జలతరంగిణి

చినుకు చక్కిలిగింతలతో
కులుకు హొయల తృళ్ళింతలు
ఎక్కడ నేర్చిందీ కొలను?
నాచు మీద లేఖ రాసి నవ్వుతోంది..
చేపపిల్ల చిరునామాలు వెదుకుతుంది..

గులకరాళ్ళ అందియలు కట్టి
మేని విరుపులే నర్తనలుగ అర్చన
ఎవరు చెప్పారీ నదికి?
నేల నుదుట ఒండ్రుతిలకాలు అద్దుతోంది..
గట్టుమీద చెట్టు పసుపుపూలు రాలుస్తోంది..

నది సవ్వడికి నివ్వెరపడి
అలల తాకిడితో సమరం
ఎందుకు చేస్తుందా కడలి?
విజయదరహాసాలు గవ్వలై ఒడ్డు బరువెక్కుతోంది..
దూరాన నావలో తెరచాప పతాకం ఎగురుతోంది..

ఊహల కొలను గుండె పట్టనంటూంటే,
అనుభూతి నదీనదాలు మానసాన పుడుతూనేవుంటే,
అనుభవసాగరాలు అనునిత్యం ఆటుపోటుగ సాగుతుంటే,
త్రిమూర్త జలనిధిలో లెక్కకందని ప్రదక్షిణాల తరించాను.

/***********************************/
జలతరంగిణి అంటే సాగరజలాల తరంగిత నాదం కావచ్చు, లేదా పింగాణీగిన్నెలో నీళ్ళు పోసి కర్రతో వాయించే సంగీతవాద్యం కావచ్చు.. నేను మొదటిది వాడుకున్నాను.