కల కాలం

రోజూ వస్తాననేమో
ఇట్టే కరిగిపోయింది రాత్రి.

నిద్రనమ్మి కొన్న కల
పగల్లోకి పరుచుకుంది.

అలిసిన కన్ను ఆత్రంగా
ముందే చూసొచ్చింది ముగింపు.

కంటి తడికి ఒరిసిన వేలు
సగం శోకం, సగం మోదం చిట్టా రాసింది.

కలగా సాగినా, కలగా ముగిసినా,
మారనిది సుఖదుఖాల సంగమం.

నింగి భరిణెలో నింపిన నిశీధి
కంటి కాటుకగా కరిగినట్లు..

నేల ఒడిలో దాచిన మౌనం

మాటల తోటలో మొలకెత్తినట్లు..

పువ్వులు పొదిగిన వనాలు

నవ్వులుగా తరలివచ్చినట్లు..

బుసగొట్టే విషసర్పాలు

విషమఘడియలై కాటేసినట్లు..

కడలిలో జనించిన చలనం

జీవనంలో ఆర్తిగా పరావర్తించినట్లు..

చినుకుగా రాలే మబ్బులు,
మమతానురాగాలుగా ఎదని తడిపినట్లు..

కాలాన్ని తవ్వితే కలల ఇంధనం,
కాలాల నడుమ బ్రతుక్కి ఆలంబనం.

No comments:

Post a Comment