ఈ ఒక్కటీ చాలు, ఇంకొకటి వద్దేవద్దు...

మనిషిగా ఈ నాలుగునాళ్ళు,
నవరసాత్మకం నా జీవితం.

ఇజం, వాదం నా కొలమానం కాదు,
పరిపూర్ణం నా తుది ప్రమాణం.

అనుభూతి పరావర్తనం నా అనుభవం,
అనురాగ జలాశయం నా హృదయం.

అతిశయం, అభిమానం అతివ స్వంతం,
ఆమె ఉనికికి నేనూ ఒక అలంకారం.

మళ్ళీ ప్రకృతిలోకి రావాల్సివస్తే...
అడవిగా పుడతాను,
పుడమితో చెలిమి చేస్తాను.

కొండనై నిలుస్తాను,
కోటి పున్నముల్లో కాంతులీనుతాను.

నదినై నడుస్తాను,
కదలని గట్టుకి ఊసులు చెప్తాను.

తుమ్మెద నాదం అవుతాను,
విరిబాలల మురిపాల నవ్వునౌతాను.

కనపడిన కూన లోకి ఒదుగుతాను,
అనునిత్యం పసిదనపుపాటనౌతాను.

ప్రత్యూష కిరణమౌతాను,
వెన్నెలపువ్వుగానూ రాలతాను.

మృణ్మయ వీణనౌతాను,
కొనగోటితాకిడికి వేయిరాగాలు మీటుతాను.

ఋతువుగా తరలివస్తాను,
ప్రతి రోజూ పలకరిస్తాను.

కన్నియ కలని అవుతాను,
రంగుల హరివిల్లులో విహరింపచేస్తాను.

కాలాన్ని కొలిచే గడియారమౌతాను,
కదలిక, స్థంభన నేను నిర్దేశిస్తాను.

కళాకారుని కుంచెనౌతాను,
కనుమరుగవని చిత్రమౌతాను.

నాట్యకారుని అందియనౌతాను,
గంగమ్మ వరవడి నా చిరుసవ్వడిలో చూపుతాను.

వ్యాసకారుని తూలికనౌతాను,
సరస్వతి పూజకి పుష్పాలు సమర్పిస్తాను.

మనిషిగా మెలిగాక, మమతానురాగాలు తెలిసాక,
ఇంకేమి మిగిలింది ఏ రూపాన దర్శించినా?

నిండారా జీవం సృజించాక ఇంకో జన్మకేమి మిగిలిందని,
నవ్వే పరమాత్ముని పాదధూళినై మెరుస్తాను.
*******************************
నాకు గతం, వర్తమానం మీద వున్న నమ్మకం, గురి తప్పక భవిష్యత్ మీద పరావర్తిస్తాయని విశ్వాసం. సరైన సమయానికి తగు అవకాశం, అవసరం ఆ దేముడు కల్పిస్తాడు, తనకు మారుగా అనుబంధాలు యేర్పరుస్తాడనీ అనుభవం. కనుక మరోజన్మ కన్నా ముందే ఈ జీవితంలో స్ఫూర్తి వెదుక్కోవటం, లక్ష్యం సాధించుకోవటం నా నైజం... నేను ఆశాజీవిని. ఆశయాన్ని ఆదమరవనిదాన్ని. నాకు ఒక చట్రం, పరిధిలోకి ఒదగటం సాధ్యం కాదు కనుక.. ఆ పై కవిత.