హంసగీతి

లోయ గోడలు బీటలు పడ్డాయి
పైనుండి జారే పిలుపుకి ప్రతిధ్వని కొదవైంది

ఏ పిట్ట నోటికూడు విత్తులుగా నేలపాలైందో
వేళ్ళాడుతున్న వెర్రి చెట్ల జాతరల్లే ఉంది
కిక్కిరిసిన వేర్లు గోడ మీద బల్లుల్లా పాకుతున్నాయి

వెన్నెల పిల్లలు కొందరక్కడ దాగుడు మూతలాడుతున్నారు
చీకటి చేతులకి అందకుండా పరుగులు తీస్తున్నారు

గుట్టుచప్పుడు కాకుండా ఆవాసం ఉన్న సరస్సు
లోయలో అలలు ఉగ్గబట్టుకుని ఉంది

ఇన్నాళ్ళకి హంస గీతి ఒకటి పైకి ఎగిసింది
ఉలికిపడ్డ సరస్సులో వెన్నెల ఊయలూగింది

చెదిరిపడ్డ ఆకుల పక్క మీద చిందిన చివరి కూత
ఏనాటి అనుబంధం కొరకు ఎదురుచూపు సాగుతుందో
మరణాన్ని సైతం పారద్రోలుతూ మిన్నంటిన చరమ గీతం

హర్షోన్మత్త విషాదమే రాగంగా కట్టిన ఆ బాణీలో 
సంద్రాలు సైతం కంటనీరు పెడుతున్నాయి

(Cygnus olor,Swan Song ని గూర్చి చదివినపుడు ఎపుడు నిగూఢంగా దాగిందో ఈ ఊహ, అక్షరాలలో నిదురలేచిందిలా!)

06/02/2014

2 comments:

  1. Usha gaaru, mee axara chitraalu chaalaa baagunnaayi:-):-)

    ReplyDelete
    Replies
    1. ఎగిసే అలలు....గారికి, నెనర్లు! ఈ వచనకవిత కూడా చాలా మానసిక స్పందనలని లేత వత్తిడితో నలిబిలి చేసి వెలికి వచ్చింది! ఆనాటి ప్రేరణ ఇంకా గురుతే!

      Delete