నాణెం తిప్పితే..

రెప్పచెప్పని వూసులు,
మబ్బుతునకలుగ జారినట్లు..

రివ్వున ఎగిసిన పావురాయి
రెక్కబరువుకి కృంగినట్లు..

నిండుగ విరిసిన తురాయి
కొమ్మవూపుకి తూగినట్లు..

గుంపుగ ముసిరిన చివట్లు
ఆగ్గిసెగలో ఆహుతయినట్లు..

ఎర్రెర్రని వేకువ పొద్దు,
దిగులు అద్దుకుని కమిలినట్లు..

కనపడని సంకెళ్ళ సవ్వళ్ళు,
నిరపరాధ మానసాన స్వగతాలు..

జీవితనాణాన్ని తిప్పిచూస్తే చిత్రాలు,
శోకాలవిలయాలే ఆనందనిలయాలు..

వెన్నెల తాకి విచ్చిన కలువలు,
కొలను నట్టింట కాసులపేర్లు..

కొనవేరున తగిలే చిత్తడి,
పైరగాలుల పలుకరించే పుడమి..

అంగరదీపం చిమ్మే రవ్వలు,
తరగని ఆశకి చిరునామాలు..

నవ్వు చాటున పలకరింపులు,
నేలకి దిగివచ్చిన గంధర్వగానాలు..

కనిపించే రెక్కల రెపరెపలు,
తపించిన మనసుకి సాంత్వనలు..

**********************
అంగరదీపం -
embers, the smoldering remains of a fire