ఒక్క మనసుని...

పలుకు రాపిడికి పదును,
పదును సానకి పదము,
పదాలు పేర్చిన సాయుధాలు,
మనసుని పేల్చటానికి ఒక్కటి చాలు.

తలపు పోకడకి అదును,
అదును చూడని అలుసు,
అలుపెరుగని ఆలోచనలు,
మనసుని విరచటానికి ఒక్కటి చాలు.

పిలుపు అందని దూరం,
దూరాభారమెంచని పయనం,
పయనానికి చిక్కని గమ్యం,
మనసుని కలవరపరచను ఒక్కటి చాలు.

గెలుపు చూడని క్రీడ,
సాధన చేయని వినోదం,
వెసులుబాటు దక్కిన విలాసాలు,
మనసుని ఓడించటానికి ఒక్కటి చాలు.

మలుపు తిరిగే జీవితం,
జీవితాన జొరబడే ఎడబాట్లు,
మమతని తొలిచే కుమ్మరిపురుగులు,
మనసుని గుల్లచేయను ఒక్కటి చాలు.