పిడుగులుగా పగిలిన ఆకాశం
నీలి ముసుగులో మొహం దాచుకుంది.
ఉరుమున జనించి,
మెరుపున ముగిసిన స్వరం
మౌనరాగం ఆలాపిస్తోంది..
ఆకుబొట్లుగా పొగిలిన తరువు
చివురు భాష్పాలు సిద్దం చేసుకుంటుంది.
మొగ్గగా వసివాడి,
చెదిరిన రెక్కల ముడిచిన పుష్పం
ఎండుటాకు చితిలో దహనమౌతుంది..
రాపిడిలో రాజుకున్న చెకుముకి నిప్పు
శవసంస్కారాన చల్లారింది.
గోతుల్లో,శవవాటికల్లో కయ్యలు,
ఉప్పునీరు ఆర్పలేని అగ్గి
యజ్ఞసమిధలు బుగ్గిచేస్తుంది..
పొంగులో పొర్లిన పాలచుక్క
కుండమీది మసితో సహవాసం చేస్తుంది.
గతపు కొట్లగదిలో రెక్కలిరిగిన గబ్బిలం,
మరపు వరాన్ని కాలరాచి మానసం,
శాపగ్రస్త గడువుల జపతపమొనరుస్తూవుంది..
No comments:
Post a Comment