కాసుల ప్రతాప రెడ్డి గారి 'కవిస్వరం' లో : "లోపలి చూపు"

ఆత్మను పిడికిట పట్టుకుని లోలోతుల్లోకి పయనిస్తూ అనుభవాలను, అనుభూతులను నెమరేసుకుంటూ సాగిన కవిత ఉష రాసిన లోపలి చూపు. ఆత్మానుభూతిని అల్పక్షరాల్లో వ్యక్తీకరించి పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందీ కవిత. ఇల్లు కేవలం ఓ భౌతిక రూపం కాదనే ఎరుకను కలగజేస్తుంది. ఇంటి చుట్టూ, ఇంట్లోనూ మన జీవితం పరుచుకుని ఉంటుంది. జీవన యానంలో ముందుకు నడిచిన తర్వాత గతంలోని పలు విషయాలు, సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు పొందే అనుభూతిని కేవలం భౌతిక విషయంగా కాకుండా లోలోతుల్లోని ఆత్మ తండ్లాటగా ఆమె ఈ కవితను తీర్చిదిద్దారు. ఇల్లును దర్శించడానికి ఆమె ఆత్మ కిటికీ తెరిచి లోలోనికి ప్రయాణించారు. మెదడు తోట అయినప్పుడు ఆలోచనలు విత్తనాలవుతాయి. ఆ విత్తనాలు మళ్లీ తోటలో కొత్త మొక్కలై వ్యాపిస్తాయి. ఇలా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. భౌతిక ప్రపంచంలోంచి ఆత్మలోకంలోకి ప్రయాణం చేసిన ఈ కవిత పాఠకుడికి జీవితం పట్ల నిర్మమకార స్థితిని కలగజేస్తుంది. ఈ నిర్మమకారం మనిషిని ఈర్ష్యాద్వేషాలకు, రాగానురాగాలకు దూరం చేసి లోకాన్ని ఉన్నదున్నట్లుగా చూసే తత్వాన్ని మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని వస్తుగతంగా దర్శించే చూపును ఇస్తుంది. కవిత మొత్తంగా మానవ జీవితంలోని సారాన్ని అందిస్తుంది. - కాసుల ప్రతాప రెడ్డి

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-
చావిట్లో ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ
మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో కథలై మిగిలినవో కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds" కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...

*****

-లోపలి చూపు-

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-

చావిట్లో 
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో 
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ 

అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ

కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"

కావచ్చు...

అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
(09/05/2014)

No comments:

Post a Comment