని నవరసాలుగా ప్రసిద్ది కనుక అష్ట మాతృ రసములు కూడా శాంతము తో ముగుస్తాయి, అంచేత ఇవి కూడా తొమ్మిదే లెక్కకి.

పిల్లదానితో నా పాట్లు నోము కథల్లోకి ఎక్కాలి- పాక పూజ ఒకటి ముందుగా కనిపెట్టబడి జన ప్రాచుర్యం పొందాలి కనుక ఇక ఆ పనికి నడుం బిగిస్తాను. మీకీపాటికి అర్థమై పోయుండాలి అసలిక్కడ కథ లేదని. మళ్ళీ కథకాని ఈ కథ లోకి...ఎలా వండినా యేమి వండినా కేవలం వికారం అనే ఉద్వేగం తో నాకు "ఇంకా బాగా పెంచాలి, లాలనగా చెప్పుకుని- నాన్నగారు నాకు అలవాటు చేసినట్లే- దీనికీ మన వంటలు వంటబట్టేలా చెయ్యాలి," అనే ఉషారు నాలో పుట్టించటం దానికే చెల్లింది. నేనూ దాదాపు 20సం. వయసు వరకు తిండి దగ్గర పేచీలతో కాల్చుకుతిన్నాను కనుక నాకూ నా పితృదేవతల శాపవశాత్తు ఇవన్నీ సంభవిస్తున్నాయని కూడా నమ్మేదాన్ని. అసలా శాపవిముక్తి కి మార్గం అడగలేదని కూడా గుర్తులేకపోయింది. అదీకాక, శ్రీలంక తమిళుల ఇంట పెరిగి కాస్త, అమెరికన్ చైల్డ్ కేర్ లో ఉండి కాస్త దానికి అదొక రకమైన మిళిత వంటల మక్కువ పెరిగింది. చచ్చీచెడి పప్పు, కూర, చారు, పెరుగు పాట పాడి పాడీ (ఆకేసి ఆం పెట్టి పప్పేసి... విన్నారుగా?!) ఆ 4 తిని అరాయించుకోవటం నేర్పేసరికి దానికి 7 ఏళ్ళు రావటం, వంట చెయ్యాలన్న ఆశయం కలగటం తో నా పాట్లు మొదలయ్యాయి. 

ఇటాలియన్ అలవాటు చేసుకునే సరికి, కొరియన్, అది దాటేసరికి ఈస్ట్ యూరోపియన్ అక్కడ నుంచి ఒక్క అంగలో సౌత్ అమెరికన్ ఇలా అది మొత్తం ప్రపంచ వంటల వేదిక గా నా వంటగదిని మార్చేసాక ఎక్కడో యేదో పరిణామం సంభవించి అది అచ్చంగా ఇండియన్ కిచెన్ కి మారిపోయింది. భలే భలే అని బాంగ్రా, డాండియా ఆడేలోపే కథక్, కథాకళి బాణీల్లోకి తోసేసి పలానా కూరగాయ పలానాగా వండితే తింటాను అనే విప్లవం లేవదీసింది. ఇక నా సహనంకి కాలం చెల్లిపోయింది. మరి యేమి చేసానయా అనంటే ...

.. గ్రీన్స్ మంచివి అని ఒప్పించి ఒక్కసారే 4-6 పచ్చ పచ్చాని కూరలు వండేసి దానికి నచ్చిన ఆ ఒక్క రకం పే...ద్ద గిన్నెలో చూపి మిగతావి మధ్య మధ్య ముద్దల్లో నొక్కేసి దాని నోట్లోకి కుక్కేయటం (ఖచ్చితంగా నేనే తినిపిస్తా ఆ పూట) అంటే బెండ, బీర, సొర, పొట్ల, జుకినీ, బీన్స్, కాకర, స్పినాచ్ గట్రా
.. తనంత తనే తిన్నప్పుడు మెత్తగా నూరేసిన హెర్బ్స్ , స్పైసెస్ గ్రేవీలోకి కలిపేసి ఎలాగోలా కమ్మని రుచి రప్పించి కోరి కూరుకుని తినేలా మాయ చెయ్యడం- ఈ రకం గా ముల్లంగి, కాబేజీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్ ముద్దల్లోకి ముద్దుగా చేరిపోతాయి
.. ఖచ్చితం గా ఈ లిస్ట్ లోవి వండినప్పుడు ఇవాళ రణం తప్పదు అనుకున్నప్పుడు ఉదయం నుంచి భోజనం అయ్యేదాక మౌనవ్రతం లేదా తీక్షణ దృక్కుల ముద్ర వేసుకుని తిన్న కంచాలు సింక్ లోకి చేరాక శాంతం పులుముకోవటం


అటువంటి ఒక రణభరిత వంటకం ఇది: 'బంగాళ భౌ భౌ' అని శ్రీలక్ష్మి "చంటబ్బాయ్" సినిమాలో భయపెట్టినట్లు కాదు కానీ దీనికి "బీటల్లం భోజ్యం" అని పేరు పెట్టా; చెయ్యడం మీ చేతి బలాన్ని బట్టి ఉంటుంది- పోపు కమ్మగా వేసుకుని, ఘాటుకి తగ్గ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాట ముక్కలు ఐదారు నిమిషాల ఎడం లో వేసి మగ్గ పెట్టి, ఉప్పు పసుపు గట్రా వేసుకుని, బీట్ రూట్ పేస్ట్ (అప్పుడే రుబ్బాలి) వేసి దగ్గరగా ఉడకనిచ్చి, జీలకర్ర ధనియాల పొడి కూడా రంగరించి, అప్పుడు అస్సలు రుచికి ఆదరువు అయిన మామిడిఅల్లం ఎంచక్కా కోరుకుని ఎంచక్కా పైపైన చల్లి 2 నిమిషాలు ఉడకబెట్టి, తురిమిన కొత్తిమీర, కుంకుడు గింజంత వెన్న వేసి, మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి ఆపాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థం అయిందా చెయ్యి ఎన్ని రకాలుగా తిప్పాలో? ఇలా చేసిన ఈ కమ్మటి భోజ్యం వేడి వేడి బ్రౌన్ రైస్ లేదా గోధుమ రొట్టెలకి భలే జతపడుతుంది. 

ఇలా నేర్చుకున్న పెంచుడుతనం ఏకలవ్య విద్య కనుక ఎవరెవరి పిల్లలని బట్టి వారే ప్రతీకారం తో సాధించాలి, మధ్య మధ్యలో తోసుకువచ్చే అమ్మతనాన్ని ప్రతిఘటిస్తూ! కథ ఇక ?? కి, మనమిక మరొక వంటలోకి...

No comments:

Post a Comment