పడుగుపేక

ఎండ, నీడా పరుచుకున్న
గరిక తివాచీ
తాకీతాకగానే
దృశ్యవ్యామోహానికి
గురిచేసింది
పరుగులు నేర్చి
ఇల్లంతా పీకిపందిరేసే పాపాయిలా
అల్లరి గాలి కొమ్మల నుంచి
ఆకులు, కాడలు తెంపిపోస్తూ ఉంది
సంబరాల్లో పులివేషగాడు
వెంటపడే ఆటకాయల్ని
సడలించి నవ్వుకున్నట్లు-
మారు వేషం వేసుకున్న
పులులు, చిరుతల్లా కొన్నిపూలు
అవే రూపురేఖలతో
నిలవరిస్తూ, నవ్వినట్లే ఊగుతున్నాయి
ధ్వజస్తంభపు గంటల్లా
చిటారుకొమ్మన ఎండుటాకులు
చిరుమోతలతో
అడవిదేవర గుడి దిక్కుకి మళ్లిస్తూ...
మాగిన పళ్లు,
విత్తుల పొత్తాలు విచ్చుకుని
రాలిపడుతున్నాయి.
గూడు దాటి కూనలు
వచ్చిపోయేవారిని
పలకరిస్తున్నాయి
బారులు తీరిన చీమలు,
వాగులు నిండిన నీటిధారలు
వడివడిగా సాగుతున్నాయి
తిరుగాడిన కోనలు,
తిరునాళ్ళగా సాగిన క్షణాలు
పడుగుపేకగా
మనసు మరొక అనుభవం అల్లుకుపోతూ ఉంది

No comments:

Post a Comment